Skip to main content

నడి వయసులో...ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకోవడం ఎలా ?

యాంత్రీకరణతో సంస్థల్లో మానవ ప్రమేయం తగ్గుతోంది.. పెరుగుతున్న కొలువుల కోత.. ముఖ్యంగా ఐటీ రంగంలో.. మధ్య స్థాయి ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం.. సీనియర్లకు పింక్ స్లిప్‌లు జారీ.. ఇటీవల పలు నియామక ఏజెన్సీలు, కన్సల్టింగ్ సంస్థలు గణాంకాల సహితంగా వెల్లడిస్తున్న సమాచారం ఇది. ఆ రంగాల్లోని నిపుణులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పది, పదిహేనేళ్ల అనుభవం గడించిన, నాలుగు పదుల వయసు ఉద్యోగుల్లో తీవ్ర అభద్రతాభావం, ఆందోళన కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో.. మిడిల్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్ కెరీర్ మనుగడకు సలహాలు, సూచనలు..
నైపుణ్యాల లేమి కారణమా?
అన్ని రంగాల్లోని సంస్థలు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని.. తక్కువ మానవ వనరులతోనే అధిక ఉత్పత్తి, సేవల కోసం ప్రయత్నిస్తున్నాయి. తమ క్లయింట్ సంస్థలు, వినియోగదారులకు మెరుగైన సేవలందించి మార్కెట్ పోటీలో ముందంజలో ఉండాలని భావిస్తున్నాయి. అందుకే కొత్త నైపుణ్యాలున్నవారికే పెద్దపీట వేస్తున్నాయి. ఇటీవల కంపెనీలు జారీ చేస్తున్న పింక్ స్లిప్‌ల ప్రభావం ఎక్కువగా మధ్య స్థాయి ఎగ్జిక్యూటివ్స్‌పైనే ఉండటానికి వారిలో నైపుణ్యాల లేమి ఒక ముఖ్య కారణమని భావిస్తున్నారు.

ఐటీ.. మరింత అప్రమత్తం :
ఐటీ రంగంలోని మధ్య స్థాయి ఎగ్జిక్యూటివ్స్ మరింత అప్రమత్తంగా మెలగాలని నిపుణులు పేర్కొంటున్నారు. మన దేశంలో గతేడాది కాలంగా ఈ దశలోని వారు దాదాపు 70 వేల మంది పింక్ స్లిప్‌లు అందుకున్నట్లు సర్వేల అంచనా. ఈ నేపథ్యంలో వీరంతా తమ కంపెనీలు అవలంబిస్తున్న కొత్త టెక్నాలజీల గురించి తెలుసుకోవాలి. అందుకు అవసరమైన నైపుణ్యాలపై పట్టు సాధించాలి. ఐటీ రంగ ఉద్యోగులు ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, డేటా మైనింగ్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ వంటి స్కిల్స్ సొంతం చేసుకునేందుకు కృషి చేయాలి.

ఏఐ యుగం :
ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో మధ్య స్థాయి ఎగ్జిక్యూటివ్స్ కెరీర్‌ను సుస్థిరంగా ఉంచుకోవాలంటే.. నైపుణ్యాలకు పదును పెట్టుకోవడం, అత్యంత సమర్థంగా వ్యవహరించడం అలవరచుకోవాలి. ఏఐ కేవలం ఐటీ రంగానికే పరిమితం కాక.. ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఉత్పత్తి, తయారీ, సేవలు, ఫార్మా.. ఇలా ప్రతిరంగంలోనూ అంతర్భాగంగా మారిపోతోంది.

పొందాల్సిన స్కిల్స్ ఇవే..
  • ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పై అవగాహన.
  • బిగ్ డేటా, డేటా అనాలిసిస్‌లపై నేర్పు.
  • రోబోటిక్ టెక్నాలజీస్‌లో సామర్థ్యం.
  • క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలు.
  • రీసెర్చ్ ఓరియెంటేషన్.
నిరంతరం నేర్చుకుంటూ..
పైన పేర్కొన్న అంశాలు అందుకోవడానికి పలు మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్స్ ఈ స్కిల్స్‌పై సర్టిఫికెట్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. వీటిద్వారా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. దీంతోపాటు నిరంతరం నేర్చుకుంటూ ఉండే దృక్పథాన్ని కూడా అలవర్చుకోవాలి. బృందానికి కేటాయించిన టాస్క్ పరంగా అనుసరించాల్సిన ప్రాథమిక విధానాలతో పాటు.. అందుకు సంబంధించి కొత్తగా, సులభంగా ఉన్న మార్గాల గురించి నిరంతరం అన్వేషిస్తూ ఉండాలి.

ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి...
ఎన్ని నైపుణ్యాలు పొందినా.. కొన్ని సందర్భాల్లో సంస్థల కాస్ట్ కటింగ్ విధానాల కారణంగా పింక్ స్లిప్ అందుకోవాల్సిన పరిస్థితులు సైతం ఎదురుకావొచ్చు. ఇలాంటప్పుడు మానసికంగా కుంగిపోకుండా ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించాలి. ఒక సంస్థలో పింక్ స్లిప్ జారీ అయిన వెంటనే మరో కంపెనీలో ఉద్యోగం లభించడం అంత సులువు కాదు. కొత్త ఉద్యోగ సాధనలో భాగంగా కొద్దికాలం విరామం ఏర్పడినా ఆందోళన చెందకుండా ప్రయత్నాలు సాగించాలి. ఆ క్రమంలో...
  • తమ నైపుణ్యాలకు సరితూగే ఇతర సంస్థల గురించి అన్వేషించాలి.
  • ఆ సంస్థలు వ్యాపార కార్యకలాపాల దిశగా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల గురించి తెలుసుకోవాలి.
  • అవి కూడా కొత్త నైపుణ్యాల బాట పడుతుంటే.. వాటి గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
  • పింక్ స్లిప్ అందిన తర్వాత ఆందోళన చెందకుండా చిన్న సంస్థలో ఉద్యోగం చేసేందుకైనా సంసిద్ధంగా ఉండాలి.
ఫ్రీలాన్సింగ్...
ఉద్యోగ సాధన పరంగా తలెత్తిన విరామ సమయంలో నూతన సాంకేతికతపై శిక్షణ తీసుకోవడంతో పాటు.. అప్పటికే తమకు సరితూగే సంస్థలకు ఫ్రీలాన్సింగ్ విధానంలో పనిచేసే అవకాశాలను సైతం అన్వేషించాలి. ఫలితంగా ఇటు ఉద్యోగం లేదనే ఆందోళన తగ్గుతుంది. మరోవైపు తాజా నైపుణ్యాలపై శిక్షణ పొందే అవకాశం సైతం అందుబాటులో ఉంటుంది.

సోషల్ నెట్‌వర్క్...
ఉద్యోగ సాధనలో అందుబాటులో ఉన్న మరో ప్రధాన మార్గం.. సోషల్ నెట్‌వర్క్. దీన్ని వినియోగించుకోవడం ద్వారా సీనియర్లు, ఆ రంగంలోని ఇతర నిపుణులతో సంప్రదిస్తూ.. అవకాశాల గురించి అన్వేషణ సాగించాలి. ప్రస్తుత పరిస్థితిని సీనియర్లకు తెలియజేసి.. వారి సలహాలు, సూచనలతో ముందుకుసాగాలి. రెజ్యూమె తాజాగా కనిపించేలా చూసుకోవాలి. జాబ్ పోర్టల్స్‌లోనూ అవకాశాల సమాచారం లభిస్తోంది. వీటిలో నైపుణ్యాలతో కూడిన వివరాలను నమోదు చేయడం ద్వారా సరితూగే ఉద్యోగాల గురించి తెలుసుకునే వీలు లభిస్తుంది.

పొదుపుగా ముందుకు...
మరో ఉద్యోగం లభించే వరకు కుటుంబ పోషణ పరంగా అవసరమైన ఆదాయ వనరులను నిల్వ ఉంచుకునే విధంగా వ్యవహరించాలి. సాధారణంగా పింక్ స్లిప్ ఇచ్చిన సంస్థలు రెండు నుంచి మూడు నెలల వేతనాన్ని పరిహారంగా ఇచ్చే విధానం అమలు చేస్తున్నాయి. ఇలా వచ్చిన నగదును కొత్త ఉద్యోగం వచ్చేవరకు పొదుపు చేసుకుంటూ సాగాలి. దీనివల్ల కుటుంబ పరంగా ఎదురయ్యే వ్యయాలు భరించే విషయంలో ఆందోళన లేకుండా ముందుకుసాగొచ్చు.

ఇవీ గణాంకాలు..
  • టీమ్ లీజ్ సంస్థ అంచనా ప్రకారం- ఐటీ సంస్థల్లో మిడిల్ లెవల్‌లో పింక్ స్లిప్‌లు అందుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 30 నుంచి 40 శాతం మధ్య ఉంటోంది.
  • 70 శాతం సంస్థలు.. నూతన నైపుణ్యాల లేమి అనే కారణంతోనే మిడిల్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్‌ను తొలగిస్తున్నాయని టైమ్స్ జాబ్స్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది.
  • 40 నుంచి 50 శాతం సంస్థలు తమ ఉద్యోగుల్లో కొత్త నైపుణ్యాలు పెంపొందేలా రీ-స్కిల్లింగ్ పేరుతో శిక్షణ ఇస్తున్నాయి.
  • కొత్త సాంకేతికతల కారణంగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్న సంస్థల్లో ఐటీ సంస్థలదే ముందు వరుస.
ఎన్నో మార్గాలు...
కొత్తగా నేర్చుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పింక్ స్లిప్‌ల పరిస్థితి తలెత్తకముందే వీటిలో శిక్షణ పొందే విధంగా మిడిల్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్ వ్యక్తిగతంగా వ్యూహాలు రూపొందించుకోవాలి. నేటి యువతతో పోటీ పడే విధంగా రీ-స్కిల్లింగ్ విషయంలో ముందంజలో నిలవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుదీర్ఘ కాలం కెరీర్‌లో మనుగడ సాగించొచ్చు.
- అనింద్య, జీఎం, మైండ్ ట్రీ టెక్నాలజీస్.
Published date : 19 Sep 2017 03:38PM

Photo Stories