Skip to main content

ఆన్‌లైన్‌పై ఫీడ్‌బ్యాక్.. పాఠం అర్థమవుతోందా!

సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లోని పిల్లల కోసం తలపెట్టిన ఆన్‌లైన్/వీడియో పాఠాలను విద్యార్థులు ఏమేరకు అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా పరిశీలన చేపట్టాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి.

ఇందుకోసం ఆన్‌లైన్ బోధనపై విద్యార్థుల అభిప్రాయం(ఫీడ్‌బ్యాక్) ఏమిటో తెలుసుకునేందుకు ప్రత్యేక ఫార్మాట్‌ను గురుకుల సొసైటీలు రూ పొందించాయి. ఆన్‌లైన్, వీడియో పాఠాల ద్వారా అర్థమవుతున్న తీరుపై టీచర్లు నేరుగా విద్యార్థులతో మాట్లాడతారు. ఈమేరకు ఫార్మాట్‌లో నిర్దేశించిన ప్రశ్నలను విద్యార్థులను అడిగి తెలుసుకుని ఆమేరకు ఫార్మాట్‌ను పూర్తి చేయాలి. సబ్జెక్టుల వారీగా పరిశీలన బాధ్యతలను సొసైటీలు ఆయా సబ్జెక్టు టీచర్లకు అప్పగించాయి. నిర్దేశించిన ఫార్మాట్‌ను పూరించేందుకు సబ్జెక్టు టీచర్లు నేరుగా విద్యార్థికి ఫోన్ చేసేందుకు వీలుగా ఇప్పటికే ఫోన్ నంబర్ల జాబితాను సేకరించారు. గురుకుల సొసైటీలు తొలుత టీశాట్ ద్వారా వీడియో పాఠాలను మొదలుపెట్టగా..ఆ తర్వాత పాఠశాలల వారీగా విద్యార్థుల వాట్సాప్ నంబర్లను సేకరించి ఆయా సబ్జెక్టు టీచర్లు ఆన్‌లైన్ పాఠాలను జూమ్ యాప్‌ల ద్వారా బోధించారు. ప్రభుత్వం కూడా యాదగిరి చానల్ ద్వారా వీడియో పాఠాలను ప్రారంభించింది.

పూర్తిస్థాయిలో తెరవకపోవడంతోనే...
వాస్తవానికి ఈపాటికే సమ్మెటీవ్, ఫార్మెటీవ్ పరీక్షలు నిర్వహించి పిల్లల సామర్థ్యాలను పరిశీలించాలి. కానీ విద్యాసంస్థలను పూర్తిస్థాయిలో తెరవకపోవడం, విద్యార్థులు బడులకు రాకపోవడంతో పరీక్షలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఏమేరకు పాఠాలు అర్థమవుతున్నాయో తెలిస్తే మరింత మెరుగైన పద్ధతుల్లో బోధన కార్యక్రమాలు సాగించవచ్చని గురుకుల సొసైటీలు యోచిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా సబ్జెక్టు టీచర్లంతా నిర్దేశించిన ఫార్మాట్‌కు తగినట్లుగా పరిశీలన చేసి నివేదికలను పాఠశాలలో సమర్పించాలి. అనంతరం వాటిని జిల్లాస్థాయిలో క్రోడీకరించి సొసైటీ కార్యాలయానికి సమర్పిస్తారు. అక్కడ రాష్ట్రస్థాయిలో మరోసారి క్రోడీకరించిన తర్వాత పరిశీలనపై ఓ అంచనాకు రావచ్చని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఈ ప్రక్రియ ఈనెలాఖరుకల్లా పూర్తికానుంది.

Published date : 24 Oct 2020 04:32PM

Photo Stories