Skip to main content

‘సాఫ్ట్‌వేర్’ కొలువులకే అగ్రస్థానం!

ఈ ఏడాది జాబ్ మార్కెట్‌లో సాఫ్ట్‌వేర్, సేల్స్ ఉద్యోగాలు టాప్‌లో నిలిచినట్లు తాజాగా ఓసర్వే పేర్కొంది. ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, రీజనింగ్ నైపుణ్యాలున్న వారికే రిక్రూటర్స్ ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా పది లక్షల ఉద్యోగాల భర్తీ శైలిని విశ్లేషించగా నియామక సంస్థల కోణంలో ఎనిమిది జాబ్ ప్రొఫైల్స్‌కు అగ్ర స్థానం దక్కింది. ఆ వివరాలు...
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ :
ఈ విభాగంలో మానవ వనరులను ఎంపిక చేసే క్రమంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్‌ల్లో బీటెక్ ఉత్తీర్ణతతో పాటు కోడింగ్, ప్రోగ్రామింగ్, జావా స్క్రిప్ట్ స్కిల్స్‌ను పరిశీలిస్తున్నారు. సంబంధిత టాస్క్‌లను అప్పగించి వాటిని సమర్థంగా, సరైన విధానంలో పూర్తి చేస్తున్నవారికే ఆఫర్ లెటర్స్ ఇస్తున్నారు.

సేల్స్ ప్రొఫెషనల్స్ :
పోటీ ప్రపంచం అటు ఉద్యోగార్థులకు, ఇటు సంస్థలకు సవాల్ విసురుతోంది. సరైన అవకాశాల కోసం ఒక వైపు యువత కుస్తీ పడుతుంటే; తమ ఉత్పత్తులకు మార్కెట్‌లో ఆదరణ కోసం మరో వైపు సంస్థలు ఆరాటపడుతున్నాయి. ఔత్సాహికులకు వినియోగదారులను మెప్పించే నైపుణ్యాలుండాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇ-కామర్స్, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, బీపీఓ సంస్థల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. దీంతో సేల్స్ ప్రొఫెషనల్స్‌కు ఈ ఏడాది జాబ్ మార్కెట్‌లో డిమాండింగ్ జాబ్ ప్రొఫైల్స్‌లో రెండో స్థానం దక్కింది.

బిజినెస్ మేనేజ్‌మెంట్ :
సంస్థల వ్యాపార కార్యకలాపాల రీత్యా మార్కెట్ పరిస్థితి, భవిష్యత్ ప్రణాళికలు, పోటీదారుల కంటే ముందుండేందుకు అనుసరించాల్సిన విధానాలు వంటి వ్యూహాలు రచించే నిపుణులకు డిమాండ్ నెలకొంది. ఆ తర్వాతి స్థానంలో అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, టాలెంట్ అక్విజిషన్ ప్రొఫైల్స్ నిలుస్తాయి. సమర్థులైన ఉద్యోగులను ఎంపిక చేసే ప్రక్రియలో స్టాఫింగ్, రిక్రూటింగ్ నైపుణ్యాల్లో ఆరితేరినవారికి కంపెనీలు ఆహ్వానం పలుకుతున్నాయి.

మార్కెటింగ్ :
విభిన్న నైపుణ్యాలు, వినూత్న లక్షణాలు ఉన్నవారి వైపు సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో వినియోగదారుల అభిరుచిని తెలుసుకోవడం ద్వారా తాము ఎలాంటి ఉత్పత్తులను రూపొందిస్తే పోటీలో ముందంజలో నిలుస్తామో మార్కెటింగ్ నిపుణులు చెప్పగలగాలని కంపెనీలు భావిస్తున్నాయి. అలాంటివారికే పట్టం కడుతున్నాయి.

కస్టమర్ సర్వీస్ :
కస్టమర్ ఈజ్ కింగ్ అనేది బహుళ జాతి సంస్థల నుంచి చిన్న తరహా పరిశ్రమల వరకు ప్రతి ఒక్కటి అనుసరించే విధానం. వినియోగదారులకు తమ ప్రొడక్టుల ప్రత్యేకతల గురించి వివరించే నైపుణ్యాలున్నవారి వైపు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. అందువల్ల అభ్యర్థులు సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

కంప్యూటర్ టెక్నీషియన్స్ :
డెస్క్‌టాప్ కంప్యూటర్, ల్యాప్‌టాప్, నోట్‌ప్యాడ్‌ల వినియోగం భారీగా పెరగడంతో వీటి వాడకంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే టెక్నీషియన్స్ అవసరం నెలకొంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, నెట్‌వర్కింగ్‌లో లోతైన పరిజ్ఞానం ఉన్నవారు విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

అకౌంటింగ్ :
దేశంలో జీఎస్‌టీ అమలు తర్వాత వివిధ సంస్థలకు అకౌంటింగ్ నిపుణుల ఆవశ్యకత పెరిగింది. ఈ ధోరణి రానున్న కాలంలోనూ కొనసాగనుందని సర్వేల గణాంకాలు తెలియజేస్తున్నాయి.

కంపెనీల అభిప్రాయంలో డిమాండింగ్ జాబ్ ప్రొఫైల్స్...
  • సాఫ్ట్‌వేర్ డెవలపర్స్
  • సేల్స్ ప్రొఫెషనల్స్
  • కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్
  • జనరల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్
  • మార్కెటింగ్ ప్రొఫెషనల్స్
  • కంప్యూటర్ టెక్నీషియన్
  • అకౌంటింగ్ ప్రొఫెషనల్
  • జావా స్క్రిప్ట్
అవసరమైన నైపుణ్యాలు...
జాబ్ మార్కెట్‌లో డిమాండింగ్ ప్రొఫైల్స్ పరంగా సంబంధిత డొమైన్ నైపుణ్యాలతోపాటు ఇతర స్కిల్స్ కూడా ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. అవి..
1. ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్: 18.71 శాతం
2. డిడక్టివ్ రీజనింగ్ : 11.66 శాతం
3. ఇండక్టివ్ రీజనింగ్ : 8.56 శాతం
4. ఉత్సాహం, ఉత్సుకత : 5.28 శాతం
5. మనో విజ్ఞత : 6.42 శాతం
6. మనో నిబ్బరం : 4.28 శాతం
7. సమాచార సేకరణ, క్రోడీకరణ: 6.31 శాతం
8. క్వాంటిటేటివ్ ఎబిలిటీ : 2.83 శాతం

కోడింగ్ నైపుణ్యాలు అవసరం..
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఎన్నో ఏళ్లుగా ఎవర్ గ్రీన్‌గా ఉంది. అందుకే ఈ జాబ్ ప్రొఫైల్ ముందంజలో ఉంటోంది. ఈ విభాగంలో ఉద్యోగం కోరుకునేవారు బేసిక్‌గా కోడింగ్ నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలి. తమ నైపుణ్యాలకు ఆటోమేషన్‌ను సమ్మిళితం చేసుకోవాలి. ఇలా వ్యవహరిస్తే రిక్రూటర్స్ కోణంలో హాట్ కేక్‌లుగా మారతారు.
- రమేశ్ లోగనాథన్, ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్.
Published date : 23 Oct 2017 05:59PM

Photo Stories