ఆ స్ఫూర్తితోనే...సివిల్స్‌లో విజయం సాధించా: శ్రీమతి శైలజా రామయ్యార్
నా విద్యాభ్యాసం :
మా నాన్న గారు కెన్యా, మలేషియాల్లో పనిచేశారు. దాంతో ఎనిమిదో తరగతి వరకు నా స్కూల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్‌లోనే జరిగింది. తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత సెయింట్ ఆన్స్‌లో జాయిన్ అయ్యాను. తర్వాత గ్రాడ్యుయేషన్, ఎంఏ సోషియాలజీ చేశాను.
సివిల్స్ వైపు....
అవి కర్ణాటకలోని ఎగువ కృష్ణాలో పరిధిలో నిర్మిస్తున్న నారాయణ్‌పూర్, ఆల్మట్టి ప్రాజెక్టులకు సంబంధించి రిహాబిలిటేషన్, రీసెటిల్‌మెంట్(ఆర్–ఆర్) సర్వేలో పాల్గొంటున్న రోజులు. విధి నిర్వహనలో భాగంగా బాగల్‌కోట్ తోపాటు కమాండ్ ఏరియా సర్వేలోని గుల్బర్గా, బీజాపూర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రజలు, ప్రత్యేకించి రైతుల కష్టాలను చాలా దగ్గరగా చూశాను. తర్వాత పీహెచ్‌డీలో చేరాను..అయినా ఆర్–ఆర్ సర్వే నాటి సంఘటలను నన్ను కదిలిస్తూనే ఉండేవి. పైగా సర్వే సమయంలో కలెక్టర్‌కు ఉండే అధికారాలను దగ్గరగా చూడటంతో నాలో ఓ రకమై ప్రేరణ కలిగింది. దాంతో అకడెమిక్‌గా అడ్మినిస్ట్రేషన్ దారిలో వెళ్తే సమాజానికి చేతనైనంత సేవ చేయొచ్చనే నిర్ణయానికొచ్చి పీహెచ్‌డీని మధ్యలోనే వదలి సివిల్స్ వైపు అడుగులేశాను.
నా ప్రిపరేషన్ ఇలా...
ప్రిపరేషన్ సంగతటుంచితే అప్పట్లో సివిల్స్ దరఖాస్తు ప్రక్రియే ఓ పెద్ద టాస్క్‌లా ఉండేది! అప్పటికింకా ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి రాలేదు. అంతా ఆఫ్‌లైన్ పద్ధతే. ముఖ్యంగా మెయిన్స్ దరఖాస్తులో చాలా ఇన్‌ఫర్మేషన్ అడిగేవారు. దాన్ని జాగ్రత్తగా నింపాల్సి వచ్చేది. ఇక ప్రిపరేషన్ పరంగా దాదాపు స్వీయ ప్రిపరేషననే చెప్పాలి. అప్పట్లో ట్యాంక్‌బండ్ దగ్గర ఏపీ స్టడీ సర్కిల్ వాళ్లు సివిల్స్ మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. కొన్నిసార్లు వాటికి హాజరయ్యాను. అప్పట్లో హిందీ పేపర్‌లో క్వాలిఫై అయితేనే మెయిన్స్‌లో మిగిలిన పేపర్లను ఎవాల్యూయేషన్ చేసేవారు. కానీ నేను హిందీ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో కాన్ఫిడెంట్‌గా ఉండేదాన్ని! అదృష్టవశాత్తు హిందీలో గట్టెక్కాను. నన్నడిగితే సివిల్స్‌కు స్వీయ ప్రిపరేషనే ఉత్తమం. కోచింగ్ సెంటర్లు అందించే మెటీరియెల్స్ కట్ పేస్ట్ టైప్‌లో ఉంటాయి. స్వీయ ప్రిపరేషన్ వల్ల విశ్లేషణా సామర్థ్యాలు మెరుగవుతాయి.
విజయం సాధించానిలా..
సివిల్ సర్వీస్‌కు ఎంపికయ్యానని తెలిసినప్పుడు చాలా ఆనందం వేసింది. అందరూ అభినందించారు. ఏ స్ఫూర్తితోనైతే సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నానో ఆ దిశగా అవకాశం వచ్చినందుకు సంతోషంగా అనిపించింది. అయితే మా బ్యాచ్(1997)లో ఆంధ్రప్రదేశ్ నుంచి నేనొక్కదాన్నే ఎంపికయ్యాను. అయితే ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటంతో ఈ విషయం చాలా మందికి తెలియదు.
ముస్సోరిలో నా శిక్షణ సాగింధిలా..
