సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
Sakshi Education
సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు అద్భుత ఫలితాలు సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్-2017 పరీక్ష ఫలితాలుఏప్రిల్ 27న విడుదలయ్యాయి.
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ సత్తాచాటారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రతిభావంతులు పోటీ పడే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్-నవంబర్ 2017ల్లో నిర్వహించింది. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి-ఏప్రిల్ 2018లో ఇంటర్వ్యూలు జరిగాయి. మొత్తం 990 పేర్లను ప్రతిష్టాత్మక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌తోపాటు ఇతర కేంద్ర సర్వీసులైన గ్రూప్ ఏ,గ్రూప్ బీలకు అభ్యర్థులను సిఫార్సు చేసింది. 990 మందిలో 476 జనరల్, 275 ఓబీసీ, 165 ఎస్సీ, 74 ఎస్టీలు ఉన్నారు. వీరిలో 750 మంది పురుషులు, 240 మంది మహిళలు ఉన్నారు. ఎంపికై న వారిలో ఐఏఎస్‌కు 180 మందిని, ఐఎఫ్ఎస్కు 42 మందిని, ఐపీఎస్‌కు 150 మందిని, కేంద్ర సర్వీసులోని గ్రూప్-ఏకు 565 మందిని, గ్రూప్-బీ సర్వీసులో 121 మందిని నియమించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఖాళీలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సత్తాచాటారు.
తెలుగు తేజాలు...
తెలుగు తేజాలు...
ర్యాంక్ | పేరు |
1 | దురిశెట్టి అనుదీప్ |
6 | కోయ శ్రీహర్ష |
43 | శీలం సాయి తేజ |
100 | నారపు రెడ్డి మౌర్య |
144 | జి/.మాధురి |
196 | సాయి ప్రణీత్ |
206 | నాగవెంకట మణికంఠ |
245 | వాసి చందీష్ |
374 | రిషికేశ్రెడి |
512 | ప్రవీణ్‌చంద్ |
513 | ప్రసన్నకుమారి |
607 | కృష్ణకాంత్ పటేల్ |
624 | వై.అక్షయ్ కుమార్ |
816 | భార్గవ్ శేఖర్ |
884 | వంశీ దిలీప్ |
- సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2017కు ఫిబ్రవరి 22, 2017న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తో పాటు మొత్తం 24 కేంద్ర సర్వీసుల్లో నియామకాలకు మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టింది. జూన్18, 2017న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది.
నాన్న మాటలే స్ఫూర్తి.... తెలంగాణ బిడ్డ ‘దురిశెట్టి అనుదీప్’ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన అనుదీప్... ఇంజనీరింగ్ అనంతరం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ వచ్చినా సివిల్స్‌నే లక్ష్యంగా చేసుకుని శ్రమించాడు. ఆ శ్రమ ఏ స్థాయిలో అంటే... ఒకసారి కాదు!! ఏకంగా ఐదు సార్లు సివిల్స్ రాశాడు. రెండు సార్లు మెయిన్స్ కూడా దాటలేకపోయాడు. అయితేనేం!! పట్టు వదలకుండా శ్రమించాడు. చివరకు ఐఆర్ఎస్ సాధించాడు. అయినా అంతటితో సంతృప్తి చెందలేదు. కస్టమ్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తూనే... మళ్లీ సివిల్స్ రాశాడు. ఐదో ప్రయత్నంలో... ఏకంగా ఆలిండియా నెంబర్-1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఈ విజయాన్ని ‘సాక్షి’తో పంచుకుంటూ అనుదీప్ ఏమన్నాడంటే... మాది జగిత్యాల జిల్లా మెట్పల్లి. నాన్న దురిశెట్టి మనోహర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్, అమ్మ జ్యోతి గృహిణి. నేను పదో తరగతి వరకు మెట్పల్లిలోనే చదివా. ఇంటర్ పూర్తయ్యాక ఎంసెట్ ఎంట్రన్స్ లో రాష్ట్రస్థాయిలో 40వ ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో బిట్స్పిలానీలో చేరి ఇంజినీరింగ్ పూర్తి చేశా. