Skip to main content

వినూత్న కోర్సులకు కేరాఫ్.. ఐఐటీ-హెచ్

ఐఐటీ - హైదరాబాద్.. 2008లో ప్రారంభమైంది. ప్లేస్‌మెంట్స్, పరిశోధనల ద్వారా ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. తాజాగా బీటెక్ విద్యార్థులకు బహుళ నైపుణ్యాలు అందించే క్రమంలో డిజైన్, మ్యాథమెటిక్స్‌లను మైనర్ కోర్సులుగా ప్రారంభించింది.
డేటా అనలిటిక్స్, బిగ్‌డేటా తదితర వినూత్న కోర్సులను సైతం అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ-హైదరాబాద్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన మైనర్ కోర్సులు, ప్లేస్‌మెంట్స్ ట్రెండ్స్ తదితరాలపై ప్రత్యేక కథనం..

‘ఇంజనీరింగ్ విద్యార్థులకు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ చాలా అవసరం. విద్యార్థులు కోర్ బ్రాంచ్‌తోపాటు కనీసం ఒకట్రెండు ఇతర కోర్సులను మైనర్‌గా ఎంపిక చేసుకుని వాటిలో నైపుణ్యం సొంతం చేసుకోవాలి. అప్పుడే అన్ని విధాలా అభివృద్ధి సాధ్యపడుతుంది.’
  • మన దేశంలో బీటెక్ విద్యార్థుల నైపుణ్యాల పరంగా విద్యావేత్తలు, ఇండస్ట్రీ వర్గాలు తరచుగా వ్యక్తం చేసే అభిప్రాయమిది.
ఇదే అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఐఐటీ-హైదరాబాద్.. బీటెక్ ప్రోగ్రామ్‌లో రెండు కొత్త మైనర్ కోర్సుల (డిజైన్, మ్యాథమెటిక్స్)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సులను మైనర్‌గా బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు ఉన్నతవిద్య అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగాలకు సంబంధించి ఎంటెక్, పీహెచ్‌డీ, ఎంఎస్సీ వంటి ఉన్నత విద్య ప్రోగ్రామ్‌లకు వీరికి అర్హత లభిస్తుంది.

మ్యాథమెటిక్స్ :
నాలుగేళ్ల బీటెక్ కోర్సులో అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులు మ్యాథమెటిక్స్‌ను ఒక సబ్జెక్టుగా మొదటి సంవత్సరంలో చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మ్యాథ్స్‌పై కన్నెత్తి చూసే విద్యార్థులు చాలా తక్కువ. కానీ, ఇంజనీరింగ్ విభాగంలో ఏ బ్రాంచ్‌లోనైనా.. భవిష్యత్తులో రాణించాలంటే.. మ్యాథమెటిక్స్ వెన్నెముక. అల్గారిథమ్స్ రూపొందించాలన్నా.. డేటా అనలైజ్ చేయాలన్నా.. మ్యాథమెటిక్స్‌పై పట్టు అవసరం. అందుకే ఐఐటీ-హైదరాబాద్.. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పేరుతో బీటెక్‌లో మైనర్ కోర్సును ప్రారంభించింది. ప్రత్యేక పరీక్ష ద్వారా దీనికి అర్హత సాధించిన వారు నాలుగు సెమిస్టర్లలోనూ మ్యాథమెటిక్స్‌ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

డిజైన్ :
ఇంజనీరింగ్ విద్యార్థులకు సృజనాత్మక ఆలోచనా విధానం ఎంతో అవసరమని తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని, బీటెక్ ప్రోగ్రామ్‌లో మరో మైనర్‌గా డిజైన్ కోర్సును ఐఐటీ-హెచ్ ప్రారంభించింది. ముఖ్యంగా 3డీ డిజైన్ టెక్నాలజీకి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సు బీటెక్ విద్యార్థులకు ఎంతో కలిసొస్తుందని చెప్పొచ్చు. ఈ కోర్సుకు ఆయా బ్రాంచ్‌ల నుంచి గరిష్టంగా 20 మందిని ఎంపిక చేస్తారు. డిజైన్ టెక్నాలజీస్‌కు సంబంధించి పూర్తిస్థాయి నైపుణ్యం లభించేలా కోర్సు ఉంటుంది. క్రియేటివ్ ప్రొడక్ట్ డిజైన్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ యానిమేషన్, మూవింగ్ ఇమేజెస్, డిజిటల్ హెరిటేజ్, విజువల్ కమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ ఇమేజింగ్, బిల్ట్ ఎన్విరాన్‌మెంట్, అర్బన్ స్పేస్ డిజైన్ తదితర అంశాలు సిలబస్‌లో ఉంటాయి.

షార్ట్ టర్మ్ కోర్సులు :
ఐఐటీ-హైదరాబాద్ మరెన్నో వినూత్న నైపుణ్యాలు అందించేందుకు చిరునామాగా మారుతోంది. ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న బిగ్‌డేటా, డేటా అనలిటిక్స్ వంటి విభాగాలలో షార్ట్ టర్మ్ కోర్సులను సైతం అందిస్తోంది.

