Skip to main content

ప్రాంగణ నియామకాల పండగ!

-  క్యాంపస్ రిక్రూట్మెంట్లతో కళకళలాడుతున్న కాలేజీలు
-  జాబ్ ఆఫర్లను పెంచిన ప్రముఖ ఐటీ కంపెనీలు

 కాలేజీ ఏదైనా, చేస్తున్న కోర్సు మరేదైనా విద్యార్థుల దృష్టంతా ఉన్నతంగా ‘కొలువు’దీరడంపైనే! ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ‘క్యాంపస్ ప్లేస్మెంట్స్’ లక్ష్యం గా కుస్తీలు పడుతుంటారు. కార్పొరేట్ కంపెనీల్లో కోరుకున్న కొలువును సొంతం చేసుకోవాలని కలలు కంటారు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మార్కెట్లోకి పోటాపోటీగా దూసుకొస్తున్న బడా సంస్థలు.. నైపుణ్యాలతో నిండుకుండలా ఉండే మానవ వనరుల కోసం గాలిస్తున్నాయి. కాలేజీ ప్రాంగణాలకు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం ప్రాంగణ నియామకాల హడావిడితో నగరంలోని కాలేజీల క్యాంపస్లు కళకళలాడుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం..

 
అమెజాన్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ఎస్బీసీ, టీసీఎస్.. తదితర వందలాది కంపెనీలు భాగ్యనగరం విద్యాసంస్థల ముందు క్యూ కడుతున్నాయి. తమ అవసరాలకు సరిపోయే మానవ వనరుల కోసం ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నాయి. సాధారణంగా ఏటా కాలేజీల్లో ప్రాంగణ నియామకాలు అక్టోబర్-నవంబర్ మధ్యలో మొదలవుతాయి. కానీ, ఈసారి ఆగస్టులోనే కంపెనీలు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. ‘‘ఫస్ట్ ఈజ్ బెస్ట్.. మేలిమి ముత్యాల్లాంటి మానవ వనరులు దొరకాలంటే అందరికంటే ముందుగానే క్యాంపస్లకు చేరుకోవాలి.. ఈ భావనే కంపెనీలు ముందుగా హైరింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి కారణం’’ అంటున్నారు కళాశాలల ప్లేస్మెంట్స్ విభాగం ప్రతినిధులు!

 స్కిల్స్ ఆధారంగానే వేతనం
 విద్యార్థుల నైపుణ్యాల ఆధారంగా కంపెనీలు వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత పోటీ వాతావరణంలో కంపెనీలు సమర్థులైన అభ్యర్థులైతే చాలు రూ.లక్షల ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(హెచ్సీయూ)లో ప్రాంగణ నియామకాలు ప్రారంభమయ్యాయి. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టులో 15 మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్ సాధించారు. ఎంసీఏ, ఎంటెక్, ఎకనామిక్స్ విద్యార్థులు అధిక వేతన ప్యాకేజీలు పొందారు. హెచ్ఎస్బీసీ, టెరాడేటా, కేవియం నెట్వర్క్స్.. ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.7.20 లక్షల వేతనాలను ఆఫర్ చేసి నియామకాలు జరిపాయి. హెచ్ఎస్బీసీ.. ఆరుగురు ఎంఏ ఎకనామిక్స్ విద్యార్థులను, ఇద్దరు ఎంటెక్ విద్యార్థులను నియమించుకుంది. టెరాడేటా నలుగురు ఎంటెక్ విద్యార్థులకు, ఒక ఎంసీఏ విద్యార్థికి ఉద్యోగాలను ఆఫర్ చేసింది. 2013-14 విద్యా సంవత్సరంలో 210 మందికి పైగా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కోల్గేట్ పామోలివ్, ఐడియా సెల్యూలార్, కాగ్నిజెంట్, గ్లోబల్ డేటా, టీసీఎస్, ఇంటెగ్రాఫ్ కన్సల్టింగ్, డీఎస్టీ వరల్డ్ వైడ్, హెచ్ఎస్బీసీ తదితర సంస్థలు పాల్గొన్నాయి.