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలోనే క్యాంపస్ సెలక్షన్స్ లో ఒరాకిల్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యా. కానీ అందులో చేరలేదు. నాన్న లక్ష్యం మేరకు సివిల్స్ సాధించాలన్న లక్ష్యం పెట్టుకుని దానికోసమే శ్రమించాను. ఫైనల్ ఇయర్లోనే.. నా ఇంజనీరింగ్ 2011లో పూర్తయింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోనే సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నాను. కాబట్టే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఒరాకిల్‌లో ఆఫర్ వచ్చినా వద్దనుకుని ఢిల్లీ వెళ్లా. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు వస్తుందనుకున్నా. కానీ రాలేదు. దీంతో ఉద్యోగం చేయాలని గూగుల్‌లో చేరా. జాబ్ చేస్తూనే.. ఒకవైపు గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించా. వారాంతాల్లో, సాయంత్రం సమయంలో ఎప్పుడు వీలు చిక్కినా చదివేవాడిని. రెండో ప్రయత్నంలో 2013లో 790వ ర్యాంకు వచ్చింది. దీంతో ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీఎస్టీ, కస్టమ్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. ఆప్షనల్ ఆంత్రోపాలజీ : మనుషులు, వాళ్ల ప్రవర్తన, సమాజం తదితరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.. ఆంత్రోపాలజీ. మన గురించి మనం చదువుకోవడం ఎప్పుడూ ఆసక్తే. అందుకే ‘ఆంత్రోపాలజీ’ని ఆప్షనల్‌గా ఎంచుకున్నా. దీన్ని ఎంతో ఆసక్తిగా అధ్యయనం చేయటం కలిసొచ్చింది. ఐఏఎస్ లక్ష్యం.. వరస వైఫల్యాలు ఐఆర్ఎస్కు ఎంపికైనా ఐఏఎస్ సాధించాలనే కసి ఉండేది. ఐఆర్ఎస్ బాధ్యతలు చూస్తూనే సివిల్స్‌కు సీరియస్‌గా చదివా. కానీ వరసగా మూడు, నాలుగో ప్రయత్నాల్లో వైఫల్యాలే ఎదురయ్యాయి. రెండుసార్లు మెయిన్స్ దాటలేకపోయాను. ఈసారి అయిదో ప్రయత్నంలో మొదటి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. నాన్న ఇచ్చిన స్ఫూర్తి ఈ విజయానికి ప్రధాన కారణం. అంతా సొంత ప్రిపరేషనే... మొదట ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నా. తర్వాత సొంతంగా ప్రిపేరయ్యాను. మార్కెట్లో దొరికే ప్రామాణిక పుస్తకాలనే చదివాను. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న మెటీరియల్‌నే పునశ్చరణ చేశాను. ప్రస్తుత పోటీ నేపథ్యంలో మొదట్నుంచి ఒక ప్రణాళిక ప్రకారం చదివితేనే మంచి ఫలితం వస్తుంది. సివిల్స్ ఔత్సాహికులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇంటర్వ్యూలు... ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు నా ప్రొఫైల్ నుంచే వచ్చాయి. మీరు సివిల్స్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలే వేశారు. ఇంటర్వ్యూ ఎంత బాగా చేసినా, ప్రస్తుత పోటీలో ఫలితాన్ని ముందే ఊహించడం కష్టం. మొదట్నుంచి ఫలితం గురించి ఆలోచించకుండా చదివాను. చివరకు ఏకంగా మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందం కలిగిస్తోంది. విద్య, ఆరోగ్యం: యువ రాష్ట్రమైన, ఎంతో అభివృద్ధికి అవకాశమున్న తెలంగాణకు ఐఏఎస్‌గా సేవచేసే అవకాశం వస్తే నిజంగా అదృష్టమే. సివిల్స్ ఫస్ట్ ర్యాంకు నాకు పెద్ద బాధ్యతను తీసుకొచ్చింది. నా శాయశక్తులా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తా. ఎక్కడైనా పనిచేయడానికి రెడీనే. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం..నాప్రాధమ్యాలు. ఎడ్యుకేషన్ ప్రొఫైల్ : పదో తరగతి మార్కులు: 86 శాతం ఇంటర్ మార్కులు: 97 శాతం ఇంజనీరింగ్ మార్కులు: 76 శాతం |
