Skip to main content

ఎంబీఏ చదవాలన్న తపనతోనే ఐసెట్‌లో టాప్ ర్యాంక్

ఒకవైపు డిగ్రీ.. మరోవైపు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకుపిపరేషన్.. ఐసెట్ రాసి ఎంబీఏ చదవాలన్న తపన.. అన్నిటికీ మించి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం.. ఐసెట్‌లో 154 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిపింది అంటున్నాడు టీఎస్ ఐసెట్-2016 టాపర్ గాజుల వరుణ్. ఆయన సక్సెస్ స్పీక్స్..
ఈ సంవత్సరం నిజాం కాలేజ్‌లో బీఎస్సీ (ఎంపీసీ) పూర్తయింది. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాను. మాది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. కాలేజీ చదువుకోసం హైదరాబాద్ వచ్చాను. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రిపరేషన్ ప్రారంభించాను. ఈ క్రమంలో ఇటీవల ఎస్‌ఎస్‌సీ-కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్షలో విజయం సాధించి, స్కిల్‌టెస్ట్‌కు ఎంపికయ్యాను. ఇప్పుడు ఐసెట్‌లో టాప్ ర్యాంకు రావడంతో ఎంతో ఆనందంగా ఉంది.

అమ్మ ప్రోత్సాహం, బంధువుల ఆదరణ
నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు నాన్న అనారోగ్యంతో మరణించారు. అమ్మ చంద్రకళ బీడీ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. నాన్న లేని లోటు తెలియకుండా పిల్లలను చదివించాలని అనుకుంది. ఆమె తపనకు తగినట్లుగానే మేం చదువులో రాణించాం. అన్నయ్య ఒక ప్రైవేటు బ్యాంక్‌లో పని చేస్తున్నాడు. తమ్ముడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. చదువుపై మా ఆసక్తిని గమనించి, బాబాయిలు ఆర్థిక చేయూత అందించారు.

ఫీజులు లేకుండా చదువులు:
చిన్నప్పటి నుంచి క్లాస్‌లో మంచి ప్రతిభ చూపడంతో సిరిసిల్లలోని ఒక ప్రైవేట్ స్కూల్ పదో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పించింది. అందులో వచ్చిన మార్కులకు (563) కరీంనగర్‌లోని మరో ప్రైవేటు కళాశాలలో ఫ్రీ అడ్మిషన్ లభించింది. ఇంటర్మీడియెట్‌లోనూ మంచి మార్కులే (979) వచ్చాయి. ఆ తర్వాత నిజాం కాలేజ్ (హైదరాబాద్) లో బీఎస్సీ ఎంపీసీలో సీటు లభించింది.

ఒకవైపు డిగ్రీ.. మరోవైపు పోటీ పరీక్షలకు:
ఒకవైపు బీఎస్సీ చదువుతూనే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో నియామక పరీక్షలకు సన్నద్ధమయ్యాను. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా ఇంటర్మీడియెట్ అర్హతతోనే నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్‌కు శిక్షణ తీసుకున్నాను. ఎస్‌ఎస్‌సీ ప్రిపరేషన్‌తోనే ఐసెట్‌కు కూడా సన్నద్ధమయ్యాను. రెండింటి సిలబస్ ఒకే మాదిరిగా ఉండటం ఎంతో కలిసొచ్చింది. దీనికి తోడు ఎంపీసీ గ్రూప్ కావడం వల్ల ఐసెట్‌లోని ప్రాబ్లమ్ సాల్వింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, డెసిషన్ మేకింగ్ విభాగాలు సులువుగా పూర్తిచేయగలిగాను.

పూర్తిస్థాయిలో వారం రోజులు:
ఐసెట్ కోసం ప్రత్యేకంగా, పూర్తిస్థాయిలో పరీక్షకు ముందు వారం రోజులను కేటాయించాను. ఈ సమయంలో పాతప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేశాను. వెయిటేజీ ఎక్కువ ఉన్న అంశాలపై దృష్టిసారించాను. టైం మేనేజ్‌మెంట్, చదివిన అంశాలను ప్రాక్టీస్ చేయడం.. ఇవే ఐసెట్‌లో విజయానికి దోహదం చేస్తాయి. మ్యాథమెటిక్స్ సంబంధిత అంశాల కోసం పదో తరగతి స్థాయి పుస్తకాల్లోని అంశాలను ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్‌లకు హాజరవడం లాభిస్తుంది.

లక్ష్యం..సివిల్ సర్వీసెస్ :
ఓయూ క్యాంపస్ కళాశాలలో ఎంబీఏ పూర్తిచేసి.. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ సాధించడం నా లక్ష్యం. ఈలోపు పోటీపరీక్షలకు హాజరవుతా. ప్రస్తుతం ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ లక్ష్యంగా కృషిచేస్తున్నాను. ఒకవేళ సీహెచ్‌ఎస్‌ఎల్ స్కిల్‌టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగం వస్తే దానికే నా తొలి ప్రాధాన్యం.
Published date : 01 Jun 2016 12:27PM

Photo Stories