ఈ ఐపీఎస్ ఆఫీసర్ సామాన్యుడు కాదు...
ఇది అందరూ అర్థం చేసుకోవాలి. పోలీస్ కూడా అందరిలాగే మామూలు మనిషేనని గుర్తించాలి. ప్రస్తుతం సిస్టమ్ ఆర్గనైజ్‌డ్‌గానే ఉంది. నిబద్ధత ఉంటే ఎలాంటి మార్పు అయినా తీసుకురావచ్చు. అది నేను స్వయంగా చూశాను. పోలీసులు ప్రజలని, ప్రజలు పోలీసులను గౌరవించుకోవాలి. ప్రజలు పోలీసులను నమ్మాలి. అసలు మా దగ్గరికి రాకుండానే వ్యవస్థ సరిగా లేదనడం సరికాదని అన్నారు బిహార్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, రచయిత అమిత్ లోదా. ఆయన రాసిన ‘బిహార్ డైరీస్’పుస్తక అనుభవాలను పంచుకునేందుకు ఇటీవల సిటీకి వచ్చిన లోదా‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ...
వాళ్లని పట్టు కోవడాన్ని చాలెంజింగ్‌గా తీసుకున్నాను...
నా తొలి పోస్టింగ్(2006) శిక్‌పురా. అక్కడికి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక పెద్దావిడ ఏడుస్తూ వచ్చి నా కుటుంబంలో అందరినీ చంపేశారని చెప్పింది. ఓ చిన్న కారణానికే ఓ ముఠా 24 గంటల్లో 15 మందిని చంపేసింది. అదే ముఠా అంతకముందు 70 మందిని పొట్టనపెట్టుకుంది. వాళ్లని పట్టు కోవడం చాలెంజింగ్‌గా తీసుకున్నాను. అప్పట్లో ఇంత సాంకేతికత లేకున్నా కష్టపడి వాళ్లను పట్టుకున్నాం. ఇప్పుడు వారంతా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఆ ముఠా అరాచకాలు సాగించిన నాలుగైదు జిల్లాల్లో ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వారిని అరెస్టు చేశాక నా కంటే ఎక్కువ నా భార్య ఆనందించింది.
హీరో అక్షయ్‌కుమార్‌తో డిన్నర్ చేస్తున్నప్పుడు...
బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌తో డిన్నర్ చేస్తున్నప్పుడు బిహార్‌లో నేను ఛేదించిన కేసుల గురించి చెప్పాను. ఆయన సినిమా తీస్తే బాగుంటుందని సూచించారు. దర్శకుడు నీరజ్‌పాండే ఆ పనిలో ఉన్నారు. అదే సమయంలో ట్వింకిల్, ఇమ్రాన్‌హష్మీ తదితరులు పుస్తకం రాయమన్నారు. ‘బిహార్ డైరీస్’ పేరుతో నేను రాసిన పుస్తకానికి మంచి పేరొచ్చింది. ఇప్పుడు మరో పుస్తకం రాసే పనిలో ఉన్నాను.
నా ట్రైనింగ్ ఇక్కడే..
21ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోనే నా ట్రైనింగ్ జరిగింది. అప్పటికే ఇక్కడి ట్రాఫిక్ సిస్టమ్ దేశంలోని మిగతా ప్రాంతాల కంటే ఆర్గనైజ్డ్‌గా ఉండేది. టెక్నికల్‌గా ఏదైనా అడాప్ట్ చేసుకోవడంలో ఇక్కడి పోలీసులు ముందుంటారు. జూబ్లీహిల్స్‌లోని పోలీస్ స్టేషన్... లాస్‌వేగాస్‌లోని పీఎస్‌లాగా ఎంతో అందంగా ఉంది. నాకు రోల్‌మోడల్ అంటూ ఎవరూ లేరు. చాలామంది నుంచి ఎన్నో నేర్చుకున్నాను. మహిళలపై దాడులు, అత్యాచారాలు తగ్గాలంటే పురుషులు మారాలి. పురుషులు మహిళలతో మర్యాదగా నడుచుకోవాలి. అందరం సమానత్వమనే భావన రావాలి. ఇది పిల్లలకు చెప్పాలి. నీతి నిజాయతీతో అవినీతికి దూరంగా ఉండేవారే నిజమైన హీరోలు.
రూ.45 కోట్ల విరాళాలను సేకరించాం...
‘భారత్ కే వీర్’ పేరుతో ఓ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేశాను. మనదేశ జవానుల సేవలు, వారి త్యాగాల గురించి అందరికీ తెలియకపోవచ్చు. అలాంటి హీరోల గాథలు ఇందులో ఉంచుతాం. అమరుల కుటుంబసభ్యులు, వారి బ్యాంకు అకౌంట్ వివరాలను ఇందులో పొందుపరుస్తాం. ఎవరైనా వారికి విరాళాలను అందించవచ్చు. ఒకటిన్నర ఏడాదిలో రూ.45 కోట్ల విరాళాలను సేకరించాం.
సినిమా కథలకు ఏ మాత్రం తీసిపోవు...
ఢిల్లీ ఐఐటీలో చదివిన అమిత్ లోదా రచయిత, వక్త, పోలీస్ ఆఫీసర్. బిహార్‌లో ఎన్నో సాహసోపేతమైన పోలీస్ ఆపరేషన్లలో పాల్గొని గ్యాంగ్‌స్టర్లను అరెస్ట్ చేశారు. ఆయన ఛేదించిన అనేక క్రైమ్ సంఘటనలు సినిమా కథలకు ఏ మాత్రం తీసిపోవు. పోలీస్ అధికారిగా ఆయన ప్రతిష్టాత్మక పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్, గుడ్ గవర్నెన్స్‌కు జీఫైల్స్ అవార్డ్, ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు.