పాలిటెక్నిక్ ప్రవేశాల్లో.. మొదటి విడతలో 71.14% మందికి సీట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో 22,064 మంది (71.14శాతం) విద్యార్థులకు సీట్లు లభించాయి. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2020 పరీక్షను ఈ నెల 2న ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్వహించింది.
ఇటీవల ప్రవేశాల కౌన్సెలింగ్ జరిపింది. రాష్ట్రంలో మొత్తం 128 కాలేజీలు ఉండగా, వాటిలో 31,012 సీట్లు అందుబాటు లో ఉన్నాయి. మొదటి విడతలో 22,064 సీట్లు భర్తీ కాగా, 8,948 మిగిలాయి. ఈ సీట్ల కేటాయింపును కళాశాల, సాం కేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. సీట్లు లభించిన విద్యార్థులు తమ వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, ట్యూషన్ ఫీజు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా ఈ నెల 26లోగా చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే వెబ్‌సైట్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అప్పుడు సీటు కన్‌ఫర్మ్ అవుతుందన్నారు. ఆ తరువాత జాయినింగ్ రిపోర్టు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ట్యూషన్ ఫీజు చెల్లించిన తరువాత విద్యార్థులు సీటు వద్దనుకుంటే ఈ నెల 27లోగా ఆన్‌లైన్ ద్వారా రద్దు చేసుకోవచ్చని వెల్లడించారు. పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చే నెల 7నుంచి ప్రారంభం అవుతాయని, 14 వరకు విద్యార్థులకు ఓరియెంటేషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 15 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు.
Published date : 24 Sep 2020 04:15PM