Skip to main content

Central Cabinet : సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్‌ ఆమోదం

మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు–2021కు కేంద్ర మంత్రివర్గం నవంబర్‌ 24వ తేదీన ఆమోదం తెలిపింది.
Central Cabinet Meeting
Central Cabinet Meeting

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో న‌వంబ‌ర్ 24వ తేదీన‌ కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు మోదీ నవంబర్‌ 19న అకస్మాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చట్టాల ఉపసంహరణకు సంబంధించిన లాంఛనాలను కేబినెట్‌ పూర్తిచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. మంత్రివర్గ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ చట్టాలను ఉపసంహరించడానికి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పంటలకు కనీస మద్దతు(ఎంఎస్పీ)తోపాటు ఇతర కీలకం అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. దీనిపై కేబినెట్‌లో చర్చించారా? అని ప్రశ్నించగా.. అనురాగ్‌ ఠాకూర్‌ సమాధానమివ్వలేదు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 29న ప్రారంభమై, డిసెంబర్‌ 23న ముగుస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు, చేతలకు మధ్య కచ్చితంగా పొంతన ఉంటుందని చెప్పడానికి సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును కేబినెట్‌లో ఆమోదించడమే ఒక చక్కటి నిదర్శనమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. 
80 కోట్ల మందికి లబ్ధి..
పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను(పీఎంజీకేఏవై) మరో నాలుగు నెలలపాటు పొడిగించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి 2022 వరకూ పథకాన్ని కొనసాగిస్తారు. పథకం ఐదో దశను అమలు చేస్తారు. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ), అంత్యోదయ అన్న యోజన ప్రాధాన్యతా కుటుం బాల పథకం పరిధిలోని లబ్ధిదారులందరికీ ఈ పథకం కింద నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొ ప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసా ్తరు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం(డీబీటీ) పరిధి లోకి వచ్చే పేదలకు కూడా ఈ ప్రయోజనం చేకూరుతుంది. 80 కోట్ల మందికిపైగా రేషన్‌ కార్డుదారులు లబ్ధి పొందనున్నారు. పథకం ఐదో దశలో అదనంగా రూ.53,344.52 కోట్లమేర రాయితీ అవసరమని అంచనా. ఈ దశలో లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి మొత్తం 1.63 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) కింద ఇచ్చే రేషన్‌ సరుకులకు ఇవి అదనం. 
‘ఓ–స్మార్ట్‌’కు రూ.2,177 కోట్లు.. 
భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన పలు పథకాల సమాహారమైన సముద్ర సేవలు, మోడలింగ్, అనువర్తన, వనరులు, సాంకేతికత (ఓ–స్మార్ట్‌) కార్యక్రమాన్ని 2021–26లో రూ.2,177 కోట్లతో కొనసాగించడానికి కేంద్ర కేబినెట్‌ అంగీకరించింది. ఈ పథకం కింద ఏడు ఉప పథకాలున్నాయి. సముద్ర సాంకేతికత, సముద్ర మోడలింగ్, అడ్వైజరీ సర్వీసులు (ఓఎంఏఎస్‌), సముద్ర పరిశీలక నెట్‌వర్క్‌ (ఓఓఎస్‌), సముద్ర నిర్జీవ వనరులు, సముద్ర జీవ వనరులు, సముద్ర పర్యావరణం (ఎంఎల్‌ఆర్‌ఈ), కోస్తా పరిశోధన, నిర్వహణ, పరిశోధక నౌకల నిర్వహణ వంటివి ఉన్నాయి. ఈ ఉప పథకాలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఓటీ)–చెన్నై, ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఐఎన్‌సీఓఐఎస్‌)–హైదరాబాద్, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ ఓషియన్‌ రిసెర్చ్‌ (ఎన్‌సీపీవోఆర్‌)–గోవాతోపాటు పలు జాతీయ సంస్థలు అమలు చేస్తాయి.

Published date : 25 Nov 2021 03:43PM

Photo Stories