Skip to main content

నేరగాళ్ల భరతం పట్టే... ఫోరెన్సిక్ సైన్స్

ప్రస్తుత టెక్నాలజీమయ ప్రపంచంలో నేరగాళ్ల పంథా మారింది. నేరస్తులు విభిన్న మార్గాల్లో నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. తమ తెలివితేటలతో ఆధారాలను మాయం చేయడానికి కొత్త ఎత్తు గడలు వేస్తున్నారు. వీరి భరతం పట్టేందుకు పోలీసులు ప్రయోగిస్తున్న అస్త్రం ఫోరెన్సిక్ సైన్స్. ఈ విభాగంలో కోర్సులు పూర్తిచేసిన వారికి సీబీఐ, ఐబీ వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై కథనం.
నేర నిరూపణకు
నేరాలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను సేకరించి శాస్త్రీయ పద్ధతిలో పరిశోధించే విభాగమే ఫోరెన్సిక్ సైన్స్. సంఘటన స్థలంలో దొరికిన తల వెంట్రుకలు, వేలిముద్రలు, రక్తపు చుక్కలు, గోళ్లు వంటి చిన్న చిన్న ఆధారాలతో నేరస్తులను కనిపెట్టగల సత్తా ఉన్న శాస్త్రమిది. ఈ ఆధారాలను న్యాయ స్థానాలు ఆమోదిస్తుండటంతో ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.

ఫోరెన్సిక్ విభాగాలు
ఫోరెన్సిక్ ఆర్కియాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ లింగ్విస్టిక్, ఫోరెన్సిక్ సిరియాలజీ, ఫోరెన్సిక్ కంప్యూటింగ్, సైబర్ ఫోరెన్సిక్, ఫోరెన్సిక్ ఆడియో అండ్ వీడియో అనాలసిస్, సెల్‌ఫోన్ ఫోరెన్సిక్ విభాగాలు ఉన్నాయి.

కంప్యూటింగ్ ఫోరెన్సిక్‌కు భారీ డిమాండ్
ఇటీవలి కాలంలో కంప్యూటర్ వాడకం పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాలు అధికమయ్యాయి. కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని దొంగిలించడం, నాశనం చేయడం, వ్యక్తులను, సంస్థలను బెదిరించడం వంటివి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ సైన్స్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.

కావాల్సిన నైపుణ్యాలు
ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో పనిచేయాలంటే సమాచారం, ఆధారాల సేకరణ పద్ధతులపై అవగాహన ఉండాలి. విశ్లేషణ సామర్థ్యం, పరిశోధనల పట్ల అభిరుచి అవసరం.

కోర్సులు-సంస్థలు
గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ స్థాయిల్లో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ)లో పీజీ డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఉన్నాయి. కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్‌గా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది.

రిక్రూటింగ్ ఏజెన్సీలు
ఫోరెన్సిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ నేర పరిశోధన సంస్థలు, సీబీఐ, ఐబీ, నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, రీసెర్చ్ ఆర్గనైజేషన్లు, ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు, కోర్టులు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. యూజీసీ నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు పీహెచ్‌డీ చేయవచ్చు. తర్వాత కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా స్థిరపడొచ్చు.

వేతనాలు
ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి హోదాను బట్టి వేతనాలుంటాయి. ప్రారంభ వేతనం నెలకు రూ. 20-25 వేల వరకు ఉంటుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా వేతనాలు అందుతాయి.

విస్తృత అవకాశాలు
ఫోరెన్సిక్ సైన్స్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉండటంతో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. పరిశోధనలపై ఆసక్తి కనబరిస్తే సులభంగా ఉద్యోగాలు పొందొచ్చు. సీబీఐ, ఐబీ వంటి సంస్థల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వాలు కూడా ఇప్పుడిప్పుడే ఇలాంటి స్పెషల్ కోర్సులను ప్రోత్సహిస్తున్నాయి.
- కె. రమా, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫోరెన్సిక్ సైన్స్ విభాగం, ఉస్మానియా యూనివర్సిటీ.
Published date : 02 Aug 2016 02:19PM

Photo Stories