Skip to main content

జేఈఈ, నీట్‌ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకే ప్రమాదం: విద్యావేత్తలు

న్యూఢిల్లీ: జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణపై ఉద్రిక్త కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న వేళ పరీక్షలు ఎలా పెడతారని కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడవద్దని విపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా పరీక్షల నిర్వహణ చేపట్టాలంటూ వివిద కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా ప్రమాదం ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని లేఖలో కోరారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన లక్షలాది విద్యార్థులు తదుపరి చర్యల కోసం ఎదురుచూస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ వారి కలలను చిదిమేయకూడదని లేఖలో పేర్కొన్నారు. కొందరు నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని లేఖలో తెలిపారు.
చదవండి: జేఈఈ మెయిన్ కి ప్రిపేర్ అవుతున్నారా.. స‌త్తా చాటే మార్గం ఇదిగో..

అంతేకాక తగిన జాగ్రత్తలతో షెడ్యూల్‌ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని.. జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణను పూర్తిగా సమర్థిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఈ లేఖలో సంతకం చేసిన వారిలో ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇగ్నో, లక్నో విశ్వవిద్యాలయం, జేఎన్‌యూ, బీహెచ్‌యూ, ఐఐటీ ఢిల్లీకి చెందిన విద్యావేత్తలతో పాటు లండన్‌ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, హిబ్రూ విశ్వవిద్యాలయం, జెరూసలేం విశ్వవిద్యాలయం, ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న భారతీయ విద్యావేత్తలు కూడా ఉన్నారు. పరీక్షల నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి తమపై తీవ్ర ఒత్తిడి ఉన్నదని, వారి కోరిక మేరకు జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ వెల్లడించారు.

జేఈఈమెయిన్2020 గెడైన్స్, స్టడీ మెటీరియల్, ప్రాక్టీస్ టెస్ట్స్, బిట్‌బ్యాంక్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.


నీట్ 2020 గెడైన్స్, స్టడీ మెటీరియల్, ప్రాక్టీస్ టెస్ట్స్, బిట్‌బ్యాంక్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.

పరీక్షకు సంబంధించి ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. కాగా, సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలను నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల పెంపుతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను 570 నుంచి 660కి, నీట్ కేంద్రాలను 2546 నుంచి 3843కి పెంచారు. షిఫ్ట్‌ల సంఖ్యను కూడా 8 నుంచి 12 పెంచి.. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే వారి సంఖ్యను 1.32 లక్షల నుంచి 85వేలకు తగ్గించారు. కాగా, దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు 8.58 లక్షల మంది విద్యార్థులు, నీట్‌కు 15.97 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
Published date : 27 Aug 2020 11:55AM

Photo Stories