Skip to main content

నూతన సంవత్సరంలో ‘ఐటీ’ జోష్..!

ఐటీ రంగం.. కోర్సు ఏదైనా.. బ్రాంచ్ ఏదైనా.. లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగుల ఆశ! కానీ, గత కొంతకాలంగా ఐటీ వృద్ధి రేటులో మందగమనం.. దాంతో నియామకాల్లోనూ తగ్గుదల ఉద్యోగార్థులను నిరాశ పరచింది! మరి కొత్త సంవత్సరం 2019లో ఐటీ రంగం ఆశల ఊసులు మోసుకొస్తుందా..!
సాఫ్ట్‌వేర్ కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టనున్నాయా... ఆకర్షణీయ వేతనాలు అందించనున్నాయా..!? అంటే... అవుననే సమాధానం వినిపిస్తోంది!! ఐటీ రంగం వృద్ధి, నియామకాల తీరుతెన్నులపై తాజా సర్వేలు, నిపుణుల విశ్లేషణ...

కొత్త సంవత్సరంలో ఐటీ..
అటు వ్యాపార వృద్ధిలో.. ఇటు నియామకాల పరంగా గత కొంతకాలంగా ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే 2019లో ఐటీ రంగం పునర్వైభవం పొంది.. భారీగా నియామకాలు చేపట్టే అవకాశముందని పలు సర్వేల తాజా అంచనా. వ్యాపార కార్యకలాపాల పరంగా సానుకూల పరిస్థితులు కనిపించడమే ఇందుకు కారణమని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త సంవత్సరంలో ఐటీ రంగం వృద్ధి నమోదు చేసుకోవడం ఖాయమని.. ఆ క్రమంలో క్లయింట్లకు వేగంగా సర్వీసులు అందించడానికి వీలుగా కొత్త నియామకాలు చేపట్టే అవకాశముందని నాస్కామ్ తదితర సంస్థల అంచనా. ఐటీ రంగం ఈ ఏడాది ఆశాజనక వృద్ధి నమోదు చేసుకుంటుందనడానికి.. అదే విధంగా కొత్త నియామకాలు పెరుగుతాయనడానికి మరో నిదర్శనం.. ఇటీవల ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాల్లో దాదాపు అన్ని ఐటీ సంస్థలు వృద్ధి నమోదు చేసుకోవడమే!

పెరుగుతున్న ఎగుమతులు..
అమెరికాలో హెచ్-1బి వీసాలపై ఆంక్షల నేపథ్యంలో ఇంతకాలం ఆఫ్‌షోర్ కేంద్రాల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు.. గత కొంతకాలంగా తమ పంథా మార్చుకున్నాయి. ఎగుమతులే ఆధారంగా విదేశీ క్లయింట్లకు సర్వీసులు అందిస్తున్నాయి. ఫలితంగా 2018లో భారత్ నుంచి ఐటీ రంగం ఎగుమతుల విలువ 126 బిలియన్ డాలర్లుగా నమోదైంది. రెవెన్యూ వృద్ధి సైతం ఏడు నుంచి తొమ్మిది శాతానికి పెరిగింది. ఈ విధంగా ఐటీ రంగంలో కార్యకలాపాలు విస్తరిస్తున్న తరుణంలో సంస్థలు.. క్లయింట్లకు అందించే సేవల్లో లోటుపాట్లు లేకుండా చూసేందుకు వీలుగా మళ్లీ కొత్త నియామకాల బాటపడుతున్నాయి. గతేడాది చివరి నాటికి దేశ ఐటీ రంగంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.5 మిలియన్ల మంది కాగా.. వీరిలో 40 శాతం మంది ఫ్రెషర్స్ ఉన్నట్లు అంచనా. కొత్త సంవత్సరంలో ఫ్రెషర్స్ నియామకాలు మరింత జోరందుకోనున్నాయి. కొత్తగా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు లభించడం ఖాయమని పలు నివేదికలతోపాటు పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

ఫ్రెషర్స్‌కు ఆశాదీపంలా..
ఇటీవల ఆశాజనక వృద్ధిరేటు నమోదు చేసుకోవడంతో ఐటీ రంగ కంపెనీలు ఉద్యోగార్థులకు ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. వాస్తవానికి గత ఏడేళ్లుగా ఐటీ కంపెనీల ఫ్రెషర్స్ నియామకాలు 20 నుంచి 25 శాతం దాటలేదు. కానీ, ఈ ఏడాది 50 శాతానికి చేరుకునే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. వేతనాల్లోనూ గతేడాదితో పోల్చితే 20 శాతం అధికంగా లభించే అవకాశం ఉందంటున్నారు. తాజాగా నౌకరీ డాట్ కామ్ విడుదల చేసిన హైరింగ్ ఔట్‌లుక్ రిపోర్ట్-2019 ప్రకారం ఐటీ రంగం వచ్చే ఆరునెలల్లో దాదాపు లక్షన్నర ఉద్యోగాలను కల్పించనుంది. ఇందులో 30 శాతం నుంచి 40 శాతం ఫ్రెషర్స్ ఉంటారని సర్వే పేర్కొంది. గతేడాదితో పోల్చితే ఫ్రెషర్స్ నియామకాల్లో 20 శాతం మేర వృద్ధి ఉంటుందని సర్వేలో పాల్గొన్న 40 శాతం సంస్థలు పేర్కొనడం విశేషం.

