Skip to main content

కొత్త వ్యాపారం ప్రారంభించాలనే వారి శిక్షణకు కొన్ని కోర్సులు.. వివరాలు తెలుసుకోండిలా..!

శ్రీరామ్‌.. ఎంబీఏ విద్యార్థి. అతనికి ‘ఎంటర్‌ప్రెన్యూర్‌’గా మారి.. సొంత వ్యాపారం ప్రారంభించాలని ఉంది. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే అందుకు అవసరమైన ప్రణాళికలు వేసుకుంటున్నాడు.
 

భువన.. ఇంజనీరింగ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ మూడో సంవత్సరం విద్యార్థిని. ఇష్టమైన రోబోటిక్స్‌ రంగంలో ‘స్టార్టప్‌’ ప్రారంభించి.. సొంతంగా ఎదగాలని కలలు కంటోంది.

ఈ ఇద్దరు విద్యార్థులే కాదు.. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్‌లేదా పోస్టు గ్రాడ్యుయేషన్‌చేస్తున్న విద్యార్థులు ఎంతో మంది ఏదైనా వ్యాపారం ప్రారంభించి.. సొంతంగా ఎదగాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో ఎక్కువ మంది స్టార్టప్‌ లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలని భావిస్తున్నారు.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అంటే.. స్వయం ఉపాధి దిశగా కొత్త వ్యాపారం ప్రారంభించడం. వ్యాపారం మొదలుపెట్టిన వ్యక్తి.. స్వయం కృషితో, సొంత నిధులతో ముందుకు సాగాల్సి ఉంటుంది.

స్టార్టప్‌ అంటే.. ఒక ఐడియాను కంపెనీగా కార్యరూపంలోకి తెచ్చే క్రమంలో.. దానిపై ఆసక్తి ఉన్నవారు పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభిస్తారు. స్టార్టప్‌లో వ్యాపార ఆలోచన ఇచ్చినవారితోపాటు ఇతర వాటాదారులు కూడా ఉంటారు. స్టార్టప్‌ ఆలోచన నచ్చితే దాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు మెంటార్స్, పెట్టుబడిదారులు అందుబాటులో ఉంటారు.

కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ గాని, స్టార్టప్‌ గాని ప్రారంభించాలనుకునేవారికి అందుకు అవసరమైన కనీస పరిజ్ఞానం, సరైన దిశానిర్దేశం లేకుంటే.. తొలి అడుగులోనే ఆటంకాలు ఎదురవుతాయి. ఇలాంటి పరిజ్ఞానం, అవగాహన అందించే పలు కోర్సులు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.

బీబీఏ, ఎంబీఏలో స్పెషలైజేషన్స్‌..
యువతలో ఎంటర్‌ప్రెన్యూర్‌ ప్రతిభకు, స్టార్టప్‌ ఆలోచనలకు కొదవలేదు. అందుకు అవసరమైన నిధులను అందించే ఇన్వెస్టర్లూ ఉన్నారు. కాని సదరు స్టార్టప్‌ను, వ్యాపారాన్ని మార్కెట్‌లో నిలబెట్టే క్రమంలో చాలామంది తొలి అడుగులోనే విఫలమవుతున్నారు. అందుకే ముందుగా వ్యాపార ఆలోచన కలిగిన వ్యక్తుల ప్రతిభకు మెరుగులుదిద్దడం అవసరం అంటున్నారు నిపుణులు. మన దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోర్సులను పలు విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ప్రధానంగా బీబీఏ, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సబ్జెక్టును స్పెషలైజేషన్‌ లేదా ఎలక్టివ్‌ కోర్సుగా అందిస్తున్నారు. మరికొన్ని విద్యా సంస్థలు పార్ట్‌టైమ్‌ విధానంలోను, షార్ట్‌టర్మ్‌ డిప్లొమా కోర్సుగాను అందిస్తున్నాయి. ఈ కోర్సులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు అవసరమైన వ్యాపార నైపుణ్యాలు,శిక్షణ మాత్రమే కాకుండా.. వ్యాపార విస్తరణకు అవసరమైన సాధనాలను, పద్ధతులను కూడా నేర్పిస్తాయి. లాభదాయకమైన వ్యాపారాన్ని నిర్మించడంలో పాటించాల్సిన జాగ్రత్తలు, అవసరమైన శక్తిసామర్థ్యాలను ఈ కోర్సుల ద్వారా తెలుసుకోవచ్చు.

