Skip to main content

రేపటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు.. అరగంట ముందే గేట్లు బంద్!

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యాసంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌ను సెప్టెంబర్ 1 నుంచి ఆరో తేదీ వరకు 12 విడతల్లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చర్యలు చేపట్టింది.

మొదటి రోజు రెండు విడతల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్)లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌ను నిర్వహించనుంది. 2 నుంచి 6వ తేదీ వరకు బీటెక్‌లో ప్రవేశాలకు పది విడతల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు రాష్ట్రంలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. 67,319 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. గత జనవరి జేఈఈ (1,00,129 మంది) కంటే ఈసారి జేఈఈ రాసే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఇక పరీక్ష సమయం అరగంట ముందే (గేట్లు మూసి వేస్తారు) విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరు కోవాలని, పరీక్ష కేంద్రం గేట్లు మూసివేసిన తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతిం చేది లేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే పరీ క్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 7:20 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తామని, 8:30 గంటలకు గేట్లు మూసివేస్తా మని పేర్కొంది. మధ్యాహ్నం పరీక్షకూ ఇదే విధానం అమలు చేస్తామని వివరించింది.

డిక్లరేషన్ తప్పనిసరి...
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన అడ్మిట్‌కార్డులోని కోవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ (అండర్ టేకింగ్)లో వివరాలు నమోదు చేయాలని పేర్కొంది. దానిపై ఫొటో అంటించి సంతకంతో పాటు ఎడమ చేతి బొటన వేలిముద్ర కూడా వేయాలని, అందులో 14 రోజులుగా తనకు జ్వరం, దగ్గు, గొంతు సమస్యలు, శ్వాస సమస్యలు, శరీర నొప్పులు లేవని పేర్కొనాలని వివరించింది. అభ్యర్థుల కోసం పరీక్ష కేంద్రంలో అందుబాటులో శానిటైజర్లు ఉంచుతామని.. వాటర్ బాటిల్, బాల్‌పెన్, 50ఎంఎల్ శానిటజర్ బాటిల్‌ను వెంట తెచ్చుకున్నా అనుమతిస్తామంది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ ఇస్తామని, అప్పటి వరకూ ధరించిన మాస్క్‌ను తీసేసి కొత్త మాస్క్ ధరించాలని పేర్కొంది. విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్‌తోపాటు నిబంధనల్లో పేర్కొన్న ఏదేనీ గుర్తింపు కార్డు, పాస్ పోర్టు సైజు ఫొటో వెంట తెచ్చుకోవాలని వివరించింది. అంతేగాక ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి చెప్పింది. బీఆర్క్ అభ్యర్థులు డ్రాయింగ్ టెస్ట్ కోసం జామెట్రీ బాక్స్ సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్ పెన్సిల్స్ లేదా క్రేయాన్స్ తెచ్చుకోవాలని, రఫ్ వర్క్ కోసం ప్రతి సీటు వద్ద ఏ4 సైజ్ తెల్లకాగితాలు ఐదు అందుబాటులో ఉంటాయని, అవసరమైతే అదనంగా ఇస్తామని వెల్లడించింది.

Published date : 31 Aug 2020 04:56PM

Photo Stories