రేపే జేఈఈ అడ్వాన్స్ డ్..పరీక్ష కేంద్రాల్లో హాల్‌టికెట్ ఇవ్వకపోతే అనర్హతే!
ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి పలు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్ష రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. విద్యార్థులు రెండు పరీక్షలకూ హాజరు కావాలని పేర్కొంది. పేపరు-2 పరీక్ష ప్రారంభమయ్యాక హాల్‌టికెట్‌ను(అడ్మిట్‌కార్డులు) ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఇవ్వకపోతే వారిని అనర్హులుగా ప్రకటిస్తామని వెల్లడించింది. మొదటిసారిగా ఈ నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష పూర్తయ్యాక హాల్‌టికెట్‌ను వెంట తెచ్చుకోకూడదు. అలాగే విద్యార్థులు తమకు కరోనా లక్షణాలు లేవని పేర్కొంటూ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం కూడా అందజేయాలని స్పష్టం చేసింది. గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని, అయితే, నిర్దిష్ట సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని పేర్కొంది. హాల్‌టికెట్‌తోపాటు ఓటర్ ఐడీ/ఆధార్ వంటి గుర్తింపు కార్డు (ఒరిజినల్) వెంట తెచ్చుకోవాలని పేర్కొంది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లో శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నా, సొంతంగా చిన్న శానిటైజర్ బాటిల్, ప్లెయిన్ వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలని, అలాగే కచ్చితంగా మాస్కు ధరించాలని సూచించింది.
రాష్ట్రంలో 15 కేంద్రాలు..
జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను రాష్ట్రంలోని 15 పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిర్వహించేందుకు ఢిల్లీ ఐఐటీ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
అక్టోబర్ 5న ఫలితాలు
జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలను వచ్చే నెల 5న విడుదల చేసేలా షెడ్యూలు సిద్ధం చేసింది. అలాగే వచ్చే నెల 8న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్టు (ఏఏటీ) నిర్వహిస్తామని, 11న వాటి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది.