Skip to main content

నవంబర్ 19న ఇంజనీరింగ్‌లో ఇంటర్నల్ స్లైడింగ్

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉన్న బ్రాంచీల్లోకి మారేందుకు ఈనెల 19న ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
ఇటీవల ప్రకటించిన చివరి దశ ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ పూర్తయ్యాక కన్వీనర్ కోటాలోని 70,120 సీట్లలో 50,844 సీట్లు భర్తీ అయ్యాయి. వివిధ బ్రాంచీల్లో 19,276 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇందులో కొత్త కోర్సుల్లోనూ సీట్లు మిగిలిపోయాయి. అయితే విద్యార్థులు తాము సీటు పొందిన కాలేజీలో తమకు ఇష్టమైన బ్రాంచీలో సీట్లు ఖాళీగా ఉంటే కాలేజీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ఆయా సీట్లను పొందవచ్చని ప్రవేశాల కమిటీ అధికారులు పేర్కొన్నారు. అయితే అలా సీట్లు మార్చుకున్న వారికి (కొత్త సీట్ల ఫీజులో) ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని స్పష్టం చేశారు. ముందుగా సీటు వచ్చిన కోర్సుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించి, ఇంటర్నల్ స్లైడింగ్‌లో సీటు మారితే ఆ రీయింబర్స్‌మెంట్ వర్తించదని, మొత్తం ఫీజును విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అందుకు సిద్ధమైన విద్యార్థులు మాత్రమే ఇంటర్నల్ స్లైడింగ్‌లో బ్రాంచీ మార్చు కోవాలని సూచించారు. మరోవైపు ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను ఎంసెట్ ప్రవేశాల కమిటీ జారీ చేసింది. యాజమాన్యాలు ఈనెల 23లోగా స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
Published date : 17 Nov 2020 02:30PM

Photo Stories