Skip to main content

జూలైలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోతే..రెండు రోజుల్లో మీ నిర్ణయం చెప్పండి: సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్మీడియట్‌ పరీక్షలను సమర్థంగా నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
తగిన భద్రత ప్రొటోకాల్‌ పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. పదో తరగతి ఫలితాలు గ్రేడ్‌ రూపంలో ఇవ్వడం వల్ల సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈల మాదిరిగా పరీక్షలు రద్దుచేసి ఫలితాలు ప్రకటించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

ఏపీ ఇంటర్మీడియట్‌– 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, బిట్‌ బ్యాంక్స్, ఈ బుక్స్, మోడల్‌ క్వశ్చన్‌ పేపర్లు, కెరీర్‌ గైడెన్స్‌.. ఇతర అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

12వ తరగతి పరీక్షలు రద్దుచేస్తూ సీబీఎస్‌ఈ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు, 12వ తరగతికి సంబంధించి ఇతరత్రా పిటిషన్లపై జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా 12వ తరగతి పరీక్షలు నిర్వహించాలనే ప్రభుత్వం భావిస్తోందని ఏపీ తరఫు న్యాయవాది మెహ్‌ఫూజ్‌ నజ్కీ కోర్టుకు తెలిపారు. పదో తరగతి పరీక్షల ఫలితాలు గ్రేడ్‌లలో ఇస్తారని, ఈ నేపథ్యంలో వాటి ఆధారంగా 12వ తరగతి పరీక్షల ఫలితాలు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. పరీక్షలు సమర్థంగా నిర్వహించగలమని భావిస్తున్నామని, జూలై మొదటి వారంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ జూలైలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన ధర్మాసనం ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇప్పుడే ఎందుకు నిర్ణయం తీసుకోకూడదని అడిగింది. విద్యార్థులను అనిశ్చితి పరిస్థితిలోకి నెట్టకూడదని, తుది నిర్ణయం రెండు రోజుల్లో తీసుకోవాలని పేర్కొంది.

ఏపీ పదో తరగతి – 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, బిట్‌ బ్యాంక్స్, ఈ బుక్స్, మోడల్‌ క్వశ్చన్‌ పేపర్లు, కెరీర్‌ గైడెన్స్‌.. ఇతర అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారని ప్రశ్నించగా.. 5 లక్షలమంది విద్యార్థులున్నారని నజ్కీ తెలిపారు. వీరందరికీ పరీక్షలు సమర్థంగా నిర్వహించగలమని ప్రభుత్వం నమ్మకంతో ఉందా అని ప్రశ్నించగా.. అవసరమైన భద్రత ప్రొటోకాల్‌ పాటిస్తున్నామన్నారు. ఒక గదిలో 15 మందికి మించకుండా విద్యార్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మిగతా రాష్ట్రాల కంటే నమ్మకంతో ఉంటే కారణాలను అఫిడవిట్‌ రూపంలో తెలపాలని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి సూచించారు. ఒకవేళ ఎవరి ప్రాణాలకైనా ముప్పు వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతగా గుర్తిస్తామని జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ వ్యాఖ్యానించారు. బుధవారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ గురువారం చేపడతామని పేర్కొంది.
Published date : 23 Jun 2021 02:12PM

Photo Stories