Skip to main content

New Courses - New Colleges: కొత్త కోర్సులుంటేనే కాలేజీలకు అనుమతి!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఈ ఏడాది సమగ్రంగా మారబోతోంది. ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌)’తెరమరుగుకానుంది. దీని స్థానంలో పాత పద్ధతిలోనే కాలేజీలు సొంతంగా అడ్మిషన్లు చేపట్టబోతున్నాయి. ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తి చేసినట్టు ఉన్నత విద్య మండలి వర్గాలు తెలి పాయి.
Colleges are allowed only for new courses in Degree Colleges

త్వరలోనే దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు వెల్లడించాయి. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే డిగ్రీ ప్రవేశాల విధి విధానాలను ఖరారు చేస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే కోర్సుల ఏర్పాటు, అనుమతులు విద్యా మండలి అధీనంలోనే ఉంటాయని.. ఏయే కోర్సులకు, ఏయే కాలేజీలకు అనుమతించాలనేది మండలి నిర్ణయిస్తుందని వివరిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దాదాపు వంద డిగ్రీ కాలేజీలకు ఈ ఏడాది అనుమతి కష్టమే. కొత్త విధి విధానాలు వచ్చిన తర్వాత అందుకు తగ్గట్టుగా కోర్సులు ఉంటే తప్ప అనుమతించేది లేదని ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు. 

చదవండి: Two New Courses : త్వ‌ర‌లోనే రెండు కోత్త కోర్సులు.. ఈ విద్యార్థుల‌కే..!

లక్ష సీట్లకు కోత.. 

‘దోస్త్‌’పరిధిలో ప్రస్తుతం 1,055 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, రెసిడెన్షియల్, గురుకులాల్లో కలిపి మొ త్తం 4,75,704 డిగ్రీ సీట్లున్నాయి. అయితే కొన్నేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు 45శాతానికి మించడం లేదు. ముఖ్యంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 32శాతమే సీట్లు భర్తీ అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో అయితే ఇది 29 శాతమే.

చదవండి: New Courses in Degree : డిగ్రీలో త్వ‌ర‌లోనే కొత్త కోర్సు ప్ర‌వేశం.. ఇందులోకూడా మార్పులు..!!

నిజానికి రాష్ట్రంలో ఏటా 3.90 లక్షల మంది ఇంటర్‌ ఉత్తీర్ణులవుతున్నారు. వారంతా డిగ్రీలో చేరినా ఇంకా దాదాపు 80వేల సీట్లు మిగిలిపోయే పరిస్థితి. ఇలా విద్యార్థులు తక్కువ, సీట్లు ఎక్కువ ఉండటంపై ఉన్నత విద్యా మండలి సమగ్ర అధ్యయనానికి ఆదేశించింది. వివిధ వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. రాష్ట్రంలోని డిగ్రీకాలేజీల్లో భర్తీ అవుతున్న సీట్లలో సగానికిపైగా సీట్లు కొత్త కోర్సులకు సంబంధించినవే ఉంటున్నాయి. బీకాం ఫైనాన్స్, కంప్యూటర్స్, ఇన్సూరెన్స్‌ వంటి కాంబినేషన్‌ సబ్జెక్టులకు డిమాండ్‌ ఉంది.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఆ తర్వాత స్థానంలో బీఎస్సీ కంప్యూటర్స్, లైఫ్‌సైన్స్‌ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. కానీ ఈ కోర్సులు అన్ని కాలేజీలలో లేవు. సుమారు 400 కాలేజీల్లో ఇప్పటికీ సాధారణ డిగ్రీ కోర్సులే ఉన్నాయి. కాంబినేషన్‌ కోర్సులు ఎక్కువ భాగం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే ఉంటున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. యూజీసీ, ఉన్నత విద్యా మండలి డిజైన్‌ చేసిన కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కాలేజీలకే అనుమతివ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో దాదాపు లక్ష సీట్లను తగ్గించే వీలుందని మండలి వర్గాలు అంటున్నాయి. 

కొత్త సిలబస్‌ అందుబాటులోకి.. 

ఉన్నత విద్యా మండలి 2025–26 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణ డిగ్రీలో కంప్యూటర్‌ కోర్సులు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌ వంటి సబ్జెక్టులను అందుబాటులోకి తేనుంది. ఈ దిశగా నిపుణులు సిలబస్‌ను రూపొందించారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను కాలేజీలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ కోర్సులను బోధించేందుకు నిపుణులైన అధ్యాపకులు అవసరం. కొత్త సిలబస్‌లో తరగతి గదిలో బోధనతో సమానంగా నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు వర్క్‌ ప్రవేశపెడుతున్నారు. ఏఐ కోర్సు తీసుకునే విద్యార్థులు ఏదైనా ప్రముఖ కంపెనీ తోడ్పాటుతో సొంతంగా సరికొత్త ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. రెండో ఏడాది మినీ ప్రాజెక్టు, మూడో ఏడాది పెద్ద ప్రాజెక్టును చేపట్టాలి. దీనికోసం కాలేజీలు కొన్ని సంస్థలతో భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఎంవోయూ ఉన్న కాలేజీలకు మాత్రమే ఈసారి అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి భావిస్తున్నట్టు తెలిసింది. ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యేలోగా ఈ మార్పులపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.  

Published date : 22 Jan 2025 08:52AM

Photo Stories