Skip to main content

మిలీనియల్స్ యువతలో నయా ధోరణి

ఆధునిక కార్పొరేట్ ప్రపంచం.. కెరీర్ పరంగా తీవ్రమైన పోటీ! ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకునే నిరుద్యోగులులక్షల సంఖ్యలోనే! కానీ, కొలువులో చేరాక మాత్రం యువత ఆలోచన మారిపోతోంది.
‘ఒకే సంస్థలో ఎంత కాలం ఉంటాం.. మరో కంపెనీలో కాలుపెడదాం.. జీతంతోపాటు మరింత పైస్థాయికి ఎదుగుదాం’ అనే ధోరణి ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. మిలీనియల్స్‌గా పేర్కొంటున్న నేటి యువత వెంటవెంటనే కంపెనీలు మారడంలో ముందుంటోంది. ఓ ప్రముఖ సంస్థ
వెల్లడించిన సర్వే గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో మిలీనియల్స్ ఎందుకు కంపెనీలు మారుతున్నారు.. ఎలాంటి రంగాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.. ఉద్యోగులు తరచూ కంపెనీలు మారే ధోరణిపై సంస్థలతోపాటు, నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
  • నవీన్.. ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఆరు నెలల క్రితమే చేరాడు. ఆరు నెలల అనుభవంతోనే మరో సంస్థలో కొలువు కోసం ప్రయత్నిస్తున్నాడు.. కారణం ఏంటని అడిగితే... కంపెనీ మారితే హోదాతోపాటు వేతనం కూడా పెరుగుతుంది అనేది అతని సమాధానం!
  • ప్రకాశ్.. ఓ టెలికం సంస్థలో పనిచేస్తున్నాడు. కంపెనీలో చేరి సంవత్సరం కూడా కాలేదు. కానీ.. ఇతను కూడా మరో కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఎందుకు అని అడిగితే.... ఇప్పుడు పనిచేస్తున్న సంస్థలో కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లభించడం లేదు. అందుకే కంపెనీ మారుతున్నా.. అని సమాధానం చెబుతున్నాడు.
  • నవీన్, ప్రకాశ్... మాత్రమే కాదు.. మిలీనియల్స్‌లో అధిక శాతం మంది.. కంపెనీలో చేరిన కొద్దిరోజులకే.. స్వల్ప అనుభవంతోనే.. మంచి అవకాశం వస్తే.. సంస్థ మారేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించడంలేదని తాజా సర్వేలో వెల్లడైంది.
అరవై శాతం మంది.. మారాలనే
ఇండీడ్ సంస్థ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం మిలీనియల్స్‌లో స్వల్ప కాలంలోనే మరో కంపెనీకి మారదాం అనే ధోరణి అరవై శాతం మందిలో కనిపించింది. కనిష్ట వ్యవధిగా 16 నెలల వ్యవధిని ప్రాతిపదికగా తీసుకొని.. మొత్తం 1002 మంది ఉద్యోగులతో నిర్వహించిన ఈ సర్వే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 60 శాతం మంది మిలీనియల్స్ తాము స్వల్ప వ్యవధిలోనే ఉద్యోగం మారుతున్నట్లు తెలిపారు. రెజ్యుమెలో ఎక్స్‌పీరియన్స్ కాలమ్‌లో కంపెనీల సంఖ్య ఎక్కువగా కనిపించాలనే తపనే అందుకు కారణమని 85 శాతం మంది సమాధానం చెప్పడం విశేషం. ఒక కంపెనీలో ఎంతకాలం పని చేశామనేది ముఖ్యం కాదు.. ఎన్ని సంస్థల్లో పనిచేశామో రెజ్యూమెలో పేర్కొనడమే తమకు ప్రధానమని చెబుతున్నారు. ఫలితంగా కొత్త సంస్థల్లో మంచి హోదాలు లభిస్తాయి అనేది కంపెనీలు మారుతున్న ఈ యువ ఉద్యోగుల ఉద్దేశంగా వినిపిస్తోంది.

