Skip to main content

జేఈఈ మెయిన్స్ తొలిరోజు ప్రశాంతంగా!

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి.

తొలిరోజు ప్రశాంతంగానే జరిగినా కోవిడ్ కారణంగా సరైన రవాణా సదుపాయాలు లేకపోవడంతో కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈనెల 6 వరకు పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 8.5 లక్షల మంది పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోగా 660 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 52 కేంద్రాల్లో 82,748 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.

కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ...

  • ఏటా రెండు విడతల్లో (జనవరి, ఏప్రిల్) పరీక్షలను నిర్వహిస్తుండగా కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ రెండో విడత పరీక్షలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు.
  • జనవరిలో పరీక్షలకు 1,29,100 మంది రిజిస్టర్ చేసుకోగా 69 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. తొలివిడతతో పోలిస్తే ఈసారి పరీక్షలకు 35 శాతం మేర అభ్యర్థులు తగ్గారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఒక సెషన్‌గా, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్‌గా నిర్వహిస్తున్నారు.


గతంలో 8 సెషన్లు మాత్రమే ఉండగా ఈసారి 12కి పెంచారు.

  • కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం అభ్యర్థులను దూరదూరంగా ఉంచి లోపలకు అనుమతించడం, భౌతిక దూరం ఉండేలా కూర్చోబెట్టడం, సీట్ల వద్ద శానిటైజేషన్ కారణంగా కొన్ని కేంద్రాల్లో పరీక్ష కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.
  • పతి చోటా మాస్కులు అందచేసి థర్మల్‌స్క్రీనింగ్ అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.
  • తొలిరోజు బీఆర్క్, ప్లానింగ్ పేపర్ పరీక్షను నిర్వహించారు. బుధవారం నుంచి బీఈ, బీటెక్ కోర్సుల ప్రవేశాలకు పరీక్షలు జరగనున్నాయి.
  • కోవిడ్ కారణంగా కొన్ని చోట్ల పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించి ప్రత్యేక వాహనాల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.


తొలిరోజు పేపర్ ఎలా ఉందంటే...

  • తొలిరోజు ఆర్కిటెక్చర్, ప్లానింగ్ పేపర్‌లో మేథమెటిక్స్ ప్రశ్నలు కొంతవరకు నైపుణ్యంతో ఆలోచించి సమాధానాలు ఇచ్చేలా ఉన్నాయని అభ్యర్థులు పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే ప్రశ్నపత్రం కొంతవరకు సులభంగానే ఉందని, త్వరగానే సమాధానాలు ఇవ్వగలిగామని మరికొందరు వివరించారు.
  • మేథమెటిక్స్ కన్నా ఆప్టిట్యూడ్ ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయని మరికొందరు వివరించారు.
Published date : 02 Sep 2020 12:21PM

Photo Stories