డిసెంబర్ 22 నుంచి ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ పరీక్షలు..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో గ్రేడ్-సీ, గ్రేడ్-డీ స్టెనోగ్రాఫర్ పరీక్షలను ఈనెల 22 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ జాయింట్ సెక్రటరీ, ప్రాంతీయ సంచాలకుడు కె.నాగరాజు తెలిపారు.
దీనికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. దక్షిణాది ప్రాంతం నుంచి ఈ నియామక పరీక్ష కోసం 49,810 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచురాపల్లి, తిరునల్వేలిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్టు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు పరీక్ష తేదీకి నాలుగు రోజులు ముందు నుంచి ఈ-అడ్మిషన్ సర్టిఫికెట్ (హాల్‌టికెట్) డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, వివరాలను మొబైల్ ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్ రూపంలో, ఈ-మెయిల్ ద్వారా పంపిస్తామని చెప్పారు. ఇతర వివరాలు, సందేహాల నివృత్తి కోసం 044-28251139 లేదా 9445195946 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Published date : 17 Dec 2020 04:36PM