Skip to main content

రిటైల్ రంగం

గ్లోబలైజేషన్, ప్రజల అభిరుచుల్లో మార్పుల ఫలితంగా దేశీయ రిటైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన షాషింగ్ మాల్స్, హైపర్, సూపర్ మార్కెట్లు.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం విస్తరించడం ఇందులో భాగమే.
ఎంటర్‌టైన్‌మెంట్, రిక్రియేషన్, షాపింగ్, ఫుడ్... అవసరం ఏదైనా.. ఇప్పుడందరి దారులూ మాల్స్ వైపే. ఫలితంగా రిటైల్ రంగం శరవేగంగా విస్తరిస్తూ.. అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. చక్కటి మాటతీరు, సరైన నడవడిక, కనీస విద్యార్హతలతో రిటైల్ రంగంలోనూ ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. కానీ, యువతలో ఎక్కువ మందికి ఈ రంగం కెరీర్‌పై సరైన అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలో రిటైల్ రంగం అవకాశాలపై ప్రత్యేక కథనం...

బ్రాండ్‌లన్నీ ఒకే చోట.. నచ్చింది ఎంచుకొనే సౌలభ్యం.. పైగా ధరలో డిస్కౌంట్.. సూపర్ మార్కెట్ల సూపర్ సక్సెస్ సూత్రం ఇదే. అందుకే ఏది కొనాలన్నా అందరి చూపూ అటు వైపే. దీంతో దేశంలో షాపింగ్ మాల్స్ హవా కొనసాగుతోంది. కొన్ని మాల్స్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, సినిమా, గేమ్స్, రెస్టారెంట్లు, వినోదం వంటివి ఒకే చోట ఉంటుండగా.. మరికొన్ని చోట్ల ప్రత్యేక స్టోర్లుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా రిటైల్ రంగం వృద్ధిలో విజృంభిస్తూ.. ఇతర రంగాలతో పోల్చితే అవకాశాల కల్పనలో తానేమీ తక్కువ కాదని నిరూపిస్తోంది.

ఎఫ్‌డీఐలతో ఉపాధికి ఊపిరి!
రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు సరళీకృత విధానాల అమలు నేపథ్యంలో రిటైల్ రంగంలో పెట్టుబడులు పెరిగి.. స్థానికంగా ఉద్యోగకల్పన మెరుగవుతోంది. కొన్ని అంతర్జాతీయ రిటైల్ దిగ్గజ సంస్థలు త్వరలోనే భారత్‌లోకి ప్రవేశించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. మరిన్ని ఉపాధి అవకాశాలు యువతను వెతుక్కుంటూ రావడం ఖాయమంటున్నారు నిపుణులు.

అవకాశాల ఆన్‌లైన్
ఆన్‌లైన్ షాపింగ్ తీసుకొచ్చిన విప్లవంతో రిటైల్ బిజినెస్ స్వరూపమే మారిపోయింది. ప్రస్తుతం ప్రతిదీ ఆన్‌లైన్లో కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్ కొనుగోళ్లు, డెలివరీ కార్యకలాపాల్లో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం రిటైల్ ఇండస్ట్రీలో ఆన్‌లైన్ బిజినెస్‌దే అగ్రస్థానం. ఆర్‌ఎన్‌సీఓఎస్ సర్వే ప్రకారం ఈ-కామర్స్ బిజినెస్ పరిధి మరింత పెరగనుంది. వచ్చే ఏడాదికి ఈ-కామర్స్ విలువ నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా.
  • టెక్నాలజీ సహాయంతో వినియోగదారుల విశ్వాసం పొందేందుకు ఈ-కామర్స్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నూతన టెక్నాలజీలు ఈ ఏడాదిలోనే రిటైల్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరతాయని పరిశ్రమల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల ఆధారంగా 'క్లిక్ అండ్ కలెక్ట్'; షిప్పింగ్ అండ్ డెలివరీ ప్రక్రియలను త్వరగా పూర్తి చేసేలా కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. వివిధ వ్యూహాలను అమలుచేస్తున్నాయి. ఈ క్రమంలో యువతకు ఆధునిక కొలువులు దగ్గరవుతున్నాయి.
అపార అవకాశాలు..
రిటైల్ మార్కెటింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఉజ్వల అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వీరికి రిటైల్‌తోపాటు ఇతర రంగాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. స్టోర్ ఆపరేషన్‌‌స; హ్యూమన్ రిసోర్సెస్/ట్రైనింగ్; ఫైనాన్‌‌స అండ్ అడ్మినిస్ట్రేషన్; కస్టమర్ కాంటాక్ట్ సెంటర్స్; మార్కెటింగ్; లాజిస్టిక్స్ తదితర విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. హైపర్, సూపర్ మార్కెట్లతోపాటుఅగ్రికల్చర్, టెలికం, బ్యాంకింగ్, బెవరేజెస్, రెస్టారెంట్స్, ఆటో మొబైల్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుట్‌వేర్ పరిశ్రమల్లో అవకాశాలు లభిస్తాయి.

జాబ్ ప్రొఫైల్స్ ..
  • స్టోర్ మేనేజర్
  • డిపార్ట్‌మెంట్ మేనేజర్
  • ఫ్లోర్ మేనేజర్
  • హెచ్‌ఆర్ మేనేజర్
  • రిటైల్ స్టోర్ సూపర్‌వైజర్
  • రిటైల్ ఎగ్జిక్యూటివ్
  • సేల్స్ మేనేజర్
  • బ్రాండ్ మేనేజర్
  • ట్రాన్‌‌సపోర్ట్ సూపర్‌వైజర్
టాప్ రిక్రూటర్స్ :
సూపర్ మార్కెట్స్, అపెరల్స్ అండ్ ఫుట్‌వేర్, హోమ్ ఫర్నీచర్, లైఫ్‌స్టైల్ అండ్ పర్సనల్ ప్రొడక్ట్స్, హెల్త్ అండ్ వెల్‌నెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్లల్లోని కంపెనీలు రిటైల్ రంగంలో ఎక్కువగా అవకాశాలు అందిస్తున్నాయి. వీటిలో ఫ్యూచర్ గ్రూప్, ఆదిత్యా బిర్లా రిటైల్ లిమిటెడ్, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (పాంటలూన్‌‌స), షాపర్స్ స్టాప్, రిలయెన్స్ రిటైల్ లిమిటెడ్, లైఫ్ స్టైల్, టైటాన్, వాల్‌మార్ట్, బాటా, డోమినోస్, రేమాండ్ తదితర సంస్థలు ముఖ్యమైనవి.

వేతనాలు :
రిటైల్ రంగంలో ప్రారంభ వేతనాలు రూ.12,000 నుంచి మొదలవుతాయి. రెండు, మూడేళ్ల అనుభవంతో నెలకు రూ.30,000 పైగా సంపాదించొచ్చు. పేరున్న సంస్థల్లోనైతే మరింత మెరుగైన వేతనాలు అందుకోవచ్చు. రిటైల్ ఇండస్ట్రీ అనుభవంతో విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Published date : 13 Mar 2018 01:28PM

Photo Stories