Skip to main content

సేవా పరిధి పెరుగుతుందనే... సివిల్స్ 101వ ర్యాంకర్ ఎన్. టి. లోహిత్ రెడ్డి

‘మెడిసిన్ చదివినా ప్రజలకు సేవ చేయొచ్చు. కానీ పరిధి పరిమితంగా ఉంటుంది. రోగులకు అవసరమైన పరికరాలు లేక సరైన సేవలందించే అవకాశం దక్కకపోవచ్చు. అదే ఐఏఎస్ అధికారి అయితే సేవా పరిధి పెరుగుతుంది. మౌలిక సదుపాయాల విషయంలో మరింత ఎక్కువగా సేవలందించొచ్చు. అందుకే ఐఏఎస్ లక్ష్యంగా ఎంచుకున్నాను’ అనేది తొలి ప్రయత్నంలోనే 101వ ర్యాంకు సాధించిన ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ ఎన్. టి. లోహిత్ రెడ్డి అభిప్రాయం. ప్రస్తుత ర్యాంకుకు ఐపీఎస్ వచ్చే అవకాశముందని.. ఐఏఎస్ మాత్రమే లక్ష్యం కాబట్టి మరోసారి ప్రయత్నిస్తున్నానని అంటున్న లోహిత్ సక్సెస్ స్పీక్స్..

ఎంబీబీఎస్ రెండో ఏడాదిలోనే పునాది:
సివిల్ సర్వీసెస్ లక్ష్యంపై రెండో ఏడాది నుంచే దృష్టి సారించాను. వాస్తవానికి ఎంబీబీఎస్ రెండో ఏడాదిలోనే క్లినికల్స్ మొదలవుతాయి. పేషెంట్స్‌తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ సమయంలో వారికి ఎదురవుతున్న సమస్యలను ప్రత్యక్షం గా చూశాను. వాటికి పరిష్కారం లభించాలంటే.. మరిన్ని సేవలందించాలని, ఆ అవకాశం ఐఏఎస్‌తోనే సాధ్యమవు తుందని గుర్తించాను. అప్పట్నుంచే సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ నుంచి పూర్తి స్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. క్రమంగా మెటీరియల్ సేకరణ, సిలబస్ విశ్లేషణ వంటి ప్రణాళికలు అనుసరించాను.

ప్రిలిమ్స్‌కు ఇలా:
ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలో హౌస్ సర్జన్సీ చేస్తున్నాను. ఆ సమయంలో సెలవు ఇవ్వరు. దీంతో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాను. అందుబాటులోని సమయంలో ప్రతి రోజు ఐదారు గంటలు కేటాయించాను. అన్ని సబ్జెక్ట్‌లను ఒక క్రమంలో పూర్తిచేశాను. వాస్తవానికి ప్రిలిమ్స్‌కు పూర్తి స్థాయి లో లభించిన సమయం ఆరు నెలలు మాత్రమే. ఆ సమయాన్నే సద్వినియోగం చేసుకున్నాను. ప్రిలిమ్స్ పేపర్ చూ శాక మెయిన్స్‌కు క్వాలిఫై అవుతాననే నమ్మకం ఏర్పడింది.

మెయిన్స్‌కు.. మెయిన్ ఫోకస్:
హౌస్ సర్జన్సీ కారణంగా ప్రిలిమ్స్ ప్రిపరేషన్ విషయంలో ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ.. ప్రిలిమ్స్ పరీక్ష తేదీ నాటికి అది పూర్తవడం కలిసొచ్చింది. 2012 మే నుంచి మెయిన్స్‌పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడానికి వీలు లభించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ.. ఆప్షనల్స్. ఇందుకు కారణాలు.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ భవిష్యత్తులో ఐఏఎస్ అధికారిగా బాధ్యతల నిర్వహణలో ఉపయోగపడుతుంది. ఇక.. ఆంత్రోపాలజీలో 1/4వ వంతు సిలబస్ మెడిసిన్ సంబంధితమే. అంతేకాకుండా సిలబస్ పరంగా పరిధి తక్కువ. ప్రతి సబ్జెక్ట్‌ను సిలబస్ ప్రకారం చదువుతూ ముఖ్యమైన అంశాలతో నోట్స్ రూపొందించుకున్నాను. ప్రతి రోజు 8 నుంచి పది గంటలు చదివాను. ఇది రివిజన్‌కు ఉపకరించింది. పరీక్ష మాత్రం కష్టంగా అనిపించింది. డిగ్రీ స్థాయి అని సిలబస్‌లో పేర్కొన్నప్పటికీ.. దానికి మించి ప్రశ్నలు అడిగారు. కానీ అప్పటికే నేను సొంతం చేసుకున్న పరిజ్ఞానం కారణంగా మెయిన్స్ రాశాక ఫలితం గ్యారంటీ అని.. ఇంటర్వ్యూ కాల్ వస్తుందని ఊహించాను.