నూతన నైపుణ్యాలు... రెజ్యూమె అప్‌డేట్
స్వల్ప వ్యవధిలోనే సంస్థలు మారడానికి.. రెజ్యూమెలో ఎక్కువ కంపెనీల్లో పనిచేసినట్లు కనిపించాలనే తపనతోపాటు మరెన్నో అంశాలు దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో... జాబ్‌రోల్ తాము ఆశించినట్లు లేకపోవడం.. పని వాతావరణం సరిగా లేకపోవడం.. మరింత మంచి హోదాతో కొత్త ఆఫర్ లభించడం.. వంటివి స్వల్ప వ్యవధిలోనే కంపెనీలు మారడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. తాజా సర్వే ప్రకారం 30 శాతం మంది తమ అంచనాలకు అనుగుణంగా జాబ్‌రోల్ లేనందున వేరే సంస్థలకు వెళుతున్నామని; 29 శాతం మంది పని వాతావరణం ఆహ్లాదకరంగా లేదని; 38 శాతం మంది ప్రస్తుత ఉద్యోగం కంటే మంచి ఆఫర్ లభించిందని పేర్కొన్నారు. సంస్థ మారితే కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు అవకాశం లభిస్తుందని 49 శాతం మంది; రెజ్యుమెలో పని అనుభవం పరంగా సంస్థల సంఖ్య ఎక్కువగా ఉంటే ఉన్నత అవకాశాలు లభిస్తాయని 43 శాతం మంది చెప్పడం గమనార్హం.

పురుషుల్లోనే అధికంగా..
స్వల్ప వ్యవధిలోనే తరచూ కంపెనీలు మారే ధోరణి పురుష యువ ఉద్యోగుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు రిస్క్ ఎందుకనే అభిప్రాయంతోనే ఉద్యోగం మారలేదని 47 శాతం మంది మహిళా ఉద్యోగులు తెలిపారు. సామాజిక పరిస్థితులు కూడా మహిళలు తరచూ కంపెనీలు మారకపోవడానికి ముఖ్య కారణంగా నిలుస్తోంది. కంపెనీలు మారాలనే ధోరణి.. 200 నుంచి 250 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించే మధ్య తరహా సంస్థల్లోనే అధికంగా కనిపిస్తోంది. మధ్య తరహా సంస్థల్లో పనిచేసిన అనుభవాన్ని ఎంఎన్‌సీ సంస్థల్లో కొలువు దీరేందుకు మార్గంగా భావిస్తుండటమే ఇందుకు కారణం.

ఐటీ, టెలికాంలోనే ఎక్కువ :
టెలికం, ఐటీ రంగాల్లోని మిలీనియల్స్ కొత్త సంస్థలవైపు చూసే ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రెండు రంగాల్లో 40 శాతం మంది యువ ఉద్యోగులు స్వల్ప వ్యవధిలోనే సంస్థలు మారుతున్నట్లు సర్వే గణాంకాల ద్వారా స్పష్టమైంది. ఈ రంగాల్లో కొత్త సంస్థలు ఏర్పాటవుతూ.. ఆకర్షణీయ వేతనాలతోపాటు కెరీర్ ఉన్నతికి అవకాశం కల్పిస్తుండటం వల్లే తరచూ కంపెనీలు మారుతున్నారు. అంతేకాకుండా ఐటీ, టెలికం రంగాల్లోని సంస్థలు.. నూతన టెక్నాలజీలతో కార్యకలాపాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దీంతో ఇలాంటి సంస్థల్లో చేరితే తమకు కూడా కొత్త నైపుణ్యాలపై అవగాహన వస్తుందనే అభిప్రాయంతో యువ ఉద్యోగులు సంస్థలు మారుతున్నారు. అదే సమయంలో ఉత్పత్తి, యుటిలిటీ (గ్యాస్, విద్యుత్, ఎలక్ట్రిక్) వంటి సంప్రదాయ రంగాల్లోని యువత తాము పనిచేస్తున్న సంస్థల్లోనే ఎక్కువ కాలం కొనసాగడానికి మొగ్గు చూపుతున్నారు.

