Skip to main content

కొలువుదీర్చే కోర్సులెన్నో..

ఇంజనీరింగ్ చదివితేనే ఉద్యోగం దొరుకుతుందా..బీటెక్‌లో చేరకుంటే... భవిష్యత్ లేదా..ఐఐటీలు, నిట్‌ల్లో ప్రవేశం లభించకుంటే.. కెరీర్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనా?... ఇలాంటి అభిప్రాయాలు ఎంతమాత్రం సరికాదంటున్నారు నిపుణులు!! ఎందుకంటే.. లా కోర్సులతో కార్పొరేట్ జాబ్స్ సొంతం చేసుకోవచ్చు..

సోషల్ సెన్సైస్‌తో ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, గ్రూప్స్ వంటి సర్కారీ కొలువులు సంపాదించొచ్చు. సెన్సైస్‌తో పరిశోధనల్లో రాణించి.. సైంటిస్టులుగా ఎదగొచ్చు.. ఇక ఇంగ్లిష్ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుకురావచ్చంటున్నారు... ఈ పెద్దోళ్లింతే పురాణాలు చెబుతారు అని అనుకోకుండా ఓసారి ఓలుక్కెయ్యండి.

కొలువుల కోర్సు... కామర్స్
ఆసుపత్రులు, సాఫ్ట్‌వేర్ సేవల రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ పరిశ్రమ, ఆన్‌లైన్ మార్కెటింగ్, బ్యాంకింగ్, ఈ-కామర్స్ తదితర విభాగాల్లో కామర్స్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు స్వాగతం పలుకుతున్నాయి. కెరీర్ ప్రారంభంలోనే రూ.15 వేలకు తగ్గకుండా జీతం లభిస్తుంది. ప్రస్తుతం కామర్స్‌లోనూ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరైంది. కాబట్టి విద్యార్థులు సంబంధిత కంప్యూటర్ కోర్సుల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు కృషిచేయాలి. ప్రభుత్వ రంగంలోనూ కామర్స్ అభ్యర్థులకు అవకాశాలు లభిస్తున్నాయి. సెబీ, బీఎస్‌ఎన్‌ఎల్, జెన్‌కో, ట్రాన్‌‌సకో, బీహెచ్‌ఈఎల్ మొదలైన సంస్థల్లో అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నాయి. వీటికి కామర్స్ గ్రాడ్యుయేట్లు అర్హులు. ఇటీవల ఉస్మానియా విద్యార్థులు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు 18 మంది, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 50 మంది ఎంపికయ్యారు.
- ప్రొఫెసర్ వి.అప్పారావు, ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్

మీడియాలో బోలెడు అవకాశాలు
ఉస్మానియాలో ఎంసీజే కోర్సులో చేరే వారిలో ఇంజనీరింగ్ అభ్యర్థులే అధికంగా ఉన్నారు. మాస్‌కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివిన విద్యార్థులకు ఎన్నో ఉపాధి వేదికలు ఉన్నాయి. వీరు మీడియా సంస్థల్లో రిపోర్టర్, సబ్ ఎడిటర్‌గా, న్యూస్ రీడర్‌గా, రీసెర్చ్ వైపు, ఎన్‌జీవోల్లో, ప్రజాసంబంధాల విభాగాల్లో, అడ్వర్టైజింగ్ రంగంలో రాణించవచ్చు. అకడమిక్‌గా ఉన్నత చదువుల వైపు వెళ్లొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అయితే డిగ్రీ స్థాయిలో మాస్‌కమ్యూనికేషన్, జర్నలిజం సబ్జెక్టులను ప్రత్యేకంగా అందిస్తున్న కాలేజీలు చాలా తక్కువ. కానీ కాంబినేషన్‌లో జర్నలిజం ఒక ముఖ్య సబ్జెక్టుగా చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. లయోలా కాలేజీ, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్, సెయింట్ ఫ్రాన్సిస్ వంటి కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా మాస్‌కమ్యూనికేషన్, జర్నలిజం కోర్సులు అందిస్తున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాలకు వేలమంది పోటీ పడుతుంటే.. జర్నలిజంలో మాత్రం పోటీ వందల్లోనే ఉంటుంది.
- ప్రొఫెసర్ బి.బాలస్వామి, కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఓయూ.