ఫ్యాక్ట్స్, కాంటెపరరీ సమ్మేళనంగా ఇంటర్వ్యూ:
నా ఇంటర్వ్యూ మార్చి 20న రజనీ రజ్దాన్ బోర్డ్‌లో జరిగింది. 20 నుంచి 25 నిమిషాలు సాగిన ఇంటర్వ్యూలో కొన్ని ఫ్యాక్ట్ బేస్డ్, మరికొన్ని సమకాలీన అంశాలపై ప్రశ్నలు అడిగారు. అవి...
  1. ఎంబీబీఎస్ నుంచి ఐఏఎస్‌కు ఎందుకు రావాలనుకుంటున్నారు?
  2. మీ జిల్లా సమస్యలేంటి? వాటికి మీరు సూచించే పరిష్కార మార్గాలు?
  3. తీవ్రవాద సమస్యను నిర్మూలించాలంటే ఎలాంటి వ్యూహాలు అవసరం?
  4. కరువుని ఎలా గణిస్తారు?
  5. సంస్కృతం పదం అర్థం ఏంటి? దాని ప్రభావం తగ్గుతోంది. కారణమేంటి?
  6. ప్రైవేట్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని బోర్డ్స్ పెట్టుకుంటాయి. కానీ అవే సదుపాయాలుండే ఎయిమ్స్, ఉస్మానియా వంటి ప్రభుత్వ హాస్పిటల్స్ అలా ఎందుకు పేర్కొనవు?
ఇంటర్వ్యూలో సంస్కృతంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయాను. సమాధానాలు చెప్పిన తీరు, దానికి వారు స్పందించిన విధానం పరిశీలించాక ఏదో ఒక ర్యాంకుపై నమ్మకం పెట్టుకున్నాను. అదే నిజమైంది.

ఇలా చదివితే:
సివిల్స్ అభ్యర్థులకు నా సలహా ఏంటంటే.. ప్రిలిమ్స్ పూర్తిగా మెమొరీ బేస్డ్ పరీక్ష. ప్రతి సబ్జెక్ట్‌ను రెండు, మూడు సార్లు రివిజన్ చేసుకోవాలి. ఇక.. మెయిన్స్‌లో ఆప్షనల్స్ మినహా అన్ని సబ్జెక్ట్‌లు అవగాహన శక్తి, విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉండటంతోపాటు ప్రిలిమ్స్‌లోని కొన్ని అంశాలతో అనుసంధానం కలిగుంటాయి. కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్ కామన్ సబ్జెక్ట్స్‌ను ఉమ్మడిగా ప్రిపరేషన్ సాగించడం మంచిది. దీనివల్ల సమయం కలిసొస్తుంది. నేను ఇదే పద్ధతిని అనుసరించాను. అంతేకాకుండా కంబైన్డ్ స్టడీ, ఇంటర్నెట్ సోర్సెస్‌ను వినియోగించుకోవాలి. ప్రామాణిక మెటీరియల్‌లో లభ్యం కానిది ఇంటర్నెట్ వికీపీడియా ద్వారా లభిస్తుంది.

ఐఏఎస్ సాధనే లక్ష్యం:
పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ విధానాలను వారి దరికి చేర్చి.. పూర్తి సదుపాయాలందించాలంటే ఐఏఎస్ అధికారిగానే సాధ్యమవుతుంది. కానీ నా ప్రస్తుత ర్యాంకుతో ఐఏఎస్ వచ్చే అవకాశం తక్కువ. అందుకే 2013 సివిల్స్‌కు ప్రిపరేషన్ సాగిస్తున్నాను. ఈసారి కచ్చితంగా ఐఏఎస్ సాధిస్తాననే నమ్మకం ఉంది.

కుటుంబ నేపథ్యం:
తండ్రి: ఎన్.కొండారెడ్డి(హెడ్ కానిస్టేబుల్ కమలాపురం)
తల్లి: వసుధ దేవి (గృహిణి)
సోదరి: సుష్మారెడ్డి (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్)

అకడెమిక్ ప్రొఫైల్:
పదో తరగతి (2004): 543 మార్కులు
ఇంటర్మీడియెట్ (2006): 967 మార్కులు
ఎంసెట్ (2006) ర్యాంకు: 6
ఎంబీబీఎస్: 2012
Published date : 21 May 2013 01:17PM

Photo Stories