 ఓయూలో రికార్డు స్థాయిలో
 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(ఓయూ).. ప్రీమియం కంపెనీ రిక్రూట్మెంట్ డ్రైవ్(పీసీఆర్డీ)లో ప్రముఖ ఐటీ కంపెనీలు యాక్సెంచర్, ఇన్ఫోసిస్, విప్రో లిమిటెడ్ పాల్గొన్నాయి. ఇవి ఈ నెల 4 నుంచి 13 వరకు జరిగిన డ్రైవ్లో బీఈ, ఎంఈ, ఎంసీఏ చివరి సంవత్సర విద్యార్థులను నియమించుకున్నాయి. మొత్తం 431 ఉద్యోగాలను ఆఫర్ చేశాయి. ‘‘గతేడాదితో పోల్చితే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రాంగణ నియామకాల్లో 82 శాతం వృద్ధి నమోదైంది. ఈ సంవత్సరం ప్రముఖ ఐటీ కంపెనీలు తమ లక్ష్యాలకు అనుగుణంగా అధిక ఉద్యోగాలను ఆఫర్ చేశాయి. పది రోజుల పాటు జరిగిన ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో అత్యధికంగా యాక్సెంచర్ 154 మందిని నియమించుకుంది. విప్రో 139 మందిని, ఇన్ఫోసిస్ 138 మందిని రిక్రూట్ చేసుకున్నాయి. వచ్చే కొద్ది వారాల్లో ఒరాకిల్, కేవియం నెట్వర్క్స్, మారుతి సుజుకీ, ఐటీసీ-భద్రాచలం, టెక్ మహీంద్రా, మైండ్ ట్రీ తదితర సంస్థలు క్యాంపస్ను సందర్శించనున్నాయి’’ అని ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వి.ఉమామహేశ్వర్ తెలిపారు.

 క్లిష్టమే కానీ.. కష్టం కాదు!
 ప్రాంగణ నియామకాల్లో మంచి ప్యాకేజీతో కోరుకున్న ఉద్యోగం వచ్చినప్పుడే విద్యార్థుల నాలుగేళ్ల శ్రమకు సరైన గుర్తింపు వచ్చినట్లు లెక్క! ప్రస్తుత నియామకాల తీరును పరిశీలిస్తే రిక్రూటర్స్ ప్రధానంగా అకడమిక్స్లో ప్రాథమిక అంశాలపై పట్టు, వైఖరి, విశ్లేషణా సామర్థ్యం, లైఫ్ స్కిల్స్ తదితరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

 ముఖ్యాంశాలు
 ప్రాంగణ నియామకాల్లో భాగంగా కంపెనీలు తొలుత ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇందులో వెర్బల్, క్వాంటిటేటివ్, లాజికల్ రీజనింగ్కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నారు. ఇప్పటివరకు ప్రశ్నల సరళిని పరిశీలిస్తే ఈసారి విప్రో అదనంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్టులపై పరిజ్ఞానాన్ని పరీక్షించింది. దీన్ని సీఎస్ఈ బ్రాంచేతర విద్యార్థులు కొంత కష్టంగా భావించారు.

 ఇన్ఫోసిస్.. ఇంటర్వ్యూలో రెజ్యూమెలోని అంశాలు, కోర్ సబ్జెక్టులపై పరిజ్ఞానాన్ని పరీక్షించడంపై ఎక్కువగా దృష్టిసారించింది. ‘ఐటీ పరిశ్రమలో మీరెందుకు ప్రవేశించాలనుకుంటున్నారు? కాలేజీలో మీరు పాల్గొన్న ఎక్స్ట్రా కరిక్యులర్ కార్యక్రమాలేమిటి?’ వంటి ప్రశ్నలు కూడా అడిగారు.

 యాక్సెంచర్ ఈసారి ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రక్రియను నిర్వహించింది. ఇందులో భాగంగా బ్యాచ్కు ఐదుగురు విద్యార్థులుంటారు. ప్రతి విద్యార్థి తాను ఎంపిక చేసుకున్న అంశంపై 2 నిమిషాలు మాట్లాడాలి. ఈ ఇంటర్వ్యూ ద్వారా నిర్దేశ అంశంపై విద్యార్థుల ఆలోచనా సరళి, కమ్యూనికేషన్ స్కిల్స్ను పరిశీలించారు. ఇంటర్వ్యూ బోర్డులో సాంకేతిక రంగ నిపుణుడు, హెచ్ఆర్ ప్రతినిధి ఉంటారు.
 విప్రో.. 83 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు ఉన్నవారికి ఎలాంటి ఆన్లైన్ టెస్ట్లు నిర్వహించకుండానే, నేరుగా ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. ఇందులో టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ఉంటాయి. టెక్నికల్ రౌండ్లో ప్రోగ్రామింగ్ కాన్సెప్టులు, బ్రాంచ్కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి హెచ్ఆర్ రౌండ్ లేకుండానే ఉద్యో గాలు ఇచ్చారు.

 కమ్యూనికేషన్ స్కిల్స్కే అగ్రస్థానం
 ‘‘ప్రముఖ కంపెనీలన్నీ హైదరాబాద్లోని విద్యా సంస్థలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రతిభే కొలమానంగా విద్యార్థులకు కొలువులను ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఐటీ, ఐటీయేతర సంస్థలు ఉద్యోగి ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటున్న అంశాల్లో అగ్రభాగం కమ్యూనికేషన్ స్కిల్స్దేనని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉండే తమ ఖాతాదారులతో ఎలా వ్యవహరిస్తారన్న దాన్ని పరీక్షించడానికి ప్రాధాన్యమిచ్చాయి. విద్యార్థి దార్శనికత, వైఖరి, జీవన నైపుణ్యాలు, వ్యక్తిగత ప్రవర్తన తదితరాలను పరీక్షిస్తున్నాయి. అన్ని విధాలా యోగ్యులైతేనే వేతన ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి’’
 - ఆషిస్ జాకబ్ థామస్, ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్, హెచ్సీయూ

 అనలిటిక్స్తో ప్రతిభ అంచనా
 ‘‘క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రూ.7.20 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో కేవియం నెట్వర్క్స్కు ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. మూడు రౌండ్ల ఎంపిక విధానంలో రిక్రూటర్ ప్రధానంగా అనలిటిక్స్ ఆధారంగా ప్రతిభను అంచనా వేశారు. తొలుత రాత పరీక్ష నిర్వహించారు. దీనికి వంద మంది హాజరయ్యారు. 16 ప్రశ్నలకు గంట వ్యవధిలో సమాధానాలివ్వాలి. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంది. వీటికి సమాధానాలు గుర్తించడంతోపాటు సమీక్షించాల్సి ఉంటుంది. 8 మంది టెక్నికల్ రౌండ్కు వెళ్లగా చివరకు ముగ్గురు హెచ్ఆర్ రౌండ్కు చేరుకున్నారు. అక్కడ నాకు ఎదురైన మొదటి ప్రశ్న ‘టెల్ మి ఎబౌట్ యువర్ సెల్ఫ్’. ఆత్మస్థైర్యంతో నేను చెప్పిన సమాధానాలు ఉద్యోగం సాధించి పెట్టాయి. అకడమిక్స్ బేసిక్స్పై పట్టు, సీ ప్రోగ్రామింగ్, డేటా అనలైజ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా స్ట్రక్చర్స్పై కనీస పరిజ్ఞానం ఉంటే విజయం సాధించవచ్చు. బృందానికి నేతృత్వం వహించగల సామర్థ్యం కూడా అవసరం’’ 
 - ఎ.భావన, ఎంటెక్  సెకండియర్, హెచ్సీయూ
Published date : 21 Sep 2014 04:04PM

Photo Stories