6వ ర్యాంక్‌తో సత్తాసాటిన శ్రీహర్ష : ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన కోయ శ్రీహర్ష సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 6వ ర్యాంక్ సాధించారు. ఈయన తల్లిదండ్రులు కోయ నాగేశ్వరరావు, సులోచన ప్రభుత్వ ఉపాధ్యాయులు. శ్రీహర్ష 1 నుంచి 5వ తరగతి వరకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు బల్లేపల్లి ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ను హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో, ఇంజనీరింగ్‌ను ఎన్ఐటీ జంషెడ్‌పూర్‌లో పూర్తి చేశారు. 2012లో సిగ్నోర్ ఇండియా కంపెనీలో ఉద్యోగాన్ని పొంది.. హైదరాబాద్, గుజరాత్లో పనిచేసిన ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2017 సివిల్స్ పరీక్షలో ప్రతిభను చాటి, శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో 6వ ర్యాంక్‌తో సత్తా చాటారు. |
కోటి జీతం వదిలి...కోచింగ్ లేకుండా ఓవైపు మల్టీనేషన్ కంపెనీ (ఎంఎన్సీ)లో ఏడాదికి కోటి రూపాయల జీతం. మరోవంక అనుకున్న లక్ష్యం సాధించాలనే సంకల్పం. భారీ జీతం కంటే లక్ష్యం వైపే మొగ్గు చూపి.. కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించాడు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన యిమ్మడి పృథ్వీతేజ్. ముంబైలో ఎలక్టిక్రల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత సామ్సంగ్ కంపెనీలో ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఏడాదిపాటు ఉద్యోగం చేశాడు. తర్వాత దానిని వదిలిపెట్టి సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. పట్టుదలతో చదివి ప్రతిభ కనబరచాడు. చిన్నప్పటి నుంచే చదువులో పృథ్వీ మంచి ప్రతిభ కనబరచేవాడని ఆయన తండ్రి యిమ్మడి శ్రీనివాసరావు, తల్లి రాణి తెలిపారు. |
100వ ర్యాంకు సాధించిన నారపురెడ్డి మౌర్య : వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలోని నాగులపల్లెకు చెందిన రైతు నారపురెడ్డి ఓబుళరెడ్డి కుమార్తె మౌర్య యూపీఎస్సీ ఫలితాల్లో 100వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లో స్వామి వివేకానంద ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసింది. మూడో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించింది. |
206వ ర్యాంక్ సాధించిన నాగవెంకట మణికంఠ : గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందిన సీహెచ్ నాగవెంకట మణికంఠ సివిల్ సర్వీసెస్‌లో 206 ర్యాంక్ సాధించారు. ప్రకాశం జిల్లా మార్టురులో ఇంటర్ వరకు చదివిన మణికంఠ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశారు. 2017లో ఇండియన్ ఫారెస్టు సర్వీసుకు ఎంపికై ప్రస్తుతం డెహ్రాడూన్‌లో శిక్షణ పొందుతున్నారు. ఆయన తండ్రి సీహెచ్ మంగాచారి ఫొటోగ్రాఫర్, తల్లి శారదాదేవి గహిణి. |
512వ ర్యాంక్: ప్రవీణ్‌చంద్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సివిల్స్‌లో 512వ ర్యాంకు సాధించారు. పాట్నా ఐఐటీలో ఎలక్టిక్రల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ప్రవీణ్ చంద్ ..నలుగురికీ సేవచేయాలనే లక్ష్యంతో తన బెంగళూరులో తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి తాత్కాలికంగా విరామం ప్రకటించి సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. 2016లో సివిల్స్‌కు ఒకసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అవకాశం రాలేదు. 2017 జూన్‌లో ప్రిలిమ్స్లోను, అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు రాసి, ఈ ఏడాది మార్చిలో ఇంటర్వ్యూకు వెళ్లాడు. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో 512వ ర్యాంకు సాధించాడు. |
