SP Anuradha : ఎంతో ఇష్టంగా సాధించుకున్న ఈ జాబ్..కానీ
అసాధ్యమనుకున్న వాటిని సాధ్యం చేసి చూపిస్తున్నారు. అయితే పురుషాధిక్య సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక రకంగా వివక్ష ఉంటోంది. అందుకే మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలగాలి. ఎవరిపై ఆధారపడకుండా ఆర్థికంగా ఎదిగినప్పుడే సాధికారత దిశగా అడుగులు పడతాయి’ అని అంటున్నారు ఎస్పీ బి.అనురాధ. ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో తన అనుభవాలు, సమాజంలో అమ్మాయిల పట్ల చోటు చేసుకుంటున్న వివక్షతో పాటు మహిళా సాధికారతపై ఎస్పీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఎస్పీ మాటల్లోనే...
వీరికి సెల్యూట్ చేస్తా..ఎందుకంటే..?
నేను ఒక ఆడపిల్లగా పుట్టినా కొన్ని విషయాల్లో చాలా లక్కీ అనే చెప్పాలి. కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలకు సరైన చదువులు చెప్పించకుండా ఇంటి వద్దే ఉంచడం... తొందరగా పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకోవడం చిన్నప్పుడే చేశాను. కానీ నా విషయంలో అలా జరగలేదు. అందుకే పదే పదే చెబుతుంటా.. మా అమ్మనాన్న కమల, జగన్‌మోహన్‌రెడ్డిలే నాకు స్పూర్తి ప్రదాతలని. ఎందుకంటే అమ్మాయిలుగా ఇసుమంత వివక్ష చూపకుండా సమానంగా చూశారు. మేం మొత్తం నలుగురు సంతానం. నాకు అన్న, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. అందరినీ కూడా క్రమశిక్షణతో పెంచారు. మా అమ్మనాన్నలు విద్యావంతులు కావడంతో అందరికీ ఉన్నత విద్య చెప్పించడంతో పాటు సమాన అవకాశాలు కల్పించారు. ఇప్పుడు అన్నయ్య యూకేలో డాక్టర్, తమ్ముడు ఇంజనీర్‌గా, చెల్లెలు ఢిల్లీలోని జేఎన్‌యూ నుంచి ఎల్‌ఎల్‌ఎంలో బంగారు పతకం సాధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తోంది. ఇక నేను ఈ రోజు జిల్లా పోలీసు బాస్‌గా నిలబడగలిగానంటే అందుకు కారణం మా తల్లిదండ్రులే. అందుకే వారికి సెల్యూట్ చేస్తా. పెళ్లి తర్వాత భర్త శ్రావణ్‌కుమార్‌రెడ్డి కూడా ఫుల్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. నిత్యం తీవ్ర ఒత్తిడితో కూడుకున్న పోలీసు జాబ్‌ను కుటుంబ సభ్యుల సహకారంతో సులువుగా నెగ్గుకొస్తున్నా.
ఇలాంటివి చాలా చూస్తున్నా..
సర్వీస్‌లో భాగంగా ఆడవారిపై జరిగే వివక్షను చూస్తున్నా. ప్రస్తుతమంటే కాలం మారింది కానీ... గతంలో అమ్మాయిలపై ఒక రకమైన వివక్ష ఉండేది. అబ్బాయిలను ఒక రకంగా... అమ్మాయిలను ఒక విధంగా చూడటంతో పాటు అవకాశాల విషయంలో కూడా వివక్ష చూపేవారు. ఇప్పటికీ కొందరు అబ్బాయిలను గుర్తింపు పొందిన మంచి స్కూళ్లలో, అమ్మాయిలను మామూలు స్కూళ్లలలో చదివిస్తున్నారు. చిన్నప్పటి నుంచి చోటు చేసుకుంటున్న ఇలాంటి వాటి వల్ల సమాజంలో ఒక రకమైన భావన ఏర్పడుతోంది. అందుకే ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే కుటుంబ వ్యవస్థలో మార్పురావాలి. అప్పుడే కాస్తయినా అమ్మాయిల విషయంలో వివక్ష తగ్గుతుంది.
అప్పుడే పెళ్లంటే..?
