Skip to main content

కెరీర్ గైడెన్స్ యూపీఎస్సీ- సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) - న్యూఢిల్లీ, వివిధ సెంట్రల్ పోలీస్ విభాగాల్లో 401 అసిస్టెంట్ కమాండెంట్ కేడర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్‌కు ప్రకటన విడుదల చేసింది. ఇవన్నీ గ్రూప్-ఏ కేటగిరీ పోస్టులే. పోలీస్ వ్యవస్థలో ఐపీఎస్ తర్వాత స్థానం అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులదే. హోదా, ఆకర్షణీయ వేతనం, ఉన్నత వసతులు ఇవన్నీ ఈ పోస్టుతో లభిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాలకోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ పరీక్షను సులువుగానే ఎదుర్కోవచ్చు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్‌కు కావల్సిన అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్... వివరాలు..ఈ వారం కెరీర్ గైడెన్స్..

ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్-2012 సమాచారం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) - న్యూఢిల్లీ, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌ల్లో అసిస్టెంట్ కమాండెంట్ కేడర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఎగ్జామ్ ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్య: 401
భర్తీ చేసే విభాగాల వారీగా ఖాళీలు:
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) : 94
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) : 233
సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్): 44
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) : 26
సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) : 14

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 20-25 ఏళ్లు. నిర్దేశిత అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపు ఉంటుంది.
రాత పరీక్ష తేదీ: నవంబర్ 11, 2012.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఆగస్ట్ 27, 2012.
వివరాలకు: https://www.upsc.gov.in/


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ పరీక్షలు, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
గమనిక: బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ పోస్టులకు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

రాత పరీక్ష :
ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1, పేపర్-2. రెండు పేపర్లకూ ఒకే రోజు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-1 ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్-2 డిస్క్రిప్టివ్‌లో ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో అడుగుతారు. పేపర్-1లో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ అంశాల్లో ప్రశ్నలు 250 మార్కులకు ఉంటాయి. పేపర్-2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ అంశాల్లో 200 మార్కులకు ప్రశ్నలడుగుతారు.

ప్రతీ పేపర్‌లో నిర్దేశిత అర్హతా మార్కులు సాధించాలి. పేపర్-1లో అర్హత మార్కులు సాధిస్తేనే పేపర్-2 మూల్యాంకనం చేస్తారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు మార్కుల్లో కోత తప్పదు.

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్స్:
రాత పరీక్షలో ఉత్తీర్ణులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్స్ నిర్వహిస్తారు.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్:
ఈవెంట్ పురుషులు మహిళలు
100 మీ పరుగు 16 సెకన్లు 18 సెకన్లు
800 మీ పరుగు 3 ని 45 సె 4 ని 45 సె
లాంగ్ జంప్ 3.5 మీ 3 మీ
(మూడు ప్రయత్నాలు)
షార్ట్ పుట్ (7.26కేజీలు) 4.5 మీ -

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌ల్లో ఉత్తీర్ణులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. మెడికల్‌లోనూ ఉత్తీర్ణత సాధించిన వాళ్లకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 150 మార్కులు కేటాయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ మార్కులు కలిపి మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిపరేషన్:
పేపర్-1:
ఇందులో అభ్యర్థి మ్యాథ్స్ పరిజ్ఞానంతోపాటు వివిధ సాంఘికాంశాల్లో అవగాహనను పరిశీలించేలా ప్రశ్నలడుగుతారు. వీటికోసం ఎన్‌సీఈఆర్‌టీ 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్ పుస్తకాలు బాగా చదువుకోవాలి.

పేపర్-1లోనే కరెంట్ అఫైర్స్‌పై ప్రశ్నలొస్తాయి. ఈ ప్రశ్నలను ఎదుర్కోవడానికి గతేడాది జూన్ నుంచి కళలు, మ్యూజిక్, సాహిత్యం, క్రీడల్లో అవార్డుల పొందిన వారి గురించి చదువుకోవాలి. వివిధ దేశాల మధ్య జరిగిన ముఖ్య ఒప్పందాలు నెమరు వేసుకోవాలి. ముఖ్యంగా భారత్ ఈ మధ్య కాలంలో విదేశాలతో ఏర్పరచుకున్న వ్యాపార, సాంఘిక ఒప్పందాల గురించి అప్‌డేట్ కావాలి. దేశంలో, ప్రపంచంలో ఈ మధ్య కాలంలో ఏర్పడిన ప్రధాన సంఘటనలు గుర్తుంచుకోవాలి.

పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీలకు సంబంధిన ప్రశ్నలకు ఎన్‌సీఈఆర్‌టీ హైస్కూల్ సోషల్ పుస్తకాలతో పాటు ఆయా సబ్జెక్టుల్లో ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పుస్తకాలు చదివితే సరైన సమాధానాలు గుర్తించొచ్చు.

మెంటల్ ఎబిలిటీలో అడిగే రీజనింగ్, ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి మార్కెట్‌లో దొరికే ప్రామాణిక పుస్తకాలు చదువుకోవాలి.

జనరల్ సైన్స్ ప్రశ్నలకు సైన్స్‌లో ఈ మధ్య జరుగుతున్న తాజా పరిణామాలు ముఖ్యంగా ఐటీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్‌కు సంబంధించిన అంశాలు చదువుకుంటే వీలైనన్నిఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు.

పేపర్-2:
ఈ పేపర్‌లో పార్ట్-ఎలో వ్యాసరూప ప్రశ్నలు రాయాలి. ఈ ప్రశ్నలు రాయడానికి కూడా ఎన్‌సీఈఆర్‌టీ 8,9,10 తరగతుల సాంఘిక శాస్త్రం పుస్తకాలతోపాటు 11, 12 తరగతుల హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ పుస్తకాలు చదువుకోవాలి. రోజుకో అంశాన్ని ఎంచుకొని వ్యాసం రాయడాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రశ్నలో ఏ అంశం గురించి అడిగారో గమనించి ఆ అంశంలో మీకు తెలిసినదంతా రాసేయకుండా అడిగిన మేరకే రాయాలి. వాటికి సంబంధించి నిపుణుల కొటేషన్స్, గణాంకాలు ఉంటే చేర్చాలి. ఆ అంశంలో తాజా పరిణామాలు ఏమైనా ఉంటే వాటి గురించి ప్రస్తావిస్తే ఎస్సే సంపూర్ణమవుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు ఎస్సే కోసం ప్రిపరేషన్‌లో అదనపు సమయం వెచ్చించాలి. ఇంగ్లిష్ పదజాలంపైన, వాక్య నిర్మాణ శైలులపైనా పట్టు సాధించాలి.

పార్ట్-బిలో కాంప్రహెన్షన్, ప్రెసీ రైటింగ్, గ్రామర్.. ఇలా ఇంగ్లిష్ ప్రావీణ్యానికి సంబంధించి ప్రశ్నలు వస్తాయి. ప్రామాణిక ఆంగ్ల వ్యాకరణ పుస్తకం చదువుకుంటే సరిపోతుంది. రోజుకొక ప్రెసీ, కాంప్రహెన్షన్ సాధన చేస్తూ గ్రామర్ (సినానిమ్స్, యాంటోనిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వెర్బ్స్, టెన్సెస్...) గురించి చదువుకోవాలి.

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్స్:
రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సబ్ ఇన్‌స్పెక్టర్ పరీక్షతో పోల్చితే అసిస్టెంట్ కమాండెంట్ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్ష సులువే. అయితే పరీక్ష తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చనే ధోరణిలో ఎక్కువ మంది ఉంటారు. కానీ పరీక్షతోపాటు ఫిజికల్ టెస్ట్‌కు ఇప్పటి నుంచే సాధన చేయాలి. రోజూ వంద మీటర్ల దూరాన్ని మూడుసార్లు, 800 మీ దూరాన్ని మూడుసార్లు పరుగెత్తాలి. నెల రోజుల తర్వాత ఎంత సమయంలో పరుగెత్తుతున్నారో చూసుకోవాలి. కొత్తగా సాధన చేస్తున్న వాళ్లు మొదటి రోజు నుంచే నిర్దేశిత సమయంలో పరుగెత్తాలనుకోవడం పొరపాటు. దీనివల్ల అలసటకు గురవుతారు. శారీరక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

లాంగ్ జంప్, షార్ట్ పుట్ కూడా ఇప్పటి నుంచే సాధన చేయాలి. ఇవి కూడా సులువైన లక్ష్యాలే. స్వల్ప లక్ష్యాలు నిర్దేశించుకొని సాధన చేస్తే నెల రోజుల్లో పరీక్షలో ఎంపిక కావడానికి అవసరమైన లక్ష్యాన్ని చేరుకోవడం అంత కష్టమేమీ కాదు. లాంగ్‌జంప్ చదునైన ఇసుక నేలపై సాధన చేయాలి.

