Skip to main content

టీఎస్‌ లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్‌ – 2021 పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎప్పుడెప్పుడంటే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్‌ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
ఆగస్టులో ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను గతంలోనే ఖరారు చేయగా, తాజాగా లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్‌ తేదీలను బుధవారం ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్‌–2021 పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. 19వ తేదీన రెండు సెషన్లలో, 20వ తేదీన ఒక సెషన్ లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఏప్రిల్‌ 3వ తేదీన ప్రవేశాల కమిటీ జారీ చేస్తుందని, ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తుందని వెల్లడించారు. లాసెట్‌ –2021 ఆగస్టు 23వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మూడేళ్లు, ఐదేళ్లు, పీజీ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు వివరించారు. ఇందుకోసం ఈనెల 24వ తేదీన నోటిఫికేషన్ ను ప్రవేశాల కమిటీ విడుదల చేస్తుందని, దరఖాస్తుల స్వీకరణను అదే రోజునుంచి ప్రారంభించి మే 26వ తేదీ వరకు ఆలస్య రుసుము లేకుండా స్వీకరిస్తుందని పేర్కొన్నారు. అలాగే ఎడ్‌సెట్‌–2021 పరీక్షలను ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 24వ తేదీన రెండు సెషన్లలో, 25వ తేదీన ఒక సెషన్ లో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన ప్రవేశాల కమిటీ నోటిఫికేషన్ ను జారీ చేస్తుందని, ఈనెల 24వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తుందని తెలిపారు. పీఈసెట్‌ –2021 ఫిజికల్‌ ఎఫిషియెన్సీ పరీక్ష జూన్ 7న ఉంటుందని, విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైతే మరిన్ని రోజులు పరీక్షలు ఉంటాయన్నారు. దీనికోసం దరఖాస్తుల స్వీకరణను సెట్‌ కమిటీ ప్రారంభించిందని, మే 8వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. అన్ని సెట్స్‌ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారానే సెట్‌ కమిటీలు స్వీకరిస్తాయని వివరించారు.
Published date : 11 Mar 2021 03:48PM

Photo Stories