Skip to main content

ఉపాధ్యాయ నియామకాల్లో రిజర్వేషన్లు 50% దాటరాదు : సుప్రీం కోర్డు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనులకు ఉపాధ్యాయ నియామకాల్లో వంద శాతం రిజర్వేషన్లు వర్తింపజేయడం చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని గతంలోనే సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేసింది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఇప్పటివరకు జరిగిన నియామకాలకు మాత్రం రక్షణ ఇస్తున్నామని, ఏపీ, తెలంగాణలోని షెడ్యూల్డ్ ఏరియాల్లో నియామకాలు ఇదేరీతిలో పునరావృతమైతే ఇప్పటివరకు జరిగిన నియామకాలకు కూడా రక్షణ ఉండదని హెచ్చరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ చేబ్రోలు లీలాప్రసాదరావు, ఇతరులు 2002లో దాఖలు చేసిన సివిల్ అప్పీలును జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి బుధవారం 152 పేజీల తీర్పు వెలువరించింది.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1986లో షెడ్యూల్డు ఏరియాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబరు 275 జారీ చేసింది. 1989లో ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ ఈ ఉత్తర్వులను రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో 1998లో దీన్ని కొట్టివేస్తూ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతిచ్చింది.
  • తిరిగి 2000 జనవరిలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది. పరిపాలన ట్రిబ్యునల్ దీన్ని కొట్టివేయగా హైకోర్టు జీవోను సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ దాఖలైంది.
Published date : 23 Apr 2020 03:59PM

Photo Stories