Skip to main content

ఇవే ప్రిపరేషన్ సెలవులు...లాక్‌డౌన్ తర్వాత అన్ని ప్రవేశ, ఉన్నత విద్య వార్షిక పరీక్షలు : తుమ్మల పాపిరెడ్డి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ తరువాత పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడతామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.
కరోనా అదుపులోకి వచ్చి లాక్‌డౌన్ ఎత్తివేయగానే వీలైనంత త్వరగా ప్రవేశ, వార్షిక పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అంశాలపై ఆయన ఏప్రిల్ 19న ‘సాక్షి’తో మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. విద్యార్థులు ఇళ్లల్లోనే ఉండి ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా శిక్షణ పొందే అవకాశం ఉండకపోవచ్చని, ఈ సమయాన్నే ప్రిపరేషన్ సెలవులుగా వినియోగించుకోవాలని సూచించారు. మే 7నాటికి పరిస్థితి అదుపులోకి వస్తే మే చివరి నాటికి ఎంసెట్ పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉంటుందన్నారు. దీనిపై ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ సంస్థతోనూ మాట్లాడతామన్నారు. ఎంసెట్ తరువాత వీలును బట్టి జూన్‌లో ఇతర ప్రవేశ పరీక్షలైన ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్‌ను నిర్వహించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ, బీటెక్, పీజీ కోర్సులకు సంబంధించిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను కూడా లాక్‌డౌన్ ముగియగానే నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు జూన్‌లో నిర్వహించాల్సి వచ్చినా ప్రవేశాల విషయంలో సమస్య ఉండబోదన్నారు. జూన్ నెలాఖరు నాటికి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
Published date : 20 Apr 2020 04:24PM

Photo Stories