కోచింగ్ తీసుకోకుండానే 374వ ర్యాంకు : 2017 సివిల్స్ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లెకు చెందిన సింగారెడ్డి సుబ్బారెడ్డి, సుజాతల కుమారుడు రిషికేశ్‌రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 374 ర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా సివిల్స్‌లో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. |
245వ ర్యాంకు: చందీష్ చిత్తూరు జిల్లా ఐరాల మండలం అడపగుండ్లపల్లి గ్రామానికి జి. చందీష్ సివిల్స్‌లో 245వ ర్యాంకు సాధించారు. తనను ఐపీఎస్‌గా చూడాలన్నదే తన అమ్మానాన్న కోరిక అని తెలిపారు. |
513వ ర్యాంకు: ప్రసన్నకుమారి అనంతపురం జిల్లాకు చెందిన ప్రసన్న కుమారికి సివిల్స్ ఫలితాల్లో 513వ ర్యాంకు పొందారు. తాడిపత్రి రూరల్ మండలం కొండేపల్లి గ్రామానికి చెందిన ప్రసన్నకుమారి బీటెక్‌ను 2014లో పూర్తి చేసి 2015 నుంచి సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించారు. ఇటీవల విడుదలైన గ్రూప్-1లోనూ డీఎస్పీ పోస్టు దక్కింది. సేవాభావమే సివిల్ సర్వీసెస్ వైపు వెళ్లేలా చేసిందని ప్రసన్న కుమారి తెలిపారు. |
884 ర్యాంకు: వంశీ దిలీప్ 2017 సివిల్స్ ఫలితాల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఇరుకుపాలెంకు చెందిన మీరావత్ వంశీదిలీప్ 884వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి డాక్టర్ మీరావత్ గోపినాయక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా ఐదేళ్లపాటు గుంటూరు జిల్లాలో పనిచేశారు. వరంగల్ నిట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో క్యాంపస్ సెలక్షన్లో తమిళనాడు నైవేలీలో నెలకు రూ.67వేల వేతనానికి ప్రైవేటు కంపెనీలో ఎంపికయ్యాడు. తొమ్మిదేళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి సివిల్స్‌పై ఆసక్తితో ఉద్యోగం వదిలిపెట్టి ఢిల్లీలో కోచింగ్‌లో చేరాడు. ఒకసారి సివిల్స్ మెయిన్స్ వరకు, మరోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. మూడోసారి పట్టుదలతో చదివి 884వ ర్యాంకు సాధించాడు. తన తండ్రి జిల్లా వైద్య అధికారిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన్ను చూసి ప్రజలకు సేవలు అందించేందుకు సివిల్స్ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు వంశీ దిలీప్ తెలిపాడు. |
22 ఏళ్లకే సివిల్స్.. హైదరాబాద్ కుర్రాడి ఘనత హెదరాబాద్ కుర్రాడు సాయి తేజ మొదటి ప్రయత్నంలోనే 22ఏళ్లకే సివిల్స్‌లో 43వ ర్యాంకు సాధించారు. ఆయన మాటల్లోనే...‘ హైదరాబాద్(మలక్ పేట). నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఐఐటీ, హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాను. 2016లో బీటెక్ పూర్తవుతూనే సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాను. 2017 జూన్‌లో ప్రిలిమ్స్ రాశాను. పబ్లిక్ సర్వీసులోకి రావాలని, సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజానికి ఎంతో చేయొచ్చని భావించి సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాను. నాన్న సివిల్స్ ద్వారా సమాజానికి సేవ చేయొచ్చని చెబుతుండటం కూడా నేను సివిల్స్ వైపు రావడానికి కారణం. సివిల్స్‌కు చాలా తక్కువ పుస్తకాలు చదివా. క్రమశిక్షణతో అంకితభావంతో ప్రిపరేషన్ కొనసాగించా. ఆయా అంశాలను విశ్లేషణాత్మకంగా చదవడం లాభించింది. పొలిటికల్‌సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆఫ్షనల్‌గా ఎంచుకున్నా. ఇంటర్వ్యూలో రాష్ట్ర విభజన, అంతర్జాతీయ అంశాలను అడిగారు. నమ్మకం, పట్టుదలతోనే విజయం సాధించా’. |
