Skip to main content

గమ్యాన్ని మార్చిన...ఆడిటింగ్ ప్రయాణాలు.. సివిల్స్ 16వ ర్యాంకర్ శశాంక

‘చార్టర్డ్ అకౌంటెన్సీ.. సివిల్ సర్వీసెస్ రెండూ విభిన్న నేపథ్యాలు. కానీ.. సామాజిక దృక్పథం ఒకింత ఎక్కువగానే ఉన్న కుటుంబ నేపథ్యం, ప్రజలతో మమేకమై సేవలందించాలనే లక్ష్యం, అన్నిటికంటే ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్ విధుల్లో భాగంగా వివిధ ప్రదేశాలు, విభిన్న సంస్కృతులు, వివిధ రకాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూశాను. దీనికి మార్గం ఐఏఎస్ మాత్రమే’.. అనే గట్టి నిర్ణయమే 16వ ర్యాంకు సాధనకు కారణం అంటోన్న ఏపీ సివిల్స్ టాపర్ కె.శశాంక సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే...

16వ ర్యాంకు... ప్లజెంట్ సర్‌ప్రైజ్:
సివిల్స్-2012 మెయిన్స్ పరీక్షలు రాశాక విజయం సాధిస్తాననే నమ్మకం కలిగింది. ఏపీ టాపర్‌గా నిలుస్తానని ఊహించలేదు.

సీఏ నుంచి సివిల్స్‌కు కారణమిదే:
చార్టర్డ్ అకౌంటెంట్‌గా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూశాను. ఐఏఎస్‌లాంటి ప్రభుత్వ అత్యున్నత సర్వీసు ద్వారానే ప్రజల సమస్యలను పరిష్కరించగలం అని నమ్మి నా లక్ష్యాన్ని మార్చుకున్నాను. ఎంపీడీఓగా పనిచేసిన మా పెదనాన్న పురుషోత్తం పేద ప్రజలకు కనీస అవసరాలను తీర్చేందుకు చేసిన కృషి కూడా నేను సివిల్స్ రాయడానికి స్ఫూర్తిగా నిలిచింది.

2009లో మొలకెత్తిన ఆలోచన:
సివిల్స్‌కు హాజరవ్వాలి అనే ఆలోచన 2009లో మొలకెత్తింది. అయితే పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌వైపు దృష్టి సారించింది 2010 నుంచే. మొదటి ప్రయత్నం (సివిల్స్-2011)లో ప్రిలిమ్స్‌లో మాత్రమే ఉత్తీర్ణత సాధించాను. మెయిన్స్‌లో వైఫల్యం ఎదురైంది. మరింత పట్టుదల, అంకితభావంతో చదివి 16వ ర్యాంకు సాధించా.

ఓటమి కారణాన్ని గుర్తించాను:
జనరల్ స్టడీస్‌లో టైం మేనేజ్‌మెంట్ లోపం, అనవసరమైన అంశాలు చదవడం .. మొదటిసారి వైఫల్యానికి కారణమని గుర్తించాను. అకడెమిక్‌గా కోర్ సబ్జెక్ట్ అయిన కామర్స్‌ను ఫస్ట్ ఆప్షనల్‌గా, ఎకనామిక్స్‌ను రెండో ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. వాస్తవానికి ఎకనామిక్స్ సిలబస్ పరిధి విస్తృతం. కానీ సమాజ అవసరాలకు మూలం ఆర్థిక శాస్త్రం నుంచే మొదలవుతాయి. అంతేకాకుండా పొలిటికల్ ఎకానమీ కూడా ప్రాధాన్యంగా ఉంది. సామాజిక అవగాహన లభిస్తుందనే ఉద్దేశంతో ఎకనామిక్స్‌ను ఎంచుకున్నాను. ఇది ఆప్షనల్‌కు, జనరల్ స్టడీస్‌కు కూడా ఉపయోగపడింది.

ప్రిపరేషన్ ఇలా:
జనరల్ స్టడీస్, ఎకనామిక్స్‌కు ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నా .. హెదరాబాద్‌లోనే ప్రిపరేషన్ సాగించాను. కోచింగ్ తీసుకోవడం వల్ల ఏం చదవాలో ... ఎలా చదవాలో .. చదవని అంశాలేంటో తెలుస్తాయి. ఇంటర్వ్యూ కోసం నాలుగైదు మాక్ ఇంటర్వ్వూలకు హాజరయ్యాను. ఇది కూడా ఎంతో ఉపయోగపడింది. ఎంత సేపు చదివాం? అనే ప్రశ్న కంటే ఎంత ఏకాగ్రతతో ఎంత క్వాలిటేటివ్‌గా చదివాం? అనే అంశాలే ముఖ్యమైనవి. ఒక టాపిక్‌ను ఎంచుకున్నప్పుడు దానికి సరైన మెటీరియల్ దగ్గర పెట్టుకుని క్షుణ్నంగా, లోతుగా అధ్యయనం చేయాలి. నా కు వ్యక్తిగతంగా రీడింగ్ హాబీ కావడం ఈ విషయంలో తోడ్పడింది.

ఒత్తిడికి గురి కాలేదు:
సివిల్స్ ప్రిపరేషన్ సమయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదు. ఎప్పుడైనా అనిపిస్తే ఇంట్లో వాళ్లతో ఫోన్లో మాట్లాడటం, బ్యాడ్మింటన్ ఆడ టం, జనరల్ బుక్స్ చదవడం వంటి వాటితో ఒత్తిడి తగ్గించుకున్నాను.

ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు:
ప్రొఫెసర్ డేవిడ్ బోర్డ్‌తో 25 నిమిషాలపాటు ఇంటర్వ్యూ సాగింది. అధిక శాతం ప్రశ్నలు నా వృత్తి సీఏకు సంబంధించినవే ఉన్నాయి. వీటితోపాటు అడిగిన కొన్ని ప్రశ్నలు..
  1. రాజ్యాంగంలోని ఎమర్జెన్సీ నిబంధనలేంటి?
  2. ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటి?
  3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతమున్న మూడు ప్రధాన సమస్యలేంటి?
  4. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం గురించి చెప్పండి?
  5. చార్టర్డ్ అకౌంటెంట్‌గా చేయలేనిది, సివిల్ సర్వీస్‌లో చేయగలిగింది?
  6. పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ అంటే ఏంటి?
  7. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం గురించి చెప్పండి?
  8. కాగ్ ఆడిట్ ప్రాసెస్ గురించి తెలపండి?

ఒకట్రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినప్పటికీ.. ఇంటర్వ్యూ బాగా చేశాననిపించింది. ర్యాంకు వస్తుందనే విశ్వాసం ఏర్పడింది.

సలహా:
కష్టపడి చదువుతున్నాం అనే భావన రానీయకుండా ఇష్టపడి చదవండి. సివిల్స్ అంటే పుస్తకాల పురుగులు కానక్కర్లేదు. సాధారణ దైనందిన కార్యకలాపాలు సాగిస్తూనే ప్రామాణిక మెటీరియల్, నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ చేయొచ్చు. చదవడంతోపాటు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. పరీక్షలో పద్ధతి ప్రకారం ఒక అంశానికి నిర్దిష్ట సమయం, పదాలు కేటాయించుకుని ముగించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. విజయానికి దోహదపడే సాధనాలైన మాక్ టెస్ట్‌లు, మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం కూడా మంచిది. ప్రిపేర్ అవుతున్న క్రమంలో మిత్రులకు, బంధువులకు దూరం కావాల్సి ఉంటుంది. అత్యున్నత సర్వీసు అందుకోవాలంటే ఆ మాత్రం త్యాగం తప్పదు.

కుటుంబ నేపథ్యం:
తండ్రి: వెంకటయ్య (ఐడీపీఎల్ రిటైర్డ్ ఉద్యోగి)
తల్లి: సంయుక్త (రిటైర్డ్ హైస్కూల్ టీచర్)
సోదరుడు: ఆదిత్య (యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్)

అకడెమిక్ ప్రొఫైల్
పదో తరగతి (2000)- 86 శాతం
ఇంటర్మీడియెట్ (2002)- 91 శాతం
బీకాం(ఆనర్స్) (2005) - 73 శాతం
సీఏ ఫైనల్ - 2007
Published date : 09 May 2013 02:42PM

Photo Stories