ఇప్పటికీ మన గ్రామీణ వ్యవస్థలో అమ్మాయిలను భారంగా భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసి పంపించాలనే ఆలోచనలోనే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. ఎందుకంటే 18 ఏళ్లకే పెళ్లి చేస్తే వారికి ఏం తెలుస్తుంది? అప్పుడప్పుడే సమాజం, మనుషులను అర్థం చేసుకునే వయస్సు. అలాంటప్పుడు పెళ్లి చేస్తే జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? సమాజం పట్ల కనీస అవగాహన అవసరం. అమ్మాయిలు కూడా ధైర్యంతో అడుగు ముందుకు వేయాలి. పోరాట పటిమ అలవరుచుకోవాలి. ముఖ్యంగా ఆర్థికంగా నిలబడగలిగే శక్తి రావాలి. అలాగైతేనే జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు.
చిన్న వయస్సులోనే...
చాలా మంది అమ్మాయిలకు చట్టం గురించి తెలియడం లేదు. టీనేజ్‌లో ఆకర్షణకు లోనై ప్రేమ పేరుతో చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కనీస వయస్సు రాకుండానే జరుగుతున్న పెళ్లిళ్లు చాలా ఉన్నాయి. తెలిసీ తెలియని వయస్సులో పెళ్లి చేసుకోవడం.. తర్వాతి క్రమంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మా వద్దకు వచ్చే చాలా కేసులు ఇలానే ఉంటాయి. ఇలాంటి కేసులను సున్నితంగా డీల్ చేస్తాం. సాధ్యమైనంత వరకు కౌన్సిలింగ్ ఇచ్చి దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇటీవలి కాలంలో మా పోలీసు శాఖ తరఫున ఏయే చట్టాలు ఏవిధంగా ఉపయోగపడుతాయనే అంశంపై స్కూళ్లు, కాలేజీల్లో సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కళాజాత బృందాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాం.
తాట తీస్తా...
అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరించిన సహించేది లేదు. చట్టప్రకారం వారి తాట తీస్తాం. ప్రస్తుతం మా షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. కాలేజీలతో పాటు పబ్లిక్ ప్లేస్‌ల వద్ద మా సభ్యులు మఫ్టీలో ఉండి పర్యవేక్షిస్తుంటారు. ఎవరైన తిక్కతిక్క నక్రాలు చేస్తే ఆధారాలు సేకరించి స్టేషన్‌కు పట్టుకొస్తున్నారు. తర్వాత తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. అయినా రెండో సారి పట్టుబడితే మా ట్రీట్‌మెంట్ చూపిస్తాం. అంతేకాదు మహిళా ఉద్యోగుల పట్ల కూడా సహచర ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తిస్తున్న సందర్భా లు కూడా చోటు చేసుకుంటున్నాయి. వారిపై నేరుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నాం.
ఆ ఫీలింగ్ ఇప్పటికీ ఉంది..
ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో కుటుంబానికి సమయం కేటాయించలేక పోతున్నాననే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది. నేను చేస్తున్నది పోలీస్ జాబ్. ఈ వృత్తిలో రాత్రి, పగలు తేడా ఉండదు. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. పిల్లలు చిన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ నేను ఎంతో ఇష్టంగా సాధించుకున్న పోలీసు జాబ్‌కు న్యాయం చేయాల నే భావనలో మనస్సు లోకి వచ్చేది. నా పరిస్థితిని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం పిల్లలు సుజీత్‌రెడ్డి, ధరణిరెడ్డి ఇద్దరూ మెడిసిన్ చదువుతున్నారు. అయితే కొన్ని సందర్భా ల్లో ఇబ్బందికరంగా ఫీలయ్యే దాన్ని. చాలా దగ్గరి బంధువుల ఫంక్షన్లకు కూడా హాజరయ్యే పరిస్థితి ఉండేది కాదు. అందుకే బంధువులు.. ఏ ఫంక్షన్‌కు హాజరు కావు.. అని పదేపదే అంటుంటారు. కానీ నా వృత్తి ద్వారా పది మందికి న్యాయం జరుగుతుండటంతో అవన్నీ మర్చిపోతుంటా.
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్.
Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే
Anu Kumari, IAS : కొడుకును చూసుకుంటూనే..రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంక్
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Civils Results : సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కుమారుడు...ఐఏఎస్ అయ్యాడిలా..