ఇంగ్లిష్‌తో ప్రపంచమే కుగ్రామం
కొంతమంది తల్లిదండ్రులైతే తమ పిల్లల శక్తి సామర్థ్యాలను సరిగా అంచనా వేయకుండా.. వారి ఆసక్తిని పరిగణనలోకి తీసుకోకుండా.. తమ అభిప్రాయాలను వారిపై బలవంతంగా రుద్దుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థుల్లో కేవలం 18 శాతం మందికే జాబ్స్ లభిస్తున్నాయని నివేదికలు చెబుతున్న నేపథ్యంలో.. మంచి అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ కోర్సుల వైపు దృష్టిసారించడం మేలు. బీఏ (ఇంగ్లిష్ లిటరేచర్) వంటి కోర్సులు చదివే విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అలవడుతుంది. చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, సమాజం-సంస్కృతిని అవగాహన చేసుకునే నేర్పు అలవడుతుంది. ఎంఏ (ఇంగ్లిష్) కూడా చదివితే ఇంగ్లిష్ మీడియాలో ఉజ్వల కెరీర్ అవకాశాలు అందుకోవచ్చు. నేడు కార్పొరేటు రంగంలో, వెబ్ మీడియాలో అవకాశాలు పుష్కలం. ఇక్కడ మంచి వేతనాలు కూడా లభిస్తున్నాయి. ప్రారంభ వేతనం రూ.30 వేలకు తగ్గకుండా ఉంటుంది. ఢిల్లీలో బీఏ (ఇంగ్లిష్ లిటరేచర్) కోర్సుకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్ కల్పిస్తారు. వీరు ఎంఏ (ఇంగ్లిష్) తర్వాత జర్నలిజం కోర్సుల్లోనూ చేరొచ్చు. బోధనా రంగంలోనూ ఇంగ్లిష్ టీచర్లకు అవకాశాలు అనేకం.
-ప్రొఫెసర్ కరుణాకర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంగ్లిష్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్‌‌ట్స అండ్ సోషల్ సెన్సైస్.

ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి
విద్యార్థులు చదివే కోర్సు ఏదైనా సబ్జెక్ట్ పరిజ్ఞానం పెంచుకునేందుకు కృషి చేయాలి. ముఖ్యంగా సోషల్ సెన్సైస్‌లో అధ్యయనానికి ఎంతో స్కోప్ ఉంది. ఇప్పటికి భారతదేశ చరిత్ర సమగ్రంగా అందుబాటులో లేదు. పాశ్చాత్యులు చెప్పినదే తప్ప, మన దగ్గర కొత్తగా కనుగొన్నది లేదు. మూలాలకు వెళ్లి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. సోషల్ సెన్సైస్‌లో లోతైన పరిశోధనలు జరగాలి. ఈ సబ్జెక్టులో ప్రావీణ్యం పొందాలంటే.. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పట్టుసాధించాలి. చదువుకుంటూనే తమ బలాలను తెలుసుకోవాలి. అయితే, ఆసక్తి ఉంటేనే ఈ కోర్సుల్లో చేరాలి. రైటింగ్, స్పీకింగ్‌లలో ప్రతిభ కనబరిస్తే ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి. సోషల్ సెన్సైస్ అధ్యయనం వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా ఎదగడానికి దోహదం చేస్తుంది.
- ప్రొఫెసర్ వి.యోగ జ్యోత్స్న. డీన్, సోషల్ సెన్సైస్, ఓయూ.

ఫిజికల్ ఎడ్యుకేషన్.. 100 శాతం ప్లేస్‌మెంట్స్
ప్రస్తుతం ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బోలెడు అవకాశాలు ఉన్నాయి. బీపీఎడ్, ఎంపీఎడ్ వంటి కోర్సులు చేసిన వారు ఎక్కడా ఖాళీగా ఉండటంలేదు. ప్రతి స్కూళ్లో వీరి అవసరం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఉన్నత విద్య కోర్సుల్లోనూ చేరొచ్చు. స్పెషలైజ్డ్ కోర్సులు చేస్తే ఏదైనా ఒక క్రీడలో కోచ్‌గా స్థిరపడవచ్చు. తాజాగా కేంద్ర ప్రభుత్వం.. సీబీఎస్‌ఈ స్కూళ్లల్లో ఆటల పీరియడ్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అవకాశాలు పెరగనున్నాయి.
- ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్, ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఓయూ.

