నీట్ - 2020లో తెనాలి అమ్మాయికి జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు
శుక్రవారం విడుదల చేసిన నీట్ ఫలితాల్లో సింధు జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించగా, ఉమెన్ కేటగిరీలో 4వ ర్యాంకు సొంతం చేసుకుంది. అదేవిధంగా ఏపీలో మొదటి ర్యాంకర్‌గా నిలిచింది. నీట్‌లో 720 మార్కులకుగాను సింధూకు 715 మార్కులు వచ్చాయి. అలాగే కొట్టా వెంకట్ జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించగా, భవం మానస 16వ ర్యాంకు సాధించింది. జాతీయ స్థాయిలో టాప్ 50లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 8 మంది ఉన్నారు. 62,051 నీట్‌కు నమోదు చేసుకోగా 57,721 మంది పరీక్ష రాశారు. ఇందులో 33,841 (58.63 శాతం) మంది అర్హత సాధించారు.
టాప్-10లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు
నీట్‌లో హైదరాబాద్‌కు చెందిన తుమ్మల స్నిఖిత జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు, తెలంగాణలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటింది. టాప్ 10 జాతీయ ర్యాంకుల్లో ఆ రాష్ట్ర విద్యార్థులు ముగ్గురు ఉండగా, టాప్ 50 ర్యాంకుల్లో ఏకంగా ఏడుగురు ఉన్నారు. అనంత పరాక్రమ (11వ ర్యాంకు), బారెడ్డి సాయి త్రిషా రెడ్డి (14వ ర్యాంకు), శ్రీరామ్ సాయి శాంతవర్ధన్ (27వ ర్యాంకు), ఆర్షశ్ అగర్వాల్ (30వ ర్యాంకు), మల్లేడి రుషిత్ (33వ ర్యాంకు), ఆవుల సుభాంగ్ (38వ ర్యాంకు) సాధించారు. బాలికల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన నిత్య దినేష్ (ఆలిండియా 58వ ర్యాంకు) 17వ స్థానాన్ని పొందారు. ఎయిమ్స్, జిప్‌మర్ సహా అన్ని ప్రముఖ మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచి నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేయనున్నారు.
డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చుకుని..
ఎంసెట్ (మెడికల్/అగ్రికల్చర్)లో స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో మెరిసిన తెనాలికి చెందిన గుత్తి చైతన్య సింధు నీట్‌లో జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు సాధించింది. తన తల్లిదండ్రుల్లాగే డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చుకునే అవకాశం దక్కించుకుంది. తెనాలికి చెందిన ప్రముఖ వైద్యుడు, స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాల రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం మనుమరాలైన చైతన్య సింధు తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. తండ్రి.. డాక్టర్ కోటేశ్వరప్రసాద్ ఈఎన్‌టీ, ఎనస్థీషియా నిపుణుడు కాగా తల్లి డాక్టర్ సుధారాణి గైనకాలజిస్ట్. సింధు.. టెన్త్ లో ఏ1 గ్రేడ్‌తో, ఇంటర్‌లో 98 శాతంతో ఉత్తీర్ణురాలైంది.
ఏపీలో | సీట్లు.. |
ప్రభుత్వ వైద్యకాలేజీల్లో ఎంబీబీఎస్ | 2,185 |
ప్రై వేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ | 2,400 |
ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో | 140 |
ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో | 1,300 |
ప్రభుత్వ హోమియో కాలేజీల్లో | 120 |
ప్రైవేటు హోమియో కాలేజీల్లో | 200 |
ప్రభుత్వ కాలేజీల్లో ఆయుర్వేద | 56 |
ప్రైవేటులో నేచురోపతి | 200 |
ప్రభుత్వ కాలేజీల్లో యునాని | 50 |
జాతీయ స్థాయిలో సీట్లు ఇలా..
ఎంబీబీఎస్ సీట్లు | 80,055 |
బీడీఎస్ సీట్లు | 26,949 |
ఎయిమ్స్ కళాశాలల్లో | 1,205 |
జిప్‌మెర్‌లో సీట్లు | 200 |
వెటర్నరీ సీట్లు | 525 |
ఆయుష్ సీట్లు | 52,720 |