School holidays : విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం కన్పిస్తోంది. అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం ఈనెల 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈనెల 17న విద్యాసంస్థలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ఈనెల 20 వరకు కేంద్రం కరోనా ఆంక్షలు పొడిగించడం, వైరస్ కట్టడి దిశగా అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టడాన్ని విద్యాశాఖ పరిశీలిస్తోంది. విద్యాసంస్థల్లో శానిటైజేషన్ అమలుపైనా క్షేత్ర స్థాయిలో అనుమానాలున్నాయి. వీటిని మరోసారి పరిశీలించాల్సిన అవసరముందని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి సంక్రాంతి సెలవులను పొడిగించడం సరైన నిర్ణయమని ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వాస్తవ పరిస్థితిపై విద్యాశాఖ మంత్రి కూడా నివేదిక కోరినట్లు తెలిసింది. దీంతో అధికారులు తాజా పరిస్థితిపై సమగ్ర వివరాలు ఇచ్చినట్లు ఓ అధికారి చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుందని, సాధ్యమైనంత వరకూ సెలవుల పొడిగింపు వైపే ఆలోచన సాగుతోందని అధికారులు చెబుతున్నారు.
Click here for more Education News