Skip to main content

యూపీఎస్సీ, ఎస్సెస్సీ, టీఎస్‌పీఎస్సీ... పరీక్షలు వాయిదా!

సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రభావం ప్రవేశ పరీక్షలే కాదు ఉద్యోగ పరీక్షలపైనా పడింది.

యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ), తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించాల్సిన వివిధ ఉద్యోగ పరీక్షలు, ఇంటర్వ్యూలను వాయిదా వేశాయి. టీఎస్‌పీఎస్సీ అయితే వివిధ శాఖలతో సంప్రదింపులను కూడా రద్దు చేసుకుంది.

వాయిదా పడిన యూపీఎస్సీ పరీక్షలు
మార్చి23 నుంచి మొదలుకొని వచ్చే నెల చివరకు వివిధ విభాగాల్లో నిర్వహించాల్సిన సైంటిస్ట్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ డెరైక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితర 12 రకాల ఉద్యోగ పరీక్షలను యూపీఎస్సీ వాయిదా వేసింది. వచ్చే నెల 3 వరకు నిర్వహించాల్సిన సివిల్స్ ఇంటర్వ్యూలను వాయిదా వేసింది.

ఎస్‌ఎస్‌సీ వాయిదా వేసినవి
ఎన్‌ఐఏ, సీఏపీఎఫ్ కానిస్టేబుల్స్ (జీడీ), ఎస్‌ఎస్‌ఎఫ్, రైఫిల్ వ్యూన్ ఇన్ అస్సాం రైఫిల్స్‌లో ఈనెల 24 నుంచి వచ్చే నెల 30 వరకు నిర్వహించాల్సిన రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్స్ ను (ఆర్‌ఎంఈ) స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) వాయిదా వేసింది. వాటితోపాటు సీఏపీఎఫ్ కానిస్టేబుల్స్ (జీడీ), ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్ వ్యూన్ పోస్టులకు ఈనెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు నిర్వ హించాల్సిన డీటేయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ను (డీఎంఈ) వాయిదా వేసింది. ఢిల్లీ పోలీసు విభాగంలో ఎస్‌ఐ, సీఏపీఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌లో ఏఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఈనెల 30 వరకు నిర్వహించాల్సిన డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ పరీక్షలను వాయిదా వేసింది. వీటితోపాటు కంబైన్‌‌డ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (లెవల్-1) పరీక్షలను, అలాగే ఈనెల 30 నుంచి నిర్వహించాల్సిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేసింది.

టీఎస్‌పీఎస్సీ పరీక్షలు..
రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ పలు పరీక్షలను వాయిదా వేసింది. ఈనెల 27 నుంచి 30 వరకు ఆల్ ఇండియా సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్ వారికి నిర్వహించాల్సిన హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ టెస్టు పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. మరోవైపు కరోనా అదుపులోకి వచ్చే వరకు ఎలాంటి పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించవద్దని నిర్ణయించింది. వివిధ శాఖలతో నిర్వహించాల్సిన సమావేశాలన్నింటినీ రద్దు చేసుకుంది. వివిధ శాఖలతో ఈ-మెయిల్ ద్వారానే సంప్రదింపులు జరపాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది.

Published date : 30 Mar 2020 03:36PM

Photo Stories