గ్రూప్–1 పరీక్షలను మళ్లీ నిర్వహించడం కుదరదు: హైకోర్టు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్–1 పరీక్షలకు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.
సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రెండు అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది. తాజాగా పరీక్ష నిర్వహించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. 169 గ్రూప్–1 పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, ప్రశ్నపత్రంలో 51 తప్పులుదొర్లాయని, నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్లను అనుమతించలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరారు. వీరి వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపిన సింగిల్ జడ్జి, పరీక్ష తిరిగి నిర్వహించేందుకు నిరాకరిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది.
Published date : 05 Mar 2021 05:04PM