ఐఐఎంల్లో సర్టిఫికేషన్‌ కోర్సులు..
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌/స్టార్టప్స్‌ గురించి విద్యార్థులు నేర్చుకునేందుకు వీలుగా ఐఐఎం–రోహ్‌తక్‌ నాలుగు నెలల సర్టిఫికేషన్‌ప్రోగ్రామ్‌ అందిస్తోంది. దీనిద్వారా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవసరమైన శిక్షణను ఇస్తోంది. ఒక సొంత వ్యాపార సంస్థను ఎలా ప్రారంభించాలి. దాని కార్యకలాపాలను విజయవంతంగా నడపడం ఎలాగో ఇక్కడ శిక్షణనిస్తారు. ఇప్పటికే సొంత వ్యాపారం చేస్తున్నవారు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటారు. నాలుగు నెలల కాలవ్యవధి గల ఈ కోర్సులో డిగ్రీ ఉత్తీర్ణులు చేరవచ్చు. డిప్లొమా చేసి ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారికి సైతం అవకాశం కల్పిస్తున్నారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.iimrohtak.ac.in  

ఐఐఎం–అహ్మదాబాద్‌: ఉన్నత ప్రమాణాలతో మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్న ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌–అహ్మదాబాద్‌(ఐఐఎం–ఏ) సైతం ‘యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ప్రోగ్రామ్‌’ను ఆన్‌లైన్‌లో అందిస్తోంది. కేస్‌ స్టడీ ఆధారంగా ఇక్కడ శిక్షణనిస్తున్నారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://web.iima.ac.in/exed/programme&details.php?id=ODM1

ఐఐఎం బెంగళూరు: ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌లో ఒకటైన ఐఐఎం బెంగళూరు సైతం.. మాస్టర్స్‌ డిగ్రీ స్థాయిలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోర్సును అందిస్తోంది. ఎంబీఏ ఇన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. డిగ్రీతోపాటు రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ఈ కోర్సు ప్రవేశాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటితోపాటు దాదాపు అన్ని ఐఐఎంలు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోర్సులను అందిస్తున్నాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iimb.ac.in/programmes  

డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లోను కోర్సులు..
ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌శిక్షణకు ప్రాధాన్యం పెరిగింది. పలు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ సైతం చాలావరకు ఉచితంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఆయా వేదికలతో ఒప్పందం చేసుకున్న హార్వర్డ్, ఎంఐటీ వంటి టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఈ కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తున్నాయి. ముఖ్యంగా ‘ఎడెఎక్స్‌’లో దాదాపు 100కు పైగా బిజినెస్‌ స్కూల్స్‌ వివిధ స్థాయిల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోర్సులు అందిస్తున్నాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.edx.org/learn/entrepreneurship

ఉడెమీ ఉందిగా..
వ్యాపార ఆలోచనలను కార్యరూపంలోకి తేవాలంటే.. ఎన్నో అడ్డంకులను అధిగమించాలి. ఫండింగ్‌ నుంచి మార్కెటింగ్‌ వరకూ.. ఇందులో అనేక రకాల సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించేందుకు అవసరమైన అవగాహన పెంపొందించేలా ఆన్‌లైన్‌ వేదిక ఉడెమీ పలు కోర్సులను అందిస్తోంది. అతి తక్కువ ఫీజులతో స్టార్టప్‌ లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై శిక్షణ ప్రోగ్రామ్స్‌ను డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఉడేమీ’ అందుబాటులో ఉంచింది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.udemy.com/courses/business/entrepreneurship/ 

అలిసన్‌లో అవసరమైన కోర్సులు..
మరో డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ ‘అలిసన్‌’ సైతం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఇందులో నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్, నిర్ణయం తీసుకోవడం, టీమ్‌ ప్లేయర్‌గా ఉండటం వంటి నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. ఇందులో ఉచితంగా అందించే కోర్సులతోపాటు నిర్ణీత రుసుం చెల్లించి షార్ట్‌టర్మ్‌ కోర్సులు, సర్టిఫికెట్‌ కోర్సులు సైతం చేయవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://alison.com/courses/entrepreneurship  

Published date : 16 Apr 2021 02:22PM

Photo Stories