ఒకప్పటి ‘లా’ కాదు..
దేశంలో ఉన్న నేషనల్ లా యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు కార్పొరేటు సంస్థలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. దేశంలోకి బహుళ జాతి కంపెనీలు వస్తున్నాయి. వీటికి ‘లా’ నిపుణుల అవసరం ఉంది. ఆయా కార్పొరేటు సంస్థలు లా గ్రాడ్యుయేట్లకు మంచి వేతనాలు అందించడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు వీరికి లభిస్తున్నాయి. కనీస వేతనం ఫ్రెషర్స్‌కు సగటున నెలకు రూ.40 వేల నుంచి 50 వేలుగా ఉంది. పని అనుభవంతో ఆకర్షణీమైన జీతభత్యాలు అందుకోవచ్చు. మేనేజర్ (లీగల్ పొజిషన్) స్థాయికి చేరుకుంటే రూ.లక్షల్లోనే వేతనాలు లభిస్తాయి. అంతేకాకుండా లా ప్రొఫెషన్‌లో సొంతంగా ప్రాక్టీస్ చేసే వెసులుబాటు కూడా ఉంది. లా ఫర్మ్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు.
- ప్రొఫెసర్ ఎస్.బి.ద్వారకానాథ్, హెచ్‌వోడీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లా, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, ఓయూ (కన్వీనర్, టీఎస్ లాసెట్ 2018).

సబ్జెక్టుపై పట్టుంటే... ఉన్నత శిఖరాలకు..
మన దగ్గర ఎకనామిక్స్ కోర్సు అందించడంలో పలు ఇన్‌స్టిట్యూట్స్‌కు మంచి పేరుంది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, జేఎన్‌యూ, గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (పుణె), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ (ఢిల్లీ), ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ (ముంబై), సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్, హైదరాబాద్), కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ (రాజేంద్రనగర్, హైదరాబాద్) వంటి వాటిల్లో చేరితే కెరీర్‌కు ఢోకా ఉండదు. ఎకనామిక్స్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాల పరంగా చూస్తే.. ఎకనామిస్టుల అవసరం ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి. అందులో లోపాలు గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆర్థిక వేత్తల అవసరం తప్పనిసరి. ఆయా ప్రాజెక్టుల్లో ఎకనామిక్స్ చదివిన వారినే నియమిస్తారు. ఇక ప్రభుత్వాలు, ఎన్‌జీవోలు మొదలైనవి చేపట్టే సామాజిక అధ్యయనాల్లోనూ వీరి పాత్ర కీలకం.
- ప్రొఫెసర్ ఎ.నకులారెడ్డి, హెచ్‌వోడీ, డిపార్‌‌టమెంట్ ఆఫ్ ఎకనామిక్స్, ఓయూ.

ఆసక్తికి తగ్గ కోర్సులో చేర్పించాలి.
బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులకు అసలు భవిష్యత్తు లేదనే అభిప్రాయం సరికాదు. బీఏ చదివిన అమ్మాయి టీనా దాబి సివిల్స్‌లో మొదటి ర్యాంకు సాధించిందనే విషయాన్ని గుర్తించాలి. ఇంటర్‌లో ఉన్నప్పుడే పిల్లలకు ఏ కోర్సు నప్పుతుందో అర్థం చేసుకోవాలి. వారి ఆసక్తికి తగ్గ కోర్సులో చేర్పించాలి. మున్ముందు కాలంలో బీఏ, బీకామ్, బీఎస్సీ(మైక్రోబయాలజీ, జెనిటిక్స్, బయోకెమిస్ట్రీ) వంటి కోర్సులకు భవిష్యత్తు ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ వంటి కోర్సుల్లో 100 శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ల కెరీర్ అయితే చాలా ఆశాజనకంగా ఉంటుంది. వీరు బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌ీసీ వంటి పోటీ పరీక్షల్లో సులువుగా ఉద్యోగాలు సాధించగలరు. డిగ్రీ తర్వాత కూడా వినూత్న మార్గాలు ఎంచుకునే అవకాశముంది. ఈ రోజుల్లో విద్యార్థులు చదివే కోర్సు ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుంటే కెరీర్‌లో మెరవచ్చు.
- ప్రొఫెసర్ బండారి శంకర్, డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ సెన్సైస్(రిటైర్డ్) ఉస్మానియా యూనివర్సిటీ.

Published date : 11 May 2018 05:32PM

Photo Stories