వైఎస్సార్ ‘ఆర్కిటెక్చర్’ వర్సిటీలో2021 ప్రవేశాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ తొలిసారిగా వివిధ కోర్సుల్లోకి ప్రవేశాలు నిర్వహిస్తోంది.
2020-21 విద్యా సంవత్సరానికి గాను బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడీఈఎస్- ఇంటీరియర్ డిజైన్), బీఎఫ్‌ఏ (పెయింటింగ్), బీఎఫ్‌ఏ(శిల్పం), బీఎఫ్‌ఏ (అప్లయిడ్ ఆర్‌ట్స), బీఎఫ్‌ఏ (యానిమేషన్), బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 10న పరీక్ష నిర్వహించనుంది. దరఖాస్తులకు ఈనెల 30 వరకు గడువిచ్చింది. బీడీఈఎస్, బీఎఫ్‌ఏ (యానిమేషన్)లలో 60 చొప్పున సీట్లుండగా, మిగిలిన కోర్సుల్లో 40 చొప్పున సీట్లున్నాయి. నాలుగేళ్ల కాలపరిమితితో ఈ కోర్సుల్లో ప్రవేశాలకు తొలిసారిగా ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(ఏడీసెట్) నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.విజయకిశోర్ తెలిపారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు ఈ కోర్సులు ఉపయుక్తమని పేర్కొన్నారు. http://sche.ap.gov.in/ADCET లేదా www.ysrafu.ac.in వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలనిసూచించారు.
Published date : 29 Jan 2021 02:50PM