Skip to main content

స్వీయ ప్రిపరేషన్‌తో విజయం సాధించా!

‘ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక..దాని సాధనకు కృషిచేయాలే తప్ప.. ఫలితం గురించిఆలో చిస్తూ కూర్చుంటే చివరకు మిగిలేది మానసిక ఆందోళనే! మానసిక స్థైర్యంతో ముందుకు సాగితే, కచ్చితంగా విజయం లభిస్తుంది. ఒకవేళ ప్రతికూల ఫలితం వచ్చినా,కొత్త విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఉపయోగపడుతుంది’ అంటున్నారు సివిల్స్-2015లో 84వ ర్యాంకు సాధించిన చిట్టూరి రామకృష్ణ. ఆయన సక్సెస్ స్పీక్స్...
మాది విజయవాడ. అమ్మానాన్న.. లక్ష్మీ భ్రమరాంబ, అన్నవర ప్రసాద్. నాన్న రైల్వేలో పనిచేస్తున్నారు. నేను పదో తరగతి తర్వాత రైల్వే ఒకేషనల్ ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. 2004లో బుకింగ్ క్లర్క్ ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగం చేస్తూనే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి దూరవిద్య ద్వారా బీకాం పూర్తిచేశాను. క్యాట్ 2007 స్కోర్‌తో ఐఐఎం-అహ్మదాబాద్‌లో పీజీపీఎంలో సీటు లభించింది. 2010లో డెలాయిట్‌లో ఉద్యోగం రావడంతో రెండేళ్లు అక్కడ పనిచేశాను. ఆ తర్వాత ఒక ప్రైవేటు సంస్థలో కోర్స్ డెరైక్టర్‌గా ఏడాది పనిచేశాను.

సంతృప్తి ముఖ్యం:
చేస్తున్న ఉద్యోగం ఏదైనా సంతృప్తి ముఖ్యం. నేను ప్రైవేటు ఉద్యోగంలో దాన్ని ఆస్వాదించలేకపోయాను. అలాగని ప్రైవేటు కొలువులను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ, అక్కడ నిర్వహించే విధుల ద్వారా సమాజానికి తోడ్పడటం చాలా తక్కువ లేదా పరోక్షంగా ఉంటుంది. అందుకే నేరుగా సమాజాభివృద్ధికి వీలుకల్పించే సివిల్స్‌పై దృష్టిసారించాను.

నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్:
2011లో తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. ఇంకొంచెం కష్టపడితే తప్పకుండా సివిల్స్‌లో విజయం సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతో 2012లో మరోసారి సివిల్స్ రాస్తే 257 ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. కానీ, ఐఏఎస్ సాధించాలనేదే తుది లక్ష్యం కావడంతో 2014లో మరోసారి పరీక్షకు హాజరుకాగా, 410 ర్యాంకుతో ఐఆర్‌ఎస్ లభించింది. దాంతో ఐపీఎస్ శిక్షణ కొనసాగించాను. నాలుగోసారి 84వ ర్యాంకు సాధించాను.

స్వీయ ప్రిపరేషన్:
సివిల్స్ ఆలోచన వచ్చినప్పటి నుంచి సొంతంగా ప్రిపరేషన్ కొనసాగించాను. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ప్రిపేరయ్యాను. 2015 సివిల్స్‌కు ఐపీఎస్ సర్వీసుకు ఆర్నెల్లు సెలవుపెట్టి, చదివాను. నేను ఒకేసారి రెండు, మూడు గంటల కంటే ఎక్కువ సేపు చదవలేను. అది నా బలహీనత. దాన్ని గుర్తించి ఆ రెండు, మూడు గంటలనే పూర్తిస్థాయిలో సమర్థవంతంగా ఉపయోగించుకున్నాను. గత ప్రశ్నపత్రాల విశ్లేషణ, వివిధ అంశాలకున్న వెయిటేజీని గుర్తిస్తూ ప్రిపరేషన్ సాగించాను.

ఆసక్తికే ప్రాధాన్యం:
తొలి రెండు ప్రయత్నాల్లో జాగ్రఫీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ ఎంచుకున్నాను. తర్వాత మెయిన్స్‌లో మార్పులు రావడంతో తెలుగు లిటరేచర్ ఆప్షనల్‌ను కొనసాగించాను. ఆప్షనల్ ఎంపికలో ఆసక్తికే ప్రాధాన్యం ఇచ్చాను. తెలుగు లిటరేచర్ అంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తి, నా లక్ష్య సాధనకు ఉపయోగపడింది. ఇంటర్వ్యూ వినయ్ మిట్టల్ బోర్డ్ నేతృత్వంలో జరిగింది. ఐపీఎస్ కేడర్‌కు (ప్రస్తుత సర్వీసు) సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి.

హార్డ్‌వర్క్.. సెల్ఫ్ మోటో:
భవిష్యత్తు సివిల్స్ ఔత్సాహికులకు ఇచ్చే సలహా హార్డ్‌వర్క్, సెల్ఫ్ మోటో! ఈ రెండే విజయ పథంలో నడిపిస్తాయి. సివిల్స్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నవారు వీటిని కచ్చితంగా అనుసరించాలి. గుర్తించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఆసక్తితో అడుగులు వేస్తే కొంచెం ఆలస్యమైనా లక్ష్యాన్ని చేరుకోవడం ఖాయం. ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు సంసిద్ధత కూడా అవసరం.
Published date : 12 May 2016 08:11PM

Photo Stories