టెక్ స్టార్టప్స్..వెన్నుదన్ను
సాఫ్ట్‌వేర్ కంపెనీలతోపాటు టెక్ స్టార్టప్స్ సైతం ఐటీ ఉద్యోగార్థులకు వెన్నుదన్నుగా నిలవనున్నట్లు పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 40 వేల స్టార్టప్ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తుండగా... వాటిలో 80 శాతం టెక్ స్టార్టప్ సంస్థలే! ఇవి కూడా గతేడాది వ్యాపార వృద్ధి పరంగా పురోగతి సాధించాయి. దాదాపు 130 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సొంతం చేసుకున్నాయి. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లోనూ కొనసాగనుందని.. ఫలితంగా ఈ సంస్థలు నూతన నియామకాలు చేపట్టడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

ఐఐటీలు, నిట్‌ల్లో భారీ ఆఫర్లు :
ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఐఐటీలు, నిట్‌లలో ఇటీవల ముగిసిన తొలిదశ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌లో ఈ ఏడాది పలు మధ్యతరహా ఐటీ సంస్థల నుంచి దిగ్గజ ఐటీ సంస్థల వరకు నియామకాలు చేపట్టాయి. భారీ సంఖ్యలో ఆఫర్లు ఇచ్చాయి. దీంతో తొలిదశలోనే ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో 80 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. వీటిలో 40 శాతం మేర కోర్ ఐటీ ప్రొడక్ట్ సర్వీసెస్ సంస్థలే కావడం గమనార్హం. బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్ రంగ కంపెనీలు కూడా తమ సంస్థల్లోని టెక్నికల్ విభాగాల్లోనే అధిక శాతం నియామకాలు చేపట్టాయి. టైర్-1, మెట్రో నగరాలతోపాటు టైర్-2, టైర్-3 నగరాల్లోని ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి కూడా ఐటీ కంపెనీలు నియామకాలు చేపట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ప్రకటించిన సంస్థలు :
పలు ఐటీ దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ కొత్త నియామకాల ప్రణాళికలు ప్రకటించాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి 30 వేల ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకున్నామని... 2019-20లో ఇది మరింత పెరిగే అవకాశముందని టీసీఎస్ ప్రకటించింది. ఇదేవిధంగా ఇన్ఫోసిస్ 25 వేల నుంచి 30 వేల వరకు; కాగ్నిజెంట్ 15 వేల నుంచి 20 వేల వరకు; విప్రో టెక్నాలజీస్ 20 వేల వరకు ఫ్రెషర్స్‌ను నియమించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి.

ఆ ఆరు విభాగాల్లో...
సంస్థలు ప్రధానంగా ఆరు విభాగాల్లోనే కొత్త నియామకాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. అవి..
1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)
2. మెషిన్ లెర్నింగ్
3. డేటా అనలిటిక్స్
4. బ్లాక్ చైన్ టెక్నాలజీ
5. క్లౌడ్ టెక్నాలజీస్
6. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ).
ఈ విభాగాల్లో ఫ్రెషర్స్‌కు నైపుణ్యాలను బట్టి ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ లీడ్, డేటా అసోసియేట్, ఏఐ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాలు కల్పిస్తున్నాయి. ఆటోమేషన్ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ విభాగాలకే ప్రాధాన్యమిస్తున్న సంస్థలు.. ఫ్రెషర్స్‌కు వాటికి సంబంధించిన శిక్షణనిచ్చేందుకు సైతం సమాయత్తం అవుతున్నాయి. అకడమిక్‌గా ఈ కొత్త టెక్నాలజీ నైపుణ్యాలు పూర్తిగా లభించని ప్రస్తుత పరిస్థితుల్లో.. ఫ్రెషర్స్‌కు శిక్షణనివ్వాలని భావిస్తున్నాయి.

ఫ్రీలాన్సర్లకూ అవకాశాలు..
ఐటీలో ఆటోమేషన్, కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న వారికి ఫ్రీలాన్సింగ్ విధానంలో నియమించుకునేందకు కూడా కంపెనీలు సిద్ధపడుతున్నాయి. పలు నివేదికల ప్రకారం అంతర్జాతీయంగా ఐటీ రంగంలో ఫ్రీలాన్సర్లకు సంబంధించి మన దేశం రెండో స్థానంలో నిలుస్తోంది. ముఖ్యంగా బ్లాక్‌చైన్, డీప్ లెర్నింగ్ విభాగాలకు సంబంధించి ఫ్రీలాన్సింగ్ అవకాశాలు లభిస్తున్నాయి. ఫ్రీలాన్సింగ్‌కు సంబంధించి ఎక్కువగా.. అనుభవం గడించిన, అత్యున్నత నైపుణ్యాలున్న మిడిల్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్‌కే సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి.

