Skip to main content

గందరగోళంగా..గురుకుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ ప్రక్రియ!

సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ ప్రక్రియ అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది.
మూడేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టిన గురుకుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో పేర్కొన్న నిబంధనలు.. తాజాగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు భిన్నంగా ఉండటం అయోమయానికి తావిస్తోంది.

పరిగణనలోకి ప్రైవేటు కాలేజీ అనుభవం
మూడేళ్ల క్రితం టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టు అర్హతలు అనుభవ విభాగంలో పరిశీలిస్తే.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ/ఎయిడెడ్/రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో ఐదేళ్ల పాటు లెక్చరర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ప్రభుత్వ/ఎయిడెడ్/రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఐదేళ్ల పాటు ప్రిన్సిపల్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా పదేళ్ల పాటు ప్రభుత్వ/ఎయిడెడ్/రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. తాజాగా టీఆర్‌ఈఐఆర్‌బీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇదివరకున్న నిబంధనలతో పాటు ఏడేళ్ల పాటు ప్రైవేటు/సెల్ఫ్ ఫైనాన్స్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా లేదా ఏడేళ్ల పాటు ప్రభుత్వ/ఎయిడెడ్/గురుకుల డిగ్రీ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేసినా సరిపోతుంది. యూనివర్సిటీ డిగ్రీ/పీజీ కాలేజీల్లో కన్సల్టెంట్‌గా పనిచేసినా, ప్రైవేటు/సెల్ఫ్ ఫైనాన్స్ జూనియర్ కాలేజీల్లో తొమ్మిదేళ్ల పాటు లెక్చరర్‌గా, ప్రభుత్వ/ఎయిడెడ్/గురుకుల జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు పద్ధతిలో జేఎల్‌గా పనిచేసినా అర్హులేనని పేర్కొంది.

కొత్త సర్వీసు రూల్స్ ప్రకారం..
గురుకుల విద్యా సంస్థల సొసైటీలకు గతేడాది నుంచి కొత్త సర్వీసు నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో కొత్త సర్వీస్ రూల్స్ ఆధారంగా గురుకుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ చేపడుతున్నట్లు టీఆర్‌ఈఐఆర్‌బీ చైర్మన్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
Published date : 13 Mar 2020 02:56PM

Photo Stories