అనుకున్నది సాధించా సివిల్స్ 164వ ర్యాంకర్ శ్రీరాం సాంబశివరావు
ఐఐటీ మద్రాస్‌లో విద్యాభ్యాసం. ఆ వెంటనే ఆరంకెల జీతంతో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం. అయినా ఏదో వెలితి, ఏదో సాధించాలనే తపన, చివరకు అదే తన జీవిత లక్ష్యాన్ని సాధించేలా చేసిందని అంటున్నారు సివిల్స్ 164వ ర్యాంకర్ శ్రీరాం సాంబశివరావు. ఆయనతో
సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఇంటర్వ్యూ...
మీ కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం గురించి తెల్పండి?
మాది కృష్ణా జిల్లా, విజయవాడ. నాన్న దక్షిణ భారత రైల్వేలో టికెట్ ఇన్‌స్పెక్టర్, అన్నయ్య బ్యాంకు మేనేజర్, అక్క గ్రూప్- 2 అధికారి, తమ్ముడు డాక్టర్. ఇలా మా ఇంట్లో అంతా ఉన్నత ఉద్యోగులే. ఇంటర్మీడియట్ వరకూ నేను విజయవాడలోనే చదివాను. తర్వాత బీటెక్ ఐఐటీ మద్రాస్‌లో చేసి, ఓ మల్టీ నేషనల్ కంపెనీలో రెండేళ్ల పాటు ఉద్యోగం చేశాను. ఆ సమయంలోనే ఐఐఎం బెంగళూరులో చేరే అవకాశం వచ్చింది. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఐఐఎంలో చేరకుండా, ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను.
సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారి కావాలన్నది నా జీవిత లక్ష్యం. చిన్నప్పటి నుంచే నా మనసులో అనుకునే వాడ్ని ఎప్పటికైనా ఐఏఎస్ అవ్వాలని. బీటెక్ పూర్తయి ఉద్యోగంలో చేరిన కొత్తలో కొంతకాలం నా లక్ష్యం నుంచి దూరంగా జరిగాను. ఈ సమయంలోనే రెండుసార్లు సివిల్స్ రాసి విఫలమయ్యాను. సాధించాలనే పట్టుదల నన్ను కార్యోన్ముఖుడ్ని చేసింది. మూడోసారి 2010లో సివిల్స్ మెయిన్స్ రాశాను. ఇంటర్వ్యూకి పిలుపు రాలేదు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. ఈసారి కచ్ఛితంగా సెలక్టవ్వాలని. అందుకనుగుణంగా ప్రిపేరయ్యాను. చివరికి అనుకున్నది సాధించాను.
మీ ప్రిపరేషన్ ఎలా సాగింది?
సొంతంగానే ప్రిపేరయ్యాను. ఆయా అంశాలకు సంబంధించిన నోట్సు ప్రిపేరు చేసుకోవడం, అర్థం కాని అంశాలను ఆయా విషయాల్లో నిష్ణాతులైన ప్రొఫెసర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవడం. ఈ విధంగా నా ప్రిపరేషన్ సాగింది.
మీరు ఎంచుకున్న ఆప్షనల్స్ ఏమిటి? వాటినే ఎంచుకోవడానికి కారణం?
నా ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గణితం. నేను చిన్నప్పట్నించి పెరిగిన వాతావరణం అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం. అంతేగాక నాకు పౌరశాస్త్రంపై ఉన్న ప్రత్యేక అభిమానం నన్ను ఈ సబ్జెక్ట్ ఎంచుకునే విధంగా చేశాయి. నా రెండో ఆప్షనల్ గణితం. సరైన సమాధానం రాస్తే కచ్ఛితంగా పూర్తి మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే దీన్ని ఎంచుకున్నాను. ప్రిపరేషన్ సమయంలో మెటీరియల్ దొరక్క, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు కొంత ఇబ్బందిపడ్డాను. నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య. రామకోటి చలవతో నాకు గణితంలో కష్టమైన అంశాలపై పట్టు కలిగింది. ఇది నా ప్రిపరేషన్‌కు చాలా ఉపయోగపడింది.