ఉపయోగపడే సర్టిఫికేషన్లు..
  • జావా
  • సీ, సీ++
  • పైథాన్
  • ఏఐ అండ్ ఎంఎల్
  • క్రిప్టో కరెన్సీ
కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలు..
  • ఆటోమేషన్ సంబంధిత లేటెస్ట్ టెక్నాలజీపై పట్టు
  • కోడింగ్, ప్రోగ్రామింగ్
  • క్రియేటివిటీ
  • కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్
  • క్రిటికల్ థింకింగ్
  • పీపుల్ మేనేజ్‌మెంట్
  • కోఆర్డినేటింగ్ స్కిల్స్
  • సర్వీస్ ఓరియెంటేషన్
  • నెగోషియేషన్ స్కిల్స్
  • డెసిషన్ మేకింగ్
  • కాగ్నిటివ్ స్కిల్స్, ఫ్లెక్సిబిలిటీ
  • ఎమోషనల్ ఇంటెలిజెన్స్
ఐటీ రంగం.. ముఖ్య గణాంకాలు
  • 2018లో భారత ఐటీ రంగం ఎగుమతుల విలువ 126 బిలియన్ డాలర్లు.
  • ఏడు నుంచి తొమ్మిది శాతం వృద్ధి బాటలో సాఫ్ట్‌వేర్ సంస్థలు.
  • 2018 చివరికి ఈ రంగంలో మొత్తం 4.5 మిలియన్ల మందికి ఉపాధి. వీరిలో 40 శాతం మేరకు ఫ్రెషర్స్.
  • గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఫ్రెషర్స్ నియామకాల్లో 20 నుంచి 25 శాతం పెరుగుదల.
  • సగటున రూ.మూడు లక్షల నుంచి రూ.పది లక్షల వార్షిక వేతనం అందే అవకాశం.
వేతనం.. ఆకర్షణీయం
 పే ప్యాకేజ్‌లు కూడా ఆకర్షణీయంగా ఉండనున్నాయి. నైపుణ్యాలున్న యువతకు వారికి లభించిన జాబ్ ప్రొఫైల్, సంస్థ స్థాయిని బట్టి రూ.మూడు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు వార్షిక వేతనం లభించనుందని అంచనా. తాజా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో వేతనం సగటున రూ.పది లక్షలుగా నిలిచింది. టెక్ స్టార్టప్ సంస్థలైతే.. సగటున అయిదు లక్షల వేతనంతోపాటు స్టాక్ ఆప్షన్స్, లాభాల్లో డివిడెండ్ వంటివి కూడా ఆఫర్ చేస్తున్నాయి.
 
 బేసిక్ స్కిల్స్ తప్పనిసరి..
 కొత్త సంవత్సరంలో ఆటోమేషన్ ఆధారిత ఉద్యోగాలు భారీ సంఖ్యలో లభించడం ఖాయం. అయితే ఆయా ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు సాఫ్ట్‌వేర్ రంగంలో బేసిక్ నైపుణ్యాలుగా భావించే కోడింగ్, ప్రోగ్రామింగ్, అప్లికేషన్, లాంగ్వేజ్ స్కిల్స్ తప్పనిసరి. ఎలాంటి కొత్త టెక్నాలజీని రూపొందించాలన్నా, అప్లై చేయాలన్నా ఈ నైపుణ్యాలు తప్పనిసరి.
    - వి.రాజన్న, ఎస్‌వీపీ, టీసీఎస్-హైదరాబాద్.
 
 కలిసొచ్చే కొత్త సంవత్సరం :
 నా అంచనా ప్రకారం ఫ్రెషర్స్‌కు ఐటీ నియామకాల పరంగా 2019 కలిసొచ్చే సంవత్సరమే. కోర్ ఐటీ సంస్థల్లోనే రెండున్నర లక్షల ఉద్యోగాలు లభించే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి అదనంగా టెక్ స్టార్టప్స్‌లో రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వీటిలో ఫ్రెషర్స్ వాటా 60 శాతం పైగానే ఉంటుంది. అయితే కంపెనీలు ఆటోమేషన్ ఆధారిత కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఉద్యోగార్థులు సంబంధిత   నైపుణ్యాలు సొంతం చేసుకోవడం మేలు చేస్తుంది.
    - టి.వి.మోహన్‌దాస్‌పాయ్, ఐటీ రంగ నిపుణులు.
Published date : 02 Feb 2019 05:24PM

Photo Stories