Skip to main content

ఈ ఆశయం కోస‌మే...ఐఏఎస్ సాధించా : కలెక్టర్‌ లక్ష్మీశ

కుటుంబ నేప‌థ్యం:
మాది కర్నాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలోని హాళుగుండనహాళీ అనే చిన్న పల్లెటూరు. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. నా తల్లిదండ్రులు లక్ష్మమ్మ, గంగముత్తయ్య వ్యవసాయం చేస్తుంటారు. ఒక అన్న, ముగ్గురు సిస్టర్స్‌ ఉన్నారు. నా బాల్యం అంతా కర్నాటకలోనే సాగింది. వ్యవసాయ కుటుంబం కావడంతో బీఎస్సీ అగ్రికల్చర్‌ చేసి అదే సబ్జెక్టులో పీహెచ్‌డీ చేశాను.

అమ్మ ఆశయం నెరవేరాలన్నా...
అమ్మ కోరిక మేరకు ఐఏఎస్‌ చదివేందుకు ఢిల్లీ వెళ్లాను. అక్కడే ఉండి ఐఏఎస్‌ పరీక్ష కోసం చదివాను. 2010లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికయ్యాను. అదే సమయంలో వ్యవసాయశాఖ కృషి విజ్ఞాన్‌ కేంద్రంలో సైంటిస్టుగా పోస్టింగ్‌ వచ్చింది. అప్పట్లో ప్రజలకు సేవ చేయాలన్నా, అమ్మ ఆశయం నెరవేరాలన్నా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసే కరెక్ట్‌ అని భావించి దానిలో చేరాను. అయితే అమ్మ కోరిక ప్రకారం ఐఏఎస్‌కు ఎంపిక కావాలనే ఆశయంతో మరోమారు ప్రయత్నించాను. ఇలా నాలుగో సారి 2013 బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యాను. అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం సాకారమైంది.

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి...
ఐఏఎస్‌...దీనిని సాధించాలని ఎంతోమంది కలలు గంటారు. అన్ని అవకాశాలూ... పరిస్థితుల ప్రోత్సాహం... ఆర్థిక స్థితిగతులూ... తోడున్నా... అందుకోవడం కష్టమే. కానీ ఇవన్నింటికీ దూరంగా... కేవలం స్వశక్తితో పోరాడి ఐఏఎస్‌ అందుకున్నవారు అతి కొద్దిమందే ఉంటారు. అలాంటి కోవకు చెందినవారే డాక్టర్‌ జి.లక్ష్మీశ. నాలుగొందల మంది జనాభా ఉన్న కుగ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, తల్లి పెంపకంలో ఐఏఎస్‌గా ఎదిగారాయన. ప్రస్తుతం పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా గిరిజన ప్రాంతంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో అడుగుపెట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మూడున్నర దశాబ్దాల ఐటీడీఏకు 52 మంది పీఓలు పనిచేశారు. వారంతా సగటున ఏడాదికి 20 రోడ్లు కనెక్ట్‌ చేస్తే లక్ష్మీశ ఒకే ఏడాదిలో 200 రోడ్లతో గిరిజన ప్రాంతాలను కనెక్ట్‌ చేయగలిగారు. ఇలాంటి విశేషాలు ఆయన మాటల్లోనే..

జేసీగా తొలి పోస్టింగ్‌...
2013లో ఐఏఎస్‌గా ఎన్నిక అయిన తరువాత మొట్టమొదటిగా కర్నూలు జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా చేరాను. అనంతరం నూజివీడులో సబ్‌ కలెక్టర్‌గా పని చేశాను. అక్కడ నుంచి 2016లో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వెళ్లాను. అక్కడ పని చేస్తుండగా బదిలీ చేయడంతో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌గా వచ్చాను. నూజివీడులో సబ్‌ కలెక్టర్‌గా పని చేసిన సమయంలో ఎయిర్‌పోర్టుకు 450 ఎకరాల భూమిని ఫిల్లింగ్‌ చేశాను. పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీకి 1,400 ఎకరాలు సేకరించాం. కృష్ణా పుష్కరాల నిర్వహణలో ఇన్‌చార్జిగా పని చేశాను. జిల్లాను పూర్తి అవగాహన చేసుకుంటాను. మెరుగైన సేవల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాను. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న నవరత్న పథకాలను పేద వర్గాల ప్రజలకు నేరుగా చేరేందుకు కృషి చేస్తాను.

ఇది నా అదృష్టం..
వ్యవసాయ ప్రధానమైన, ధాన్యాగారంగా పేరున్న తూర్పుగోదావరి జిల్లాలో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మాది వ్యవసాయ కుటుంబం కావడంతో వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అదే ఉద్దేశంతో బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివి పీహెచ్‌డీ చేశాను. రైతు బాగుంటేనే రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం బాగుంటుందని నేను నమ్మడంతో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేసే పథకాలు నేరుగా పేద రైతుకు చేరేలా ఉన్నతాధికారులతో కలిసి పనిచేస్తాను. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో అవినీతిరహిత పాలన సాగిస్తూ, ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని పేదలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తాను. అధికారులు కూడా అందుకు అనుగుణంగానే పనిచేయాలి. ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరిస్తా. ప్రజలకు జవాబుదారీగానే పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రెవెన్యూలో అనేక రకాల భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా పని చేస్తాం.

పేదరికంలో ఉన్నా నేను....
అమ్మ నన్ను ఓ ఉన్నతమైన వ్యక్తిగా, పది మందికి సేవ చేసే వాడిగా చూడాలనుకొంది. బాగా చదువుకుంటేనే అది సాధ్యమవుతుందనుకున్నాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ఆదర్శంగా తీసుకుని, అమ్మ ఆశయం నెరవేర్చాలని భావించాను. పేదరికంలో ఉన్నా నేను ఉన్నతస్థాయికి వెళ్లి పేదలకు సేవలు చేయాలన్న అమ్మ కోరికను నెరవేర్చాలని సంకల్పించుకున్నాను. ఒక్క ఐఏఎస్‌తోనే అది సాధ్యమని భావించాను. సాధించాను.
Published date : 14 Apr 2021 03:20PM

Photo Stories