విద్యార్థుల ఫీజులు మాయం
పూడూరు మండ లం ఎన్కేపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న హిట్స్ డీఈడీ, బీఈడీ విద్యాసంస్థల చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి సెప్టెంబర్ 24న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కళాశాల ప్రిన్సిపాల్ జీవన్, లైబ్రేరియన్ వెంకటేశ్.. రెండేళ్లలో దాదాపు రూ.39 లక్షల ఫీజులు విద్యార్థుల నుండి నేరుగా, ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారా తమ ఖాతాలో జమచేయించు కుని కాలేజీ రసీదులు ఇవ్వకుండా పేపర్ స్లిప్‌లను ఇచ్చారని తెలిపారు.
విద్యార్ధుల ఫీజులే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు సైతం కాజేసీ కాలేజీ రికార్డులు, బ్యాంకు స్టేట్‌మెంట్‌లను టాంపరింగ్ చేశారని తెలిపారు. ఇదేమని ప్రశ్నిస్తే యాజమాన్యంపై దాడులకు దిగారని తెలిపారు. రెండేళ్ల బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తికావడంతో సర్టిఫికెట్ల కోసం వచ్చిన విద్యార్ధులకు ఫీజులు చెల్లించాలని యాజమాన్యం డిమాండ్ చేయడంతో అప్పుడే చెల్లించామని విద్యార్ధులు యాజమాన్యం దృష్టికి తెచ్చారు.
చదవండి: Government Teacher Jobs 2023 : ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు ఓపెన్ డిగ్రీ అభ్యర్థులు కూడా అర్హులే..
ఫోన్‌పే, గుగుల్‌పే ద్వారా నగదు చెల్లించామని ప్రిన్సిపాల్ ఇచ్చిన రసీదులు కాలేజీ యాజమాన్యానికి చూయించారు. దీంతో యాజమాన్యం, విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టడంతో దిగొచ్చిన యాజమాన్యం విద్యార్థుల ఫీజులు కాజేసిన ప్రిన్సిపాల్ జీవన్, లైబ్రేరియన్ వెంకటేశ్‌పై చన్గోముల్ పోలీసుకు ఫిర్యాదు చేశారు.
ఫీజులు చెల్లించిన విద్యార్థులు ఆందోళన చెందవద్దని.. సోమవారంలోగా అందరికీ సర్టిఫికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తమను మోసం చేసిన కాలేజీ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు.