ఎంబీబీఎస్ చదివినా..ఐపీఎస్ వైపే నా చూపు..: ఐపీఎస్ తరుణ్ జోషి
అదిలాబాద్ ఎస్పీగా పని చేస్తుండగా పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నారు... రెండేళ్ళ కాలంలో ఐదు పర్వతాలను అధిరోహించారు...నెలలోనే అంటార్కిటికా, ఆస్ట్రేలియాల్లో ఉన్న రెండింటిపై పాద మోపారు... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యంగా అనునిత్యం సాధన చేస్తున్న ఆయన విజయాలపై ప్రత్యేక కథనం..
ఎంబీబీఎస్ టు ఐపీఎస్...
పంజాబ్‌కు చెందిన తరుణ్ జోషి పటియాలాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేసి దంత వైద్యుడిగా మారారు. 2004లో సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణులైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో ఉండి డీఐజీ హోదాలో సిటీ స్పెషల్ బ్రాంచ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఓపక్క తన విధుల్ని సమర్థవంతంగా నిర్వరిస్తూనే... మరోపక్క ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ళ క్రితం ఓయూ నుంచి పోలీస్ మేనేజ్‌మెంట్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆపై ఎల్‌ఎల్‌బీలో చేరిన ఆయన గత ఏడాది జూలైలో ఉత్తీర్ణులు కావడమే కాదు... ఓయూలోనే టాప్ ర్యాంకర్‌గా నిలిచారు.
రాచకొండ నుంచే నాంది...
అదిలాబాద్ ఎస్పీగా పని చేసినన్నాళ్లూ పని ఒత్తిడి నేపథ్యంలో డార్జిలింగ్ వెళ్లడం ఆయనకు సాధ్యం కాలేదు. అక్కడ నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు తొలి సంయుక్త పోలీసు కమిషనర్‌గా వచ్చిన తరుణ్ తనలో ఉన్న పర్వతారోహణ ఆసక్తికి పదును పెట్టారు. 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న ఆయన అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోనే ఉన్న మౌంట్ రీనాక్‌కు ఎక్కారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా పర్వతారోహణ చేస్తున్న ఆయన ఇప్పటి వరకు ఐదింటిపై తన కాలు మోపారు. అనునిత్యం ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈయన పర్వతారోహణ కోసం అదనపు కసరత్తు చేస్తుంటారు. సమయం చూసుకుని ఎవరెస్ట్‌పై కాలు పెట్టడమే తన లక్ష్యమని తరుణ్ జోషి చెప్తున్నారు.
అనుకోకుండా ఆసక్తి..
తరుణ్ జోషి 2014 నుంచి 2016 వరకు అదిలాబాద్ జిల్లా ఎస్పీగా పని చేశారు. అప్పట్లో అదనపు ఎస్పీ జి.రాధిక ఆ జిల్లాలోనే పని చేశారు. పర్వతారోహణపై పట్టున్న ఈమె అప్పట్లోనే కొన్నింటిని అధిరోహిస్తూ ఉండే వారు. విధి నిర్వహణలో భాగంగా అనునిత్యం తరుణ్ జోషిని కలిసే ఆమె తన పర్వతారోహణ అనుభవాలను పంచుకునే వారు. ఇలా అనుకోకుండా ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన తాను పర్వతారోహకుడిని కావాలని భావించారు. సంతృప్తితో పాటు మానసిక, శారీరక దారుణ్యాలకు ఇది ఉపకరిస్తుందనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని రాధికతో చెప్పగా... తొలుత డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకోవాలని, ఆపై తుది నిర్ణయానికి రావాలని ఆమె సూచించారు.
అదో చిత్రమైన అనుభూతి....
ఓ బృందంతో అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్‌ను అధిరోహించా. దక్షిణ ధృవంలో ఉన్న అంటార్కిటికాలో ప్రస్తుతం 24 గంటలూ పగలే ఉంటుంది. దీంతో రెండు రోజుల పాటు నిద్రపోవడానికి, సమయం గుర్తించడానికి చాలా ఇబ్బంది పడ్డా. వాచీ చూసుకుంటే 11, 12 గంటలు చూపించేది. అది పగలో, రాత్రో తెలియక తికమక పడాల్సి వచ్చింది. ఆపై ఫోన్‌లో టైమ్‌ను 24 గంటల ఫార్మాట్‌కు మార్చుకుని.. రాత్రి అయిందని తెలుసుకుని నిద్రపోయే వాళ్ళం. సూర్యరస్మి కారణంగా గరిష్టంగా 3 గంటలకు మించి నిద్ర పట్టేదికాదు. అది పర్వతారోహణ పూర్తయిన వారంలోనే ఆస్ట్రేలియాలోని మరో పర్వతాన్ని అధిరోహించాం. తదుపరి టార్గెట్... మౌంట్ ఎవరెస్ట్.