Skip to main content

‘లా’ విద్యార్థులు ఆకాశమే హద్దుగా రాణించాలి..

సబ్బవరం (పెందుర్తి): దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ) విద్యార్థులు న్యాయవాదులుగా ఆకాశమే హద్దుగా రాణించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ ఆకాంక్షించారు.
విశాఖపట్నం సబ్బవరంలోని ఆ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఏఫ్రిల్‌ 4వ తేదీన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వర్చువల్‌ విధానంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడుతూ గత సంవత్సరం కోవిడ్‌ కారణంగా రద్దయిన స్నాతకోత్సవాన్ని మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ ఏడాది జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. సంజీవయ్య ఔన్నత్యాన్ని, నిస్వార్థ సేవలను కొనియాడారు. ప్రస్తుతం దేశంలో 3.8 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దేశంలో 1,500 కళాశాలలు, 23 న్యాయ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులు ఈ వృత్తిలోకి వస్తున్నారని చెప్పారు. విద్యను అభ్యసించే సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొనేవారిమని తెలిపారు. ప్రస్తుతం న్యాయ విద్యార్థులకు అనేక అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వర్సిటీ కులపతి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి విద్యార్థుల డిగ్రీలను ప్రకటించారు. 4, 5, 6, 7వ స్నాతకోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు మొత్తం రెండు ఎల్‌ఎల్‌డీ డిగ్రీలు, నాలుగు పీహెచ్‌డీ, 28 ఎల్‌ఎల్‌ఎం, 418 ఎల్‌ఎల్‌బీ డిగ్రీలను ప్రకటించారు. ముందుగా వర్సిటీ ఉపకులపతి ఆచార్య డాక్టర్‌ ఎస్‌.సూర్యప్రకాష్‌ వార్షిక నివేదికను సమర్పించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య డాక్టర్‌ మధుసూదనరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Published date : 05 Apr 2021 05:29PM

Photo Stories