Skip to main content

పర్యావరణ పరిరక్షణలో యువతకు విస్తృత అవకాశాలు..

మానవాళి మనుగడ పర్యావరణ పరిరక్షణపైనే ఆధారపడి ఉందన్నది నిస్సందేహం! అపరిమిత పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత.. జీవులకు ప్రాణాంతకంగా మారింది. వాతావరణ మార్పుల వల్ల భూమిపై ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయి.. అనేక ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతోంది. రాబోయే విపత్తును కాస్త ఆలస్యంగానైనా గుర్తించిన ప్రపంచ దేశాలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. చెట్లను పెంచడం, అడవుల విస్తరణ పెంచే ప్రయత్నం జరుగుతోంది. భూమిపై జీవజాతుల మనుగడకు కీలకమైన పర్యావరణాన్ని నేటి యువత ఆఫ్‌బీట్ కెరీర్‌గా మలచుకొని.. అవకాశాలు అందుకుంటోంది.
పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలు దృష్టిసారించడంతో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లు, సంబంధిత నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. కాలుష్య కారక పరిశ్రమల్లో పర్యావరణ ప్రభావం మదింపు(ఈఐఏ) చేయడానికి ఉద్యోగులను తప్పనిసరిగా నియమించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లకు అవకాశాలు మెరుగయ్యాయి. పర్యావరణ ఇంజనీరింగ్, సంబంధిత కోర్సులు పూర్తి చేసినవారికి దేశవిదేశాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. కాలుష్యం వెదజల్లే కర్మాగారాల్లో ఇంజనీర్లను నియమించుకుంటున్నారు. కాలుష్యనియంత్రణ మండలిలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లకు ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఇటీవల కాలంలో వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో వ్యర్థాల శుద్ధి పరిశ్రమ మెరుగైన పనితీరు కనబరుస్తోంది. తాజాగా కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- తెలంగాణ వ్యర్థాల నిర్వహణ - శుద్ధిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో పర్యావరణ ఇంజనీర్లకు భారీగా అవకాశాలు అందుబాటు లోకి వచ్చాయి. సంబంధిత నైపుణ్యాలున్న అభ్యర్థులకు మంచి డిమాండ్ ఏర్పడింది.

ప్రకృతితో మమేకం కావాలి..
ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లు.. తమ వృత్తిని ఒక ఉద్యోగంలా కాకుండా.. ఒక పవిత్ర బాధ్యతగా భావించాలి. ప్రకృతిపై మమకారంతో పర్యావరణాన్ని కాపాడుకోవాలనే తపన, వృత్తిపట్ల అంకితభావం ఉన్నవారే ఈ ఉద్యోగంలో రాణించగలరు. వీరు పర్యావరణ చట్టాలు, నిబంధనలపై అవగాహన పెంచుకో వాలి. పనివేళలతో నిమిత్తం లేకుండా.. క్షేత్రస్థాయిలో ఎక్కువ సేపు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అవసరాన్ని బట్టి దూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు సిద్ధంగా ఉండాలి. టైమ్ మేనేజ్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ పెంచుకోవాలి.

విదేశాల్లో ప్రాజెక్టులు :
పర్యావరణ నిపుణులకు దేశ, విదేశ ప్రభుత్వాల నుంచి కూడా ప్రాజెక్టులు వస్తున్నాయి. అఫ్గానిస్థాన్, ఇండోనేషియా, కెనడా, ఇతర ఆసియా, ఆఫ్రికా దేశాలు మన దేశం నుంచి ఎన్విరాన్‌మెంటలిస్టులను ఆహ్వానించి వారికి ప్రాజెక్టులు అప్పగిస్తున్నాయి. ఇండోనేషియాలోని నగరాల్లో వరదలు, సునామీ వచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్వహిస్తున్న ఓ ప్రాజెక్టుపై తెలుగు నిపుణుడు సాయి భాస్కర్‌రెడ్డి పనిచేస్తున్నారు. గతంలో ఈయన అఫ్గానిస్థాన్‌లో యూఎన్‌డీపీ (యునెటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమంలో భాగంగా మూడేళ్లపాటు పనిచే శారు. ఎన్విరాన్‌మెంటలిస్టులకు ప్రపంచ వ్యాప్తం గా పనిచేసే అవకాశం లభిస్తుందని ఆయన చెబుతున్నారు.

