Skip to main content

ఐఏఎస్ విధులు ఎలా ఉంటాయంటే..?

ఎర్ర బుగ్గ కారు.. వ్యక్తిగత సిబ్బంది.. పోలీసు భద్రత.. విస్తృత అధికారాలు..ప్రజలకు సేవ చేసే అవకాశాలు.. సమాజంలో గౌరవ మర్యాదలు.. అత్యాధునిక సదుపాయాలతో కూడిన కార్యాలయం.. సకల సౌకర్యాలున్న విశాలమైన బంగ్లాలో వసతి.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అనగానే గుర్తుకొచ్చే కొన్నిప్రత్యేకతలు. సమాజంలో గౌరవం, ఉన్నత హోదాతోపాటు ఎంతో సంతృప్తినిచ్చే ఐఏఎస్ కొలువు కోరుకోని వారుండరు. సివిల్స్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఐఏఎస్ అధికారి ఎంపిక విధానం, రోజువారీ కార్యకలాపాలు క్లుప్తంగా..
ఎంపిక విధానం:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఏటా ఒకసారి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో 3 దశలు ఉంటాయి. ఒకటి.. ప్రిలిమ్స్. రెండు.. మెయిన్స్. మూడు.. ఇంటర్వ్యూ. వీటిలో వర్తమాన అంశాలు మొదలుకొని తార్కిక పరిజ్ఞానం వరకు దాదాపు అన్ని విషయాలపైన అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్‌‌స, ఇంటర్వ్యూల మార్కులతో రిజర్వేషన్లు, ఇతర నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్‌కు ఎంపిక చేస్తారు. కనీసం బ్యాచిలర్‌‌స డిగ్రీ ఉత్తీర్ణులైనవారు పరీక్ష రాయొచ్చు.

విధులు ఎలా ఉంటాయంటే..?
ఐఏఎస్ శిక్షణ పూర్తయినవారు జాతీయ స్థాయిలో అండర్ సెక్రెటరీగా, రాష్ట్ర స్థాయిలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్/సబ్ కలెక్టర్/జాయింట్ కలెక్టర్/డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తారు. తన పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, సాధారణ పరిపాలనకు బాధ్యత వహించాలి. రోజువారీ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలి. సంబంధిత శాఖ మంత్రిని సంప్రదిస్తూ సర్కారు విధానాలను రూపొందించాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడంతోపాటు నిరంతరం నిఘా పెట్టాలి. ప్రభుత్వ పథకాలను ఏవిధంగా అమలుచేయాలో తన కింది స్థాయి అధికారులకు వివరించాలి. ఉన్నత స్థాయిలో పనిచేసే ఐఏఎస్‌లు ప్రభుత్వ విధానాల ఖరారులో, తుది నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తారు.

ఐఏఎస్‌లు విధి నిర్వహణలో వివిధ స్థాయి వ్యక్తులను కలుస్తారు. సాధారణ ప్రజల నుంచి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులతో సైతం భేటీ అవుతారు. అంతర్జాతీయ సదస్సులకు హాజరవుతారు. నిరుపేదలు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, కర్షకులు, కార్మికులు తదితర అన్ని వర్గాల వారు ఐఏఎస్ అధికారిని కలిసి తమ సమస్యలను వారి దృష్టికి తెస్తారు. వీటి తీవ్రతను బట్టి ఐఏఎస్‌లు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తారు. క్రమశిక్షణ తప్పిన ఉద్యోగులను హెచ్చరిస్తారు. ఒక్కోసారి సస్పెండ్ చేసేందుకూ వెనుకాడరు. మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులను ‘ఉత్తమ’ పురస్కారంతో సత్కరిస్తారు.

కావాల్సిన నైపుణ్యాలు..
ఉన్నతంగా ఆలోచించాలి. సమస్యలను సానుకూలంగా విశ్లేషించాలి. అభివృద్ధి విషయంలో గణాంకాలకే పరిమితం కాకుండా గుణాత్మకంగా వ్యవహరించాలి. ప్రస్తుత అవసరాలతోపాటు భవిష్యత్ ప్రయోజనాలనూ బేరీజు వేసుకోవాలి. పక్కా ప్రణాళికతో పథకాల అమలును చక్కబెట్టాలి. కష్టపడి పని చేయాలి. ప్రజల మనిషిగా వ్యవహరించగలగాలి.

పనివేళలు :
రోజువారీ కార్యక్రమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతారు. ఉదయం 9, 10 గంటలకు దినచర్య ప్రారంభమవుతుంది. వివిధ విభాగాల నుంచి వచ్చే ఫైల్స్‌ను పరిశీలించి సంతకాలు చేస్తారు. ప్రజల నుంచి అందే విజ్ఞప్తులను పరిశీలిస్తారు. రోజుకు రెండు, మూడు శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఇ-మెయిల్స్/లెటర్స్/ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకొని సమాధానమిస్తారు అత్యవసర కార్యక్రమాలు లేకపోతే రాత్రి ఏడెనిమిది గంటలకే విధులు ముగించుకొని అధికారిక నివాసానికి చేరుకుంటారు.

సానుకూలతలు..
☛ జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిల్లో ఎక్కడైనా పనిచేసే వెసులుబాటు ఉంటుంది.
☛ విస్తృత స్థాయిలో అధికారాలు ఉంటాయి.
☛ పరిపాలనలో తనదైన ముద్ర వేసేందుకు అవకాశం ఉంటుంది.
☛ ఒక్క సంతకంతో వందల మందికి ప్రయోజనం చేకూర్చవచ్చు.
☛ ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పాలుపంచుకోవచ్చు
☛ ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషించే వీలు కలుగుతుంది.

ప్రతికూలతలు..
☛ నాణేనికి మరోవైపు అన్నట్లు.. ఎంత బాధ్యతాయుతమైన ఉద్యోగమో అంతే బాధాకరమైన ఉద్వేగాలకూ అలవాటుపడాల్సి వస్తుంది.
☛ తరచుగా ఇతర ప్రాంతాలకు బదిలీ అవుతుంటారు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల రాజీపడుతూ అసంతృప్తికి గురౌతారు.
☛ విధి నిర్వహణలో ఒక్కోసారి విభిన్న అనుభవాలు ఎదురవుతుంటాయి.
☛ ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలుచేయలేకపోతే పాలకులకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
☛ సేవ చేయాలని మనసులో ఎంత తపన ఉన్నా కొన్ని పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. సెలవులు చాలా తక్కువ ఉంటాయి.
Published date : 20 Apr 2021 02:43PM

Photo Stories