దీర్ఘకాలంలో ఇబ్బందే..
మిలీనియల్స్‌లో తరచూ సంస్థలు మారాలనే దృక్పథం పట్ల కంపెనీల్లో విముఖత కనిపిస్తోంది. ఈ ధోరణి.. యువతలో అనిశ్చితి, పనిచేస్తున్న సంస్థ పట్ల విధేయత లేకపోవడాన్ని సూచిస్తుందని భావిస్తున్నాయి. తరచూ కంపెనీలు మారే వారిని ఇటీవల కాలంలో ఒక్కరిని కూడా తాము ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ చేయలేదని ఏకంగా 87 శాతం కంపెనీలు పేర్కొనడం విశేషం. సంస్థలు మారదాం.. కొత్త కొలువులు సొంతం చేసుకుందాం.. అంటున్న యువత సైతం సంస్థలు మారడం దీర్ఘకాలంలో ఇబ్బందేనని చెప్పడం గమనార్హం. గత అయిదేళ్ల వ్యవధిలో రెండుసార్లు ఉద్యోగం మారిన వారిలో 69 శాతం మంది.. తమను కొత్త సంస్థలు పరిగణనలోకి తీసుకోవట్లేదని, దీనికి ప్రధాన కారణం తరచూ కంపెనీలు మారడమేనని పేర్కొన్నారు.

'నిలకడే' మేలు :
మిలీనియల్స్ తమ ధోరణిని మార్చుకొని పని చేస్తున్న సంస్థలో నిలకడగా ఉండటమే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు కేటాయించిన జాబ్ రోల్‌కి సంబంధించి మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త నైపుణ్యాలపై అవగాహన పెంచుకొని.. వాటిని విధుల్లో అన్వయిస్తే ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలోనే మంచి గుర్తింపు లభిస్తుందని, ఉన్నత స్థానాలు కూడా దక్కుతాయని ఆయా రంగాల నిపుణులు సూచిస్తున్నారు.

ఎంత మంది.. ఎందుకు మారుతున్నారు ?
కారణం శాతం
అంచనాలకు అనుగుణంగా జాబ్ రోల్ లేదు 30
ఆహ్లాదకర పని వాతావరణం లేదు 29
ప్రస్తుతం కంటే మంచి ఆఫర్ లభించింది 38
కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం 49
రెజ్యుమెలో పని అనుభవంలో ఎక్కువ సంస్థలు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం 43
ఇతర రంగాలతో పోల్చితే ఐటీ, టెలికం రంగాల్లో ఈ ధోరణి ఎక్కువ 40

నచ్చకపోతే.. గుడ్ బై
నేటి యువత తాము పనిచేస్తున్న సంస్థల్లో సరైన రీతిలో విధులు కేటాయించలేదని భావిస్తే.. తక్షణమే మరో మెరుగైన అవకాశం కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థల దృక్పథం కూడా మారాల్సిన అవసరముంది. ఉద్యోగులను తమ సంస్థలో నిలకడగా పనిచేసేలా చేయడానికి, ప్రతిభను ఆకర్షించడానికి కొత్త మార్గాలు అన్వేషించాలి.
- శశి కుమార్, మేనేజింగ్ డెరైక్టర్, ఇన్‌డీడ్.

కనీసం రెండు, మూడేళ్లు అనుభవం గడించాకే..
యువత కనీసం రెండు లేదా మూడేళ్లు అనుభవం గడించాకే కంపెనీ మారడంపై దృష్టి పెట్టడం మంచిది. సంస్థను మారినప్పుడు వేతనంలో 20 నుంచి 30 శాతం.. పెద్ద సంస్థ అయితే గరిష్టంగా 35 శాతం పెరుగుదల ఉంటుంది. ఆర్థికంగా ఇది ఆకర్షణీయంగానే ఉంటుంది. కానీ.. సంస్థలు మారేవారి పట్ల దీర్ఘకాలంలో ప్రతికూల అభిప్రాయమే ఉంటుంది. దీన్ని గమనించి అడుగులు వేయాలి.
- జి.ఆర్.రెడ్డి, ఫౌండర్, హ్యూసిస్ కన్సల్టింగ్ లిమిటెడ్.
Published date : 16 Feb 2019 06:31PM

Photo Stories