Skip to main content

ఇక ప్రీ ప్రైమరీ నుంచి ట్వెల్త్ వరకు టీచర్లందరికీ టెట్ అర్హత...!

సాక్షి, హైదరాబాద్: పూర్వ ప్రాథమిక స్థాయి (ప్రీ ప్రైమరీ) నుంచి 12వ తరగతి వరకు బోధించే వారందరికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను వర్తింపజేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిర్ణయించింది.
భవిష్యత్తులో ఆయా తరగతులకు బోధించేందుకు టీచర్లుగా నియమితులయ్యే వారంతా ముందుగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలన్నమాట. నూతన విద్యా విధానంలో భాగంగా ఇది అమల్లోకి రానుంది. దీనిపై లోతుగా అధ్యయనం చేసి సమగ్ర మార్గదర్శకాలను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్‌సీటీఈ సభ్య కార్యదర్శి కేసంగ్ వై. శెర్పా తెలిపారు. మార్చి 31వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. మరోవైపు ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన టెట్‌లు, వాటికి హాజరైన అభ్యర్థులు, అందులో అర్హత సాధించినవారు, టెట్ నిబంధనల విషయంలో తలెత్తిన సమస్యలు, రాష్ట్రాల అభ్యంతరాలు.. ఈ వివరాలన్నింటినీ తమకు పంపించాలని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు, పాఠశాల విద్య కమిషనర్లకు బుధవారం లేఖ రాశారు.

2010 నుంచే టెట్
టీచర్ కావాలనుకుంటే ముందుగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలన్న నిబంధనను ఎన్‌సీటీఈ 2010లోనే అమల్లోకి తెచ్చింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు (ప్రాథమిక), 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు (ప్రాథమికోన్నత) బోధించే టీచర్లు టెట్‌లో అర్హత సాధించి ఉండాలని పేర్కొంది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఇవ్వాలని తెలిపింది. టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2011 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుసార్లు టెట్‌ను నిర్వహించారు. అర్హత సాధించిన వారి స్కోర్‌ను బట్టి ఉపాధ్యాయ నియామకాల్లో గరిష్టంగా 20 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. అయితే రాష్ట్రంలో పాఠశాల స్థాయిని బట్టి టీచర్ల కేడర్లు లేవు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) రెండు కేడర్లే ఉన్నాయి. దీంతో ఎస్‌జీటీ కావాలంటే టెట్ పేపరు-1లో అర్హత సాధించి ఉండాలని, ఎస్‌ఏ కావాలంటే పేపరు-2లో అర్హత సాధించి ఉండాలన్న నిబంధనను విధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపడుతోంది. 9, 10 తరగతులు బోధించేందుకు ప్రత్యేక కేడర్ లేదు కనుక పదో తరగతికి బోధించే స్కూల్ అసిస్టెంట్ కావాలన్నా టెట్‌ను అమలు చేస్తోంది.

డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్
నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఎన్‌సీటీఈ నిర్ణయించింది. ఇందుకోసం డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సును కూడా ప్రవేశ పెట్టింది. తాము నియమించిన కమిటీ తాజాగా టెట్ సమగ్ర మార్గదర్శకాలను రూపొందిస్తుందని, అందులో పరీక్ష విధానం, పరీక్షలో పరిగణనలోకి తీసుకునే అంశాలు కూడా ఉంటాయని ఎన్‌సీటీఈ పేర్కొంది. ఇప్పటివరకు నిర్వహించిన టెట్‌ల విషయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన అంశాలు, లోపాలు, ఫిర్యాదులు, సమస్యలు, ప్రభుత్వాలే కాకుండా వివిధ సంస్థలు, వ్యక్తులు, ఏజెన్సీలు, ఇతర భాగస్వామ్య విభాగాలు సమర్పించిన అంశాలన్నింటినీ కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపింది. కాగా సీబీఎస్‌ఈ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 15వ తేదీలోగా ఈ వివరాలు తమకు పంపించాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన టెట్‌ల వివరాలు..

2011 జూలై 1న మొదటి టెట్..

పేపరు

హాజరు

అర్హులు

అర్హుల శాతం

1

3,05,196

1,35,105

44.27

2

3,34,659

1,66,262

49.68

2012 జనవరి 8న రెండో టెట్..

1

55,194

24,578

44.53

2

4,12,466

1,93,921

47.02

2012 జూన్ 1న మూడో టెట్

1

58,123

26,382

45.39

2

4,18,479

1,94,849

46.56.


ప్రస్తుతం వ్యాలిడిటీ ఉన్న మూడు టెట్‌లు..

2014 మార్చి 16న నాలుగో టెట్

1

65,770

40,688

61.86

2

4,04,385

1,15,510

28.56

2016 మే 22న ఐదవ (తెలంగాణ మొదటి) టెట్

1

88,661

48,278

54.45

2

2,51,906

63,079

25.04

2017 జూలై 23న ఆరవ (తెలంగాణ రెండవ) టెట్

1

98,848

56,708

57.37

2

2,30,932

45,045

19.51

నోట్: ఇందులో మొదటి మూడు టెట్‌లలో అర్హత సాధించిన వారు ఏడేళ్ల వ్యాలిడిటీ నిబంధనతో ఇప్పుడు అనర్హులయ్యారు.
Published date : 04 Feb 2021 04:28PM

Photo Stories