Skip to main content

TSCHE: మూడు వందల కాలేజీలకు ముప్పు

మూడు వందల డిగ్రీ కాలేజీలకు ముప్పు పొంచి ఉంది. విద్యార్థుల్లేక చదువుసాగని వాటి చాప్టర్‌ ఇక ముగిసినట్టే.
TSCHE
మూడు వందల కాలేజీలకు ముప్పు

50 మంది లోపు విద్యార్థులుండే కాలేజీల ఏరివేతకు, మూసివేతకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. అనుమతి లభించిన సీట్లలో కనీసం పావువంతు కూడా భర్తీకాని కాలేజీలను ముందుగా ఏరివేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత 50 శాతం కన్నా తక్కువ అడ్మిషన్లున్న కాలేజీలపై దృష్టి పెట్టే వీలుంది. దీనికిగాను గత మూడేళ్లుగా కాలేజీల డేటాను పరిశీలిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ చర్యలు అనివార్యమని అధికారులు భావిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టే దిశగానే ఈ కసరత్తు మొదలైందని అంటున్నారు.

ఆ కాలేజీలు ఎందుకు?

రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ చదివే విద్యార్థుల కన్నా, సీట్లే ఎక్కువ. ఇటీవల ఉన్నత విద్యామండలి నిర్వహించిన దోస్త్ వివరాల ప్రకారం... ఈ ఏడాది 4,66,345 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉంటే, ఆ కాలేజీల్లో చేరినవారి సంఖ్య 2,49,266 మాత్రమే. అంటే 2,17,079 సీట్లు మిగిలిపోయాయి. ప్రతిఏటా ఇదే పరిస్థితి. 2018–19లో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 1,151 ఉంటే, ఈ ఏడాది ఇవి 1,080కి పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సంఖ్య 138 కాగా, మిగతావన్నీ ప్రైవేటు కాలేజీలే. చాలావాటిల్లో వసతులు అరకొరగా, విద్యార్థుల చేరిక నామమాత్రంగా ఉంటోంది. ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా చేరని డిగ్రీ కాలేజీలు 50 వరకున్నాయి. 50 మందిలోపు విద్యార్థులు చేరిన కాలేజీలు 250 ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ కాలేజీలను ప్రోత్సహించడం దేనికి? అనే ప్రశ్న ఉన్నతాధికారుల నుంచి ఉత్పన్నమవుతోంది.

నాణ్యత పెంచాలి

డిగ్రీలో నాణ్యత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియలో కాలేజీలే కీలకపాత్ర పోషించాలి. విద్యార్థులు చేరని కాలేజీల విషయంలో ఉన్నతస్థాయిలో సమీక్ష అవసరం. మార్పులు అత్యవసరం.
– నవీన్ మిట్టల్ (కాలేజీ విద్య కమిషనర్)

ఆ కాలేజీలపై దృష్టి పెట్టాం

అరకొర ప్రమాణాలు, విద్యార్థుల ప్రవేశం లేని కాలేజీలపై దృష్టి పెట్టాం. అలాంటి కాలేజీల యాజమాన్యాలను ప్రతిసారి మందలిస్తూనే ఉన్నాం. ఈసారి కొంత కఠినంగానే ఉంటాం. విద్యార్థులే చేరనప్పుడు ఆ కాలేజీ దేనికనే ప్రశ్న సాధారణంగానే ఉంటుంది.
–ప్రొ.ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్

చదవండి:

Higher Education: అనివార్యమైతే ఆన్ లైన్‌ బోధన

Online Classes: ‘థర్డ్‌’.. డిగ్రీ చదువులు

గాంధీ మార్గంతోనే సమాజోద్ధరణ

అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఆనర్స్‌’

Published date : 11 Dec 2021 03:59PM

Photo Stories