కొంతవరకూ వారి అభిప్రాయం సరైనదే. అందుకు కారణం ఆ విభాగంలో కోచింగ్ ఇచ్చే నిపుణులు అందుబాటులో లేకపోవడం, మార్కెట్‌లో మెటీరియల్ లభించకపోవడం. అయితే గణితంలో మంచి అవగాహన ఉండి.. సరైన విధంగా ప్రిపేరైతే విజయం సాధించడం సులభమే. గణితం అనే కాదు ఎంచుకున్న ఆప్షనల్ ఏదైనా దానిపై ఇష్టం ఉండాలి. అటువంటప్పుడు దానిలో మంచి మార్కులు సులభంగా వస్తాయి.
మీ ఇంటర్వ్యూ ఎలా సాగింది? ప్రధానంగా ఏఏ అంశాలపై ప్రశ్నించారు?
నా ఇంటర్వ్యూ స్నేహ పూరిత వాతావరణంలోనే జరిగింది. ముఖ్యంగా సామాజికాంశాలపై ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇబ్బందులు ఏమిటి? తెలంగాణ ఉద్యమం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. నా సొంత జిల్లా కృష్ణా గురించి ప్రశ్నలు అడిగారు. లక్షల్లో వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలి సివిల్స్ రంగం వైపు రావడానికి కారణం ఏమిటి? గణితాన్ని ఆప్షనల్‌గా ఎంచుకోవడానికి కారణం ఏమైనా ఉందా? ఈ విధంగా నా ఇంటర్వ్యూ సాగింది. కమిటీ అడిగిన ప్రశ్నలకు నేను సరైన సమాధానాలు చెప్పినట్టే భావిస్తున్నాను.
మీరు సివిల్స్ ఎన్నో అటెంప్ట్‌లో సాధించారు?
మనస్ఫూర్తి గా చెప్పాలంటే.. నేను కష్టపడింది రెండు పర్యాయాలే. ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రిపరేషన్ లేకుండా రెండుసార్లు రాశాను. మూడోసారి కొంచెం ప్రిపేరై అటెంప్ట్ చేశాను. అప్పుడు మెయిన్స్ వరకూ వెళ్లాను. ఈ సారి కచ్ఛితంగా ఎంపికవ్వాలనే కోరికతో చదివి సాధించాను.
కొంతకాలం కోచింగ్ తీసుకున్నాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రొ.మహంతీ(ఢిల్లీ) దగ్గర, మ్యాథమెటిక్స్‌కు ప్రొ.రామకోటయ్య శిక్షణ ఎంతో ఉపయోగపడింది. ఇంటర్వ్యూలో నెగ్గగలిగానంటే అందుకు కారణం రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గోపాల క్రిష్ణన్. ఆయన నాలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఎంతో సహాయపడ్డారు. సివిల్స్ కోచింగ్ ఓ స్థాయివరకూ అవసరమే. కోచింగ్ తీసుకున్నాం కదా కచ్ఛితంగా వస్తుంది, కోచింగ్ తీసుకోలేదు కదా కచ్ఛితంగా రాదు అనే అభిప్రాయాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడైనా మీకున్న సత్తా, ఆయా అంశాలపై మీకున్న అవగాహనలే మిమ్మల్ని విజేతల్ని చేస్తాయి.
మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు?
మా అమ్మానాన్న. చిన్నప్పట్నించి నన్ను నా కుటుంబ సభ్యుల్ని పోషించేందుకు వారెంతో కష్టపడ్డారు. నేను విజయం సాధించేందుకు అనుక్షణం సహాయపడ్డారు. నేను సాధించిన విజయం వారికి ఆనందాన్ని కల్గించింది.
సివిల్స్ రాయాలనుకునే వారికి మీరిచ్చే సలహా?
మీ పై మీకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి. అనుక్షణం మీ లక్ష్యాన్ని సాధించేందుకు మీవంతు కృషి చేయండి. విజయం కచ్ఛితంగా మీదే.