కొలువులిచ్చే సంస్థలు..
తాగు నీరు,మురుగు నీటి నిర్వహణ చేపట్టే టెక్‌వ్యాబేజ్ వంటి సంస్థలు.. మున్సిపాలిటీ వ్యర్థాలు, ప్రమాదకరమైన వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన రామ్‌కీ ఎన్విరోఇంజనీర్స్ వంటి సంస్థలు; ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ చేసే చోళమండళ గ్రూపు; ఎనర్జీ సెక్టారు(జీఈ పవర్ లాంటివి) తదితర చోట్ల అవకాశాలు అందుకోవచ్చు. రాష్ట్ర, కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లో, నీటి సరఫరా బోర్డు,పునరుత్పాదక శక్తి శాఖల్లో ఉద్యోగాలు పొందవచ్చు. అలానే టెక్స్‌టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వ్యర్థాల నిర్వహణ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అదేవిధంగా యునెస్కో, యూఎన్‌డీపీ, ప్రపంచ బ్యాంకుల నుంచి ఫెలోషిప్ ప్రోగ్రాంలు లభిస్తాయి. ప్రభుత్వపరంగా అర్బన్ ప్లానింగ్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్సెస్ తదితర ప్రభుత్వ విభాగాల్లోనూ పర్యావరణ నిపుణులకు కొలువులు దక్కుతున్నాయి.

కోర్సులు ఇవే..
మన దేశంలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్‌లో.. బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి.. బీటెక్‌లో చేరొచ్చు. ఇందులో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తిచేస్తే విస్తృత అవకాశాలు లభిస్తాయి. సివిల్, కెమికల్, బయోటెక్, మెకానికల్, ఎలక్ట్రికల్ విద్యార్థులు సైతం పర్యావరణ రంగంలో కొలువులు సొంతం చేసుకునే వీలుంది. నేచురల్ సైన్స్ విభాగాలైన లైఫ్ సైన్స్, కెమిస్ట్రీ, జియాలజీ, జియోఫిజిక్స్, అట్మాస్ఫిరిక్ సైన్స్, ఫిజిక్స్ విద్యార్థులు కూడా ఎన్విరాన్‌మెంటలిస్టుగా రాణించవచ్చు. ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లతోపాటు ఎన్విరాన్‌మెంటల్ బయాలజిస్ట్, ఎన్విరాన్‌మెంటల్ జర్నలిస్ట్, ఎన్విరాన్‌మెంటల్ కన్సల్టెంట్ ఉద్యోగాల్లో చేరవచ్చు.

ఇన్‌స్టిట్యూట్‌లు :
ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు.. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ-హైదరాబాద్, నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సెంటర్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్, బయోవేస్ట్ ఎనర్జీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్.

వేతనాలు ఇలా..
పర్యావరణ నిపుణులకు నైపుణ్యాల ఆధారంగా వేతనాలు లభిస్తాయి. ప్రారంభంలో నెలకు రూ.20వేల నుంచి రూ.25వేల వేతనం అందుతుంది. తర్వాత నైపుణ్యాలు, పనితీరును బట్టి జీతభత్యాల్లో పెంపు ఉంటుంది. ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో నైపుణ్యాలు, అర్హతలు, అనుభవం ద్వారా అధిక వేతనాలు అందుకోవచ్చు.

పర్యావరణం.. అవకాశాలు :
పర్యావరణం ఒక వైవిధ్యమైన సబ్జెక్టు. లైఫ్ సైన్స్ కోర్సులు, సివిల్ ఇంజనీరింగ్, జియాలజీ, బయోటెక్... ఇలా విభిన్నమైన కోర్సులు చదివి పర్యావరణవేత్తలుగా స్థిరపడవచ్చు. ఉద్యోగం కోసం కాకుండా..ప్రకృతితో అనుసంధాన మవుతూ.. దానిపట్ల సున్నిత వైఖరి, వాటిల్లుతున్న నష్టం మీద ఆందోళన చెందేవారికి పర్యావరణం చక్కటి కెరీర్‌ను అందిస్తుంది. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ), ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులు, యూఎన్, వరల్డ్ బ్యాంకు, ఎన్‌జీవోలు, పర్యావరణ అనుమతులతో ముడిపడి ఉండే పరిశ్రమలు ఎన్విరాన్‌మెంటలిస్టులను నియమిం చుకుంటున్నాయి. విదేశాల్లోనూ ఎన్విరాన్‌మెంటలిస్టులకు అవకాశాలు లభిస్తున్నాయి.
- నక్క సాయి భాస్కర్ రెడ్డి, పర్యావరణవేత్త.
Published date : 27 Aug 2019 06:15PM

Photo Stories