టీఎస్ ఎడ్‌సెట్ 2021: ఈసారి అన్ని సబ్జెక్టుల వారికీ ఒకే ప్రశ్నపత్రం..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ చర్యలు మొదలయ్యాయి.
భవిష్యత్తులో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులనే ప్రవేశపెట్టాలన్న ఆదేశాలతో పాటు ఉపాధ్యాయ విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలోనూ సమూల మార్పులు ఎన్సీటీఈ సూచించింది. వీటి అమలులో భాగంగా 2021–22 విద్యా సంవత్సరంలో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చే ఆగస్టులో నిర్వహించబోయే ఎడ్‌సెట్–2021 పరీక్ష ప్రశ్నపత్రంలో ఉన్నత విద్యామండలి మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటివరకు సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్ మెథడాలజీ ప్రకారం ఆయా సబ్జెక్టుల్లో వేర్వేరు ప్రశ్నపత్రాలతో ప్రవేశపరీక్షను నిర్వహించగా, ఇకపై అలా ఉండదు. అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్నపత్రాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఏ సబ్జెక్టులో బీఎడ్ చేయాలనుకునే విద్యార్థులకైనా కామన్ పేపర్‌తోనే ప్రవేశపరీక్షను నిర్వహించనుంది. దీంతో విద్యార్థులకు చాయిస్ పెరుగనుంది. అందరికీ ఒకటే పరీక్ష ఉంటుంది కాబట్టి.. బీఎస్‌సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన విద్యార్థి బీఎడ్‌లో గణితం లేదా భౌతికశాస్త్రం మెథడాలజీని ఎంచుకోవచ్చు. బీజెడ్‌సీ విద్యార్థులు జీవశాస్త్రంతో పాటు రసాయనశాస్త్రం తీసుకోవచ్చు. బీఏ చదువుకున్న విద్యార్థులు కూడా పదో తరగతి స్థాయి కలిగిన గణితం, సైన్స్ సబ్జెక్టులపై ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇలా పదో తరగతి వరకు అన్ని ప్రధాన సబ్జెక్టులపై పట్టును పరీక్షించేలా ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మార్పులు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టింది. ఇందులో టీచింగ్ ఆప్టిట్యూడ్‌తో పాటు గణితం, సైన్స్, సోషల్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జి, ఎడ్యుకేషనల్ ఇష్యూస్‌తో పాటు కంప్యూటర్ అవేర్‌నెస్ వంటి అంశాలపైనా ప్రశ్నలను ఇవ్వనుంది. దీనిపై ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20వ తేదీన ఎడ్‌సెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో ఆలోగా ప్రభుత్వం నుంచి ఆమోదం పొందేలా చర్యలు చేపడుతోంది. మరోవైపు మార్చి 24వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించనుంది.
ఎడ్‌సెట్‌లో సబ్జెక్టులు/మార్కుల విధానం
ఎడ్‌సెట్‌లో సబ్జెక్టులు/మార్కుల విధానం
సబ్జెక్టులు | ప్రశ్నలు/మార్కులు |
గణితం, సైన్స్, సోషల్ | 60 |
టీచింగ్ ఆప్టిట్యూడ్ | 20 |
జనరల్ ఇంగ్లి‹Ù | 20 |
జీకే, ఎడ్యుకేషనల్ ఇష్యూస్ | 30 |
కంప్యూటర్ అవేర్‌నెస్ | 20 |
మొత్తం | 150 |
Published date : 03 Mar 2021 05:42PM