Skip to main content

వైవిధ్య కెరీర్‌కు..చక్కని వేదిక సోషల్ వర్క్ కోర్సులు

టెన్త్, ఇంటర్, డిగ్రీ.. ఇలా వివిధ కోర్సులు పూర్తిచేసుకుంటున్న విద్యార్థులకు ఏ కెరీర్ ఎంచుకోవాలి అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
అనేక రకాల కోర్సులు, కెరీర్ అవకాశాలు అందుబాటులో ఉన్నా... కాస్త భిన్నమైన మార్గంలో వెళదామని అనుకునే వారికి చక్కని వేదిక.. సోషల్‌వర్క్.

సమాజంలోని అసమానతలు తొలగించడం, సమస్యలపై స్పందించడం, సమస్య మూలాలను అధ్యయనం చేయడానికి సోషల్ వర్క్ కోర్సులు బాగా ఉపయోగపడతాయి. స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తుండటంతో ప్రస్తుతం సోషల్ వర్క్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఇతర కోర్సులతో పోల్చితే ఇవి పూర్తిగా భిన్నమైనవి. సామాజిక బాధ్యత, ప్రజలను చైతన్య పరచడం, అవసరమైనప్పుడు వారికి అండగా నిలబడటం, ప్రతి ఒక్కరినీ మార్పు దిశగా నడిపించడం తదితర అంశాలకు సోషల్ వర్క్ కోర్సులు ప్రాధాన్యమిస్తాయి.

కోర్సులు..
  • బ్యాచిలర్ డిగ్రీస్థాయి కోర్సును బీఎస్‌డబ్ల్యూ (బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్) అని, మాస్టర్ డిగ్రీ కోర్సును ఎంఎస్‌డబ్ల్యూ (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) అని అంటారు. ఈ కోర్సుల్లో క్రిమినాలజీ అండ్ జస్టిస్, కమ్యూనిటీ హెల్త్, మెంటల్ హెల్త్, అర్బన్ డెవలప్‌మెంట్, సైక్రియాట్రిక్ సోషల్ వర్క్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. అలాగే ఎంఫిల్ (సోషల్ వర్క్), ఎంఫిల్ (ట్రైబల్ స్టడీస్), పీహెచ్‌డీ, పోస్ట్ పీహెచ్‌డీ ఉన్నత విద్యావకాశాలు కూడా ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
  • సర్టిఫికెట్ ఇన్ సోషల్ వర్క్, సర్టిఫికెట్ ఇన్ రిహాబిలిటేషన్ కౌన్సిలింగ్, అడ్వాన్డ్స్ సర్టిఫికెట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్, పీజీ సర్టిఫికెట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్, డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితర కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఉపాధి విభాగాలు :
సోషల్ వర్క్ కోర్సులు పూర్తిచేసిన వారికి శిశు సంక్షేమం, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్‌జీవో, కన్సల్టెన్సీ, సాంఘిక సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి, పేదరిక నిర్మూలన; గ్రామీణ, పట్టణ అభివృద్ధి తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

నైపుణ్యాలు..
సేవా దృక్పథం, ప్రజల సమస్యలు విని అర్థం చేసుకుని పరిష్కారం చూపడం; సమష్టిగా, జట్టుగా పనిచేయడం; క్షేత్రస్థాయి అధ్యయనం, మార్పుకోసం పనిచేసే తత్వం, కొత్త వ్యక్తులతో మాట్లాడే నేర్పు, నిర్ణయాత్మక సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, పరిసరాలకు అనుగుణంగా ఒదిగిపోవడం, కొద్దిపాటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం.

ఉద్యోగావకాశాలు..
  • ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. ఎన్‌జీవో ప్రాజెక్టుల్లో మంచి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీ కౌన్సిలర్, స్కూల్ కౌన్సిలర్, గ్రామీణాభివృద్ధి పథకాల్లో ప్రోగ్రామ్ ఆఫీసర్ తదితర అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. జైళ్ల సంక్షేమ అధికారులుగా, పట్టణ ప్రణాళిక అధికారులుగా, బాలల, యువజన, మహిళా కార్మిక సంక్షేమ అధికారులుగా కూడా పనిచేయొచ్చు.
  • ఆర్థిక సంస్కరణల తర్వాత దేశాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థల పాత్ర పెరగడం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) చట్టం అమల్లోకి రావడంతో సోషల్ వర్క్ కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలు రెట్టింపయ్యాయి. సంస్థ, పనితీరు, నైపుణ్యాలను బట్టి ప్రారంభంలో రూ.15-20 వేలు; హోదా, అనుభవం పెరిగేకొద్దీ రూ.30-50 వేలకు పైగా వేతనం ఉంటుంది.
కోర్సులు అందిస్తున్న సంస్థలు..
  • ఉస్మానియా యూనివర్సిటీ
    వెబ్‌సైట్: www.osmania.ac.in
  • టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్
    వెబ్‌సైట్: www.tiss.edu
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్
    వెబ్‌సైట్: www.nird.org.in
  • సెంటర్ ఫర్ సోషల్ ఇనిషియేటివ్ అండ్ మేనేజ్‌మెంట్
    వెబ్‌సైట్: www.csim.in
  • ఇగ్నో (దూరవిద్య)
    వెబ్‌సైట్: www.ignou.ac.in
  • ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్
    వెబ్‌సైట్: www.dssw.du.ac.in
  • మద్రాస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్
    వెబ్‌సైట్: www.mssw.in
  • లయోలా కాలేజ్ ఆఫ్ సోషల్ సెన్సైస్
    వెబ్‌సైట్: https://loyolacollegekerala.edu.in
Published date : 07 Apr 2018 02:00PM

Photo Stories