జేసీ కుమారుడికి 393 ర్యాంక్ : కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సురభి సత్తయ్య కుమారుడు సురభి ఆదర్శ్ సివిల్స్‌లో 393 ర్యాంకు సాధించారు. గతంతో మెయిన్స్ వరకు వెళ్లిన ఆదర్స్ ఈసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకు సాధించారు. సివిల్స్ సాధించాలన్నది తన కల అని.. ఇందుకోసం కష్టపడి చదివినట్లు చెప్పారు. |
అమ్మానాన్న పోత్సాహంతోనే... యూపీఎస్సీ వెల్లడించిన సివిల్స్ తుది ఫలితాలలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి పరిధి కాపులపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు బిడ్డ ఆలిండియా 480వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. కాపులపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి భాగ్యలక్ష్మి, లింగారెడ్డి దంపతుల ఏకై క కుమారుడు సాయినాథ్‌రెడ్డి. ఒకటి, రెండు తరగతులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఢిల్లీలో సివిల్స్‌కు కోచింగ్ తీసుకొని ర్యాంక్ సాధించాడు. |
607వ ర్యాంకు: కృష్ణకాంత్ పటేల్ సివిల్స్‌లో 607వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఐపీఎస్ కావాలనేది నా చిన్ననాటి కల. 2011లో కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అప్పటినుంచి సివిల్స్‌కు సిద్ధమవుతూ ఉన్నాను. ఇప్పటివరకు 5 సార్లు సివిల్స్ రాశాను. 2016లో ఎస్ఎస్బీలో అసిస్టెంట్ కమాండెంట్ (డీఎస్పీ ర్యాంకు)ఉద్యోగానికి ఎంపికయ్యాను. సివిల్స్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎస్ఎస్బీ అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. ఎన్నిసార్లు ఓటమి వచ్చినా పట్టుదల వదలకుండా కష్టపడ్డాను. నా విజయానికి తల్లిదండ్రులు, మా అన్నయ్య తోడ్పాటు అందించారు. పాజిటివ్‌గా ఆలోచించడమే నా సక్సెస్ మంత్ర. |
624వ ర్యాంకు: ఎడవెల్లి అక్షయ్‌కుమార్ మాది వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ. మా తాత, తండ్రి ఇద్దరు పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితోనే పోలీసుగా మారాలని నిర్ణయించుకున్నా. అందుకే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. నాన్న ప్రస్తుతం మడికొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు కొనసాగిస్తున్నాడు. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ భూపాల్‌లోని నిట్‌లో పూర్తి చేశాను. క్యాంపస్ ఇంటర్య్వూలో దుబాయ్‌లోని పెట్రోలియం కంపెనీలో అవకాశం వచ్చింది.. కానీ ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో వదులుకున్నా. |
జాతీయ స్థాయిలో 726వ ర్యాంక్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషు (23) చిన్నవయస్సులోనే సివిల్ సర్వీస్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2012-16 విద్యాసంవత్సరంలో ఢిల్లీలో బీటెక్(మెకానికల్) కోర్సు పూర్తి చేసి సివిల్ సర్వీసు పరీక్షలకు సన్నద్ధమయ్యారు. |
Published date : 28 Apr 2018 12:44PM