ఇంటర్వ్యూ:
ఇంటర్వ్యూలో అభ్యర్థి మానసిక పరిణతి తెలుసుకుంటారు. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీలకు సంబంధించి ప్రాథమికాంశాలు తెలుసుకోవాలి. వీటిలో మీరు ఎంపిక చేసుకున్న సర్వీస్ గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. పోలీస్ వ్యవస్థ, రక్షణ రంగం గురించి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది వీటిపై పరిజ్ఞానం ఏర్పరచుకోవాలి. నిజాయితీ, స్పష్టతతోపాటు తడబాటు లేకుండా సమాధానం చెప్తే ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు పొందడం సులువే.

సిలబస్ స్వరూపం
పేపర్-1: జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్
జనరల్ మెంటల్ ఎబిలిటీ: లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంశాల్లో ప్రశ్నలొస్తాయి.

జనరల్ సైన్స్: దైనందిన జీవితంలో ఎదురవుతున్న వివిధ సైన్స్ అంశాల్లో అభ్యర్థి పరిశీలనను తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. సైన్స్ అనువర్తనాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్... అంశాల నుంచి ప్రాథమిక స్థాయి ప్రశ్నలే అడుగుతారు.
కరెంట్ ఈవెంట్స్: జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరిశీలించే విధంగా ప్రశ్నలుంటాయి. సంస్కృతి, నాగరికత, కళలు, సాహిత్యం, మ్యూజిక్, క్రీడలు, పరిశ్రమలు, వర్తకం, గవర్నెన్స్, గ్లోబలైజేషన్, డెవలప్‌మెంటల్ ఇష్యూస్, వివిధ దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు, అవగాహనలు..తదితర అంశాల్లో అభ్యర్థి పరిశీలనను తెలుసుకునేలా ప్రశ్నలు ఉంటాయి.

ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ: దేశ రాజకీయ విధానంపై అభ్యర్థికున్న పరిజ్ఞానం పరిశీలించేలా ప్రశ్నలు అడుగుతారు. భారత రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, సోషల్ సిస్టమ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతాంశాలు, మానవ హక్కులు.. తదితర అంశాల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
ఇండియా, వరల్డ్ జాగ్రఫీ: జాగ్రఫీకి సంబంధించిన ఫిజికల్, సోషల్, ఎక నామికల్ అంశాల్లో ప్రశ్నలొస్తాయి.

పేపర్-2 జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్:
ఇందులో రెండు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్-ఏలో భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, హ్యూమన్ రైట్స్, సెక్యూరిటీ, ఎనలిటికల్ ఎబిలిటీ... అంశాల్లో వ్యాసరూప ప్రశ్నలుంటాయి. ఈ సెక్షన్‌కు 80 మార్కులు కేటాయించారు. పార్ట్-బీలో కాంప్రహెన్షన్, ప్రెసిస్ రైటింగ్, లాంగ్వేజ్ స్కిల్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, ఇంగ్లిష్ గ్రామర్.. అంశాల్లో ప్రశ్నలడుగుతారు. పార్ట్-బీ 120 మార్కులు.

రిఫరెన్స్ బుక్స్
ఎన్‌సీఈఆర్‌టీ 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్ పుస్తకాలు
ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ పుస్తకాలు
ఆర్‌ఎస్ అగర్వాల్ అర్థమెటిక్, రీజనింగ్ బుక్స్ (చాంద్ పబ్లికేషన్స్)
మనోరమ ఇయర్ బుక్ (కరెంట్ అఫైర్స్, సైన్స్ సెక్షన్స్)
రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్
వర్డ్ పవర్ మేడ్ ఈజీ (నార్మన్ లూయీస్)

Published date : 06 Aug 2012 06:47PM

Photo Stories