ముస్సోరిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కి వెళ్లిన కొత్తలో అక్కడి పరిస్థితులన్నీ కాలేజీకి కొనసాగింపుగానే అనిపించాయి. రోజూ ఉదయం 5.30 గంటలకు లేచి.. 6.15 నుంచి 7.15 గంటల వరకు ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ట్రైనింగ్‌కు హాజరయ్యే వాళ్లం. అనంతరం రెడీ అయ్యి 8.15 గంటల కల్లా బ్రేక్‌ఫాస్ట్ ముగించి...8.30–8.45 గంటలకు క్లాస్‌రూమ్‌కు చేరుకొనేవాళ్లం. సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరగేవి. ఆ సమయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కాన్‌స్టిట్యూషన్, లా తదితర సబ్జెక్టులతోపాటు గెస్ట్ లెక్చర్స్ ఉండేవి. ముస్సోరిలో గడిపిన కాలం కళాశాల జీవితంలా అనిపించినా ఆ శిక్షణ విలువేంటో గ్రౌండ్‌లో వర్క్ చేసే సమయంలో తెలుస్తుంది. ఒక విధంగా ముస్సోరిలో అభ్యర్థులు పాలనా వ్యవహారాల్లో జ్ఞానస్నానం పొందుతారనొచ్చు.
గ్రామ సందర్శన :
నా ముస్సోరి అనుభవాల్లో గ్రామ సందర్శనల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సాధారణంగా అభ్యర్థులను బృందాలుగా విభజించి వారం పాటు హిమాలయాల ట్రెక్కింగ్‌కు పంపిస్తారు. అయితే మా బ్యాచ్‌లో నాతో పాటు దాదాపు పది మందికి ఆస్తమా సమస్యలు ఉండేవి. దాంతో మమ్మల్నందర్నీ రూరల్ విజిట్‌కు పంపారు. ఆ పర్యటనలో గ్రామాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేశాము. నాకది ఇప్పటికీ ఓ మధురానుభూతే!
నా తొలి పోస్టింగ్ :
నా తొలి పోస్టింగ్ తెనాలి సబ్ కలెక్టర్. తెనాలి పట్టణంతోపాటు చుట్టుపక్కల కాలువలు ఎక్కువ. వాటి గట్లపై చాలా మంది పేదవాళ్లు గుడిసెలు వేసుకొని నివసిస్తుండేవారు. దాంతో కాలువ నీళ్లు కలుషితం అవుతుండేవి. కాలువ జలాలను కలుషితం నుంచి కాపాడటంతోపాటు పట్టణ సుందరీకరణ చర్యల్లో భాగంగా గుడిసెలను తొలిగించాల్సిన పరిస్థితి. దాంతో అప్పటికే స్థలాలు పొంది వాటిలో నిర్మాణాలు చేపట్టని వారికి నోటీసులు ఇచ్చి..వాటిని రద్ధు చేసి ఆ స్థలాలను పేదలకు కేటాయించాను. అంతేకాకుండా సదరు స్థలాన్ని ప్లాట్లుగా విడగొట్టించాను. మున్సిపాలిటీ వారితో మాట్లాడి ట్రాక్టర్లు పెట్టించి వారి సామాన్లు ఆయా ప్రదేశాలకు చేర్చేలా ఏర్పాట్లు చేశాను. దీంతో పెద్దగా నిరసన తెలపకుండా ప్రజలు అక్కడికి వెళ్లేందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ కాలనీ అద్భుతమైన సౌకర్యాలతో ఓ మినీ ఇండియాలా తయారైంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డ వారంతా ఇప్పుడు హాయిగా జీవిస్తున్నారు.
నా అసంతృప్తి ఇదే..:
పోస్టింగుల పరంగా కొద్ధిపాటి అసంతృప్తి ఉన్నప్పటికీ ఆ భావన నా పనితీరును, లక్ష్యాలను ప్రభావితం చేసే స్థాయిలో లేదు. దీనికి కారణం నిరంతరం నన్ను నేను తెలుసుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్నపుడు గ్రౌండ్ లెవల్‌లో చాలా చేయాలనుకున్నాను. నాకు బేసిక్‌గా హెల్త్ డిపార్ట్‌మెంట్ అంటే ఆసక్తి. కానీ, కొన్ని కారణాల వల్ల అనుకున్న స్థాయిలో చేయలేకపోయాననే భావన ఉంది.
జూనియర్ల సలహాలు..
సలహాలంటే...మొదటిగా ఆత్మప్రబోధానుసారం పనిచేయమని చెప్తాను. ఎవరి మెప్పు కోసమో, ఒకరిని సంతోష పరిచేందుకో పనిచేయొద్దు. అలాగే పోస్టింగుల పరంగా మంచి పోస్టింగ్ వచ్చినప్పుడు పొంగిపోద్దు..రానప్పుడు కుంగిపోవద్దు. సక్సెస్‌కు షార్ట్ కట్స్ ఉండవు. సక్సెస్‌లో హార్డ్‌వర్క్ అండ్ అప్లికేషన్‌లది 90 శాతం పాత్రయితే కేవలం 10 శాతమే అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. విధి నిర్వహణలో మానవీయ కోణం, సానుకూల దృక్పథాలను మిళితం చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వొచ్చు.
చివరగా..
నేనెవరు అంటే ఓ శైలజా అయ్యర్‌నో...ఓ ఐఏఎస్ అధికారినో కాదు..అంతకుమించి ఏదో ఉంది! దాన్ని ఇప్పటీ తెలుసుకోలేకపోయాను. దాని కోసం నా స్వీయ అన్వేషణ సాగుతూనే ఉంటుంది.