ఎంటెక్, పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ :
ఐఐటీ-హైదరాబాద్‌లోని ప్రోగ్రామ్‌ల పరంగా మరో ప్రత్యేకత ఎంటెక్, పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ అవకాశాలను అందుబాటులోకి తేవడం. గేట్ స్కోర్ ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు కాల వ్యవధి అయిదేళ్లు. తొలి రెండేళ్లు ఎంటెక్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన అంశాలుంటాయి. పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ విషయంలోనూ ఐఐటీ-హైదరాబాద్ వినూత్నంగా అడుగులు వేస్తోంది. కొలాబరేటెడ్ రీసెర్చ్ పేరుతో విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుని.. పీహెచ్‌డీ వ్యవధిలో కొంతకాలం విద్యార్థులు విదేశీ వర్సిటీల్లో పరిశోధనలు సాగించే విధంగా నిబంధనలు అమలుచేస్తోంది.

జైకా ఫ్రెండ్‌షిప్ ప్రోగ్రామ్ :
జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా)-ఇండియా ఫ్రెండ్‌షిప్ పేరుతో ఐఐటీ-హెచ్‌లో ప్రత్యేక పథకం అమలవుతోంది. 2012లో అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందంలో భాగంగా.. ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులు జపాన్ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆ దేశ యూనివర్సిటీల్లో స్కాలర్‌షిప్ సదుపాయంతో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందొచ్చు. దీనికింద ఇప్పటివరకు 54 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, టొహొకు యూనివర్సిటీ, కియో యూనివర్సిటీ, క్యోటో యూనివర్సిటీ, ఒసాకా యూనివర్సిటీ, క్యుషు యూనివర్సిటీ తదితర ప్రముఖ యూనివర్సిటీల్లో ఐఐటీ-హెచ్ విద్యార్థులు ఉన్నారు.

యూఎస్ వర్సిటీలతో ఒప్పందం :
కొలాబరేటెడ్ ఎడ్యుకేషన్‌లో భాగంగా అమెరికా యూనివర్సిటీలతో ఐఐటీ-హెచ్ ఒప్పందం చేసుకుంది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా తదితర ప్రముఖ వర్సిటీలతో అకడమిక్ ఎక్స్ఛేంజ్ ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో ఆయా యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు ఎంటెక్, పీహెచ్‌డీ స్థాయిలో రెండు నెలల వ్యవధిలో ఐఐటీ-హెచ్‌లో బోధిస్తారు. అదేవిధంగా ఆస్ట్రేలియా, స్వీడన్ దేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలతోనూ ఇంటర్న్‌షిప్, అకడమిక్ ఎక్స్ఛేంజ్ ఒప్పందాలు చేసుకుంది. మొత్తంమీద ఐఐటీ-హెచ్.. 52 విదేశీ యూనివర్సిటీలతో కలిసి ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ అందిస్తోంది.

ప్లేస్‌మెంట్స్‌లోనూ ముందంజ..
ఏటా దాదాపు రెండు వందల కంపెనీలు ఐఐటీ-హెచ్‌ను సందర్శిస్తున్నాయి. ఆఫర్ల పరంగానూ ఐఐటీ-ముంబై, ఢిల్లీ, చెన్నై, కాన్పూర్ తదితర ్రపముఖ ఐఐటీలకు దీటుగా నిలుస్తోంది.
  • 2017-18 బ్యాచ్‌లో ఇప్పటికే 80 శాతం మందికి ఆఫర్లు లభించాయి. ఈ ప్రక్రియ ఫిబ్రవరి వరకు సాగనుంది. దాదాపు ప్రతి ఒక్క విద్యార్థికి కొలువు ఖాయంగా కనిపిస్తోంది.
  • 2016-17లో 264 మందికి ఆఫర్లు ఖరారయ్యాయి. 17 మంది విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఆఫర్స్ లభించాయి. రూ.38 లక్షలు అత్యధిక వార్షిక వేతనంగా నమోదైంది.
  • 2015-16 విద్యా సంవత్సరంలోనూ 268 మంది విద్యార్థులకు ఆఫర్లు లభించాయి. అత్యధిక వార్షిక వేతనం రూ.35 లక్షలుగా నమోదైంది.
ఉన్నతవిద్యలో రాణించేందుకు మైనర్ కోర్సులు..
మైనర్ కోర్సులు ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం.. కోర్ బ్రాంచ్ అంశాలతో పాటు ఇతర ఉన్నతవిద్య ప్రోగ్రామ్‌లకు అర్హులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే. ప్రధానంగా కోడింగ్, అల్గారిథమ్స్ రూపకల్పనలో కీలకమైన మ్యాథమెటిక్స్‌లో పట్టు సాధించేందుకు ఆ సబ్జెక్టును మైనర్ కోర్సుగా బీటెక్‌లో ప్రవేశ పెట్టాం. బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి ఇన్‌స్టిట్యూట్ పరిధిలో మరో పరీక్ష నిర్వహించి పది మందిని ఎంపిక చేస్తాం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త కోర్సులు అందించడంలో ఐఐటీ-హెచ్ ముందుంటోంది.
- ప్రొఫెసర్ సి.హెచ్. సుబ్రహ్మణ్యం, డీన్, అకడమిక్స్, ఐఐటీ-హెచ్.
Published date : 02 Feb 